రాజ్యసభ సభ్యుడిగా వేమిరెడ్డి | YSRCP Leader Vemireddy prabhakar reddy Elected As MP | Sakshi
Sakshi News home page

రాజ్యసభ సభ్యుడిగా వేమిరెడ్డి

Published Fri, Mar 16 2018 9:41 AM | Last Updated on Tue, May 29 2018 4:40 PM

YSRCP Leader Vemireddy prabhakar reddy Elected As MP - Sakshi

వేమిరెడ్డి ఇంటివద్ద బాణసంచా పేల్చి సంబరాలు చేసుకుంటున్న వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు (ఇన్‌సెట్లో) వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు అమరావతిలో ఆయన రిటర్నింగ్‌ అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. రాష్ట్రంలో మూడు స్థానాలకు గాను పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఒక స్థానం, టీడీపీకి రెండు స్థానాలు దక్కాయి. ఈ క్రమంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా జిల్లాకు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.

ఈ క్రమంలో ఆయన ఈ నెల7న రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్‌ దాఖలు చేశారు. అధికార పార్టీ వారి బలానికి అనుగుణంగా ఇద్దరు అభ్యర్థుల్నే బరిలో దింపటంతో ఎన్నిక ఏకగ్రీవం అయింది. నామినేషన్‌ స్వీకరణ, స్క్రూట్ని ప్రక్రియ ముగింపు అనంతరం ఉపసంహరణకు గురువారం వరకు గడువు ఉంది. ఈ క్రమంలో ఉపసంహరణ ప్రక్రియ ముగిశాక గురువారం అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కె.సత్యనారాయణ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి ధ్రువీకరణ పత్రం అందజేశారు. వేమిరెడ్డి ఎన్నికతో జిల్లాలో పార్టీ శ్రేణుల్లో సందడి నెలకొంది. వేమిరెడ్డి అనుచరుడు, పార్టీ నేత కేతంరెడ్డి వినోద్‌రెడ్డి నేతృత్వంలో గురువారం సాయంత్రం వేమిరెడ్డి నివాసం వద్ద బాణసంచా కాల్చి సందడి చేశారు.

సేవాకార్యక్రమాలతో ప్రజల్లోకి..  
వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి వీపీఆర్‌ ఫౌండేషన్‌ ద్వారా జిల్లాలో అనేక సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పేద విద్యార్థుల విద్య కోసం ఉచితంగా ఫౌండేషన్‌ నేతృత్వంలో స్కూల్, అలాగే వైద్యసేవలు కొనసాగిస్తున్నారు. దీంతో పాటు జిల్లాలో అనేక గ్రామాల్లో ఉచితంగా రూ.లక్షల ఖర్చుతో తాగునీటి ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేశారు. అలాగే అనేక సామాజిక సేవాకార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. దేవాలయాలకు భారీగా విరాళాలు. ఆధ్యాత్మిక సభలు నిర్వహణ, ఫౌండేషన్‌ ద్వారా నిష్ణాతులైన వైద్యులతో ఉచిత మెడికల్‌ క్యాంప్‌లు నిర్వహిస్తున్నారు.

రాష్ట్ర కోటాలో మూడో నేతగా  వేమిరెడ్డి
ఇదిలా ఉంటే ఇప్పటి వరకు నెల్లూరు జిల్లాకు చెందిన ఏడుగురు నేతలు రాజ్యసభ సభ్యులుగా పనిచేశారు. ప్రస్తుతం కొందరు పదవిలో కొనసాగుతున్నారు. అయితే ప్రత్యక్షంగా రాష్ట్ర కోటాలో 1983లో బెజవాడ పాపిరెడ్డి ఎన్నిక కాగా ఆ తర్వాత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి వేణుంబాక విజయసాయిరెడ్డి 2016లో ఎన్నికయ్యారు. వైఎస్సార్‌ సీపీ నుంచే వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

బయోడేటా
పేరు: వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి
పుట్టిన తేదీ : 19–4–1956
తల్లిదండ్రులు :శివకోటారెడ్డి, శ్యామలమ్మ
భార్య : వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
విద్యాభాస్యం : ప్రాథమిక విద్య– మదనపల్లిలోని రిషీవ్యాలీ స్కూల్‌
గ్రాడ్యుయేషన్‌ :1973–1976 చెన్నైలోని లయోలా కళాశాల
వ్యాపారం :    గ్లోబల్‌ కాంట్రాక్టర్‌ 1979లో తండ్రి నిర్వహిస్తున్న మైకా వ్యాపారం నిర్వహణ, 1981లో లక్ష్మికన్‌స్ట్రక్షన్‌ కంపెనీ నిర్వహణ 1989లో వీపీఆర్‌ మైనింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రా ప్రారంభం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement