తుప్పు పట్టిన పరికరాలు ఇచ్చి ఇంకెన్నాళ్లు... | YSRCP Leader BY Ramaiah Criticises Minister Kalva Srinivasulu | Sakshi
Sakshi News home page

‘వాల్మీకి జాతి మొత్తాన్ని అవమానించారు’

Published Sat, Jan 26 2019 3:10 PM | Last Updated on Sat, Jan 26 2019 5:08 PM

YSRCP Leader BY Ramaiah Criticises Minister Kalva Srinivasulu - Sakshi

సాక్షి, కర్నూలు : రానున్న ఎన్నికల్లో బీసీల ద్రోహి చంద్రబాబుకు బీసీలంతా ఓటుతో బుద్ధి చెప్పబోతున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కర్నూలు పార్లమెంట్‌ అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబును వాల్మీకుల దేవుడు అంటూ మంత్రి కాలువ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఆయన చేసిన వ్యాఖ్యలు వాల్మీకి జాతి మొత్తాన్నిఅవమానపరిచేలా ఉన్నాయని ధ్వజమెత్తారు. సొంత ప్రాపకం కోసం జాతి ఆత్మాభిమానాన్ని చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టిన ఘనుడు శ్రీనివాసులు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాల్మీకులు నమ్మకానికి మారుపేరని.. వారి మనోభావాలతో ఆడుకోవద్దని హితవు పలికారు. చంద్రబాబు మోసాలను వాల్మీకులు గుర్తించారని.. ఇకపై ఆయన వారిని వంచించలేరని అన్నారు. వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ తమకు అండగా ఉంటారన్న నమ్మకం బీసీల్లోని అన్ని వర్గాల్లో ఏర్పడిందని పేర్కొన్నారు.

వాల్మీకి ఫెడరేషన్‌ ఘనత వైఎస్సార్‌ది కాదా..
గత నాలుగున్నరేళ్ల కాలంలో టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌లో ఏనాడైనా వాల్మీకి రిజర్వేషన్‌పై నోరు విప్పారా అని రామయ్య ప్రశ్నించారు. ఒకరికి మంత్రి పదవి ఇచ్చినంత మాత్రాన జాతి మొత్తాన్ని ఉద్ధరించినట్టుకాదన్నారు. వాల్మీకి ఫెడరేషన్ ఏర్పాటు చేసిన ఘనత దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. వాల్మీకి జయంతిని అధికారికంగా జరుపుకునేందుకు చర్యలు తీసుకుంది కూడా ఆయనేనన్న విషయాన్ని గుర్తుచేశారు. వాల్మీకుల అభ్యున్నతికి పాటుపడేందుకు వైఎస్ జగన్ వారికి చట్టసభల్లో స్థానం కల్పించనున్నారని పేర్కొన్నారు.

తుప్పు పట్టిన పరికరాలు ఇచ్చి..
బీసీల కొరకు ఏర్పాటు చేసిన బీసీ సబ్‌ప్లాన్‌ నిధులు ఏమయ్యాయో మంత్రి కాల్వ సమాధానం చెప్పాలని రామయ్య డిమాండ్‌ చేశారు. సంవత్సరానికి రూ. 10 వేల కోట్లు ఇస్తామన్న చంద్రబాబు గత ఐదు సంవత్సరాలుగా బీసీలకు ద్రోహం చేశారని విమర్శించారు. ఆదరణ పథకం కింద తుప్పు పట్టిన పరికరాలు ఇచ్చి బీసీలను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. బీసీల అభ్యున్నతికి వైఎస్‌ జగన్ డిక్లరేషన్ ఇవ్వబోతున్నారని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement