
సాక్షి, విజయవాడ : టీడీపీ నేతలు రాబంధులుగా మారి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని వైఎస్సార్ సీపీ నాయకురాలు ఉండవల్లి శ్రీదేవి ఆరోపించారు. శనివారం ఆమె వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతల దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోయిందన్నారు. ‘దండుపాళ్యం’ దోపిడీ ముఠాలా తయారయి రాజధాని భూములను ఆక్రమించుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని సింగపూర్‌లా చేస్తానని చెప్పి రైతుల వద్ద భూములు తీసుకొని వారిని మోసం చేశారని దుయ్యబట్టారు.
భూముల కబ్జా అయిపోవడంతో ఇక నదిగర్భంపై టీడీపీ నేతల కన్నుపడిందన్నారు. చంద్రబాబు, దేవినేని ఉమామహేశ్వరరావు ఇంటికి మధ్యలో రిసార్ట్స్ నిర్మాణం కోసం కృష్ణా నదిని పూడ్చుతున్నారని ఆరోపించారు. పెద్ద పెద్ద యంత్రాలతో 70 ఎకరాలలో మట్టిదిబ్బను నిర్మించి కబ్జాకు స్కెచ్ వేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎన్నికల సంఘం తక్షణమే జోక్యం చేసుకొని రిసార్ట్స్ నిర్మాణాన్ని అడ్డుకోని ఇసుక దిబ్బలను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. నది ప్రవాహాన్ని దిశ మార్చడం చట్టరిత్యా నేరమని, టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని దేవి డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment