నూనెపల్లెలో పర్యటిస్తున్న శిల్పా రవి
నంద్యాల: టీడీపీ హయాంలో అవినీతికి పెచ్చుమీరిందని, దోపిడీ ప్రభుత్వాన్ని సాగనంపేరోజు ఎప్పుడెప్పుడు వస్తుందానని ప్రజలు ఎదురు చూస్తున్నారని వైఎస్సార్‌సీపీ నంద్యాల నాయకులు శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి అన్నారు. శుక్రావారం పట్టణంలోని నూనెపల్లెలో రావాలి జగన్.. కావాలి జగన్.. కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి జగన్ ముఖ్యమంత్రి అయితే చేపట్టే నవరత్నాల సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల మంజూరులో పేదవారికి న్యాయం జరగడం లేదన్నారు. ఎవరు లంచం ఇస్తే వారికి మాత్రమే పనులు జరుగుతుండటంతో పేదలు మరింత నిరుపేదలుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. పక్కా గృహాల మంజూరు, వృద్ధాప్య పింఛన్లు, కార్పొరేషన్ రుణాలు ఇలా ప్రతి పథకానికి టీడీపీ నాయకులు డబ్బు వసూలు చేస్తున్నారని విమర్శించారు.
జిల్లా రైతులకు అన్యాయం
టీడీపీ హయాంలో రైతాంగం కన్నీరు పెడుతోందని శిల్పా రవి అన్నారు. కర్నూలు జిల్లా కరువు కాటకాలతో అల్లాడుతుంటే ఈ ప్రాంత ప్రజలను ఎండగట్టి అనంతపురం, నెల్లూరు జిల్లాలకు సాగునీరు పంపారని విమర్శించారు. ఇటీవల చంద్రబాబు జలసిరి కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లాకు వచ్చినప్పుడు ఈ ప్రాంత రైతుల కన్నీరు కనపడలేదా అని ప్రశ్నించారు. నాలుగున్నర సంవత్సరాలుగా ఒక్క పంటకు కూడా మద్దతు ధర లేదని, దీని వలన రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు మంచిరోజులు రావాలంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పాలన మళ్లీ రావాలని, అది ఒక్క జగన్‌మోహన్‌రెడ్డికే సాధ్యమన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ అమృతరాజు, వైఎస్సార్‌సీపీ నాయకులు సోమ గోని శ్రీనివాసగౌడు, తోట రామకృష్ణ, రమణగౌడ్, తోట రాజగోపాల్, ఓబులేసు గౌడ్, తోట మద్దిలేటి, కుమారగౌడ్, పోలూరు శీను పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment