సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఆ బిడ్డలు చేసిన పాపం ఏమిటో వారెవరికీ తెలియదు. తల్లి గర్భం నుంచి బాహ్య ప్రపంచంలోకి రాగానే అనాథలయ్యారు. అమ్మ ఆప్యాయత, నాన్న అనురాగానికి దూరమయ్యారు. వారిని ‘దాతృత్యం’ అక్కున చేర్చుకుంది. కన్నబిడ్డల కంటే మిన్నగా ఆదరించి కడపు నింపింది. అయితే దశాబ్దాలుగా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా.. పాలకులు మారినా ఇటువంటి వారికి అందరి మాదిరిగానే ప్రభుత్వ పథకాలకు అర్హులైనా సంక్షేమ పథకాలు అందని పరిస్థితి నెలకొంది. రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మానవత్వం, ప్రభుత్వ యంత్రాంగం చొరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హృదయాన్ని కదిలించింది. హృదయాలు ద్రవించే విషాద జీవితాల అనాథ బిడ్డలకు ఒక్క సంతకం ‘అమ్మఒడి’ ఆలంబనగా నిలిచింది.
తల్లిదండ్రుల స్థానంలో దేవుళ్ల పేరు
పాఠశాలలో చేరే విద్యార్థులకు తల్లిదండ్రులు పేర్లు, మతం, కులం తప్పనిసరిగా పొందుపర్చాల్సింగా స్పష్టమైన ఆదేశాలున్నాయి. అయితే తల్లిదండ్రులు ఎవరో తెలియని అనాథ బిడ్డలకు దేవుళ్లే తమ తల్లిదండ్రులుగా భావించి (సరస్వతి, లక్ష్మీ, పార్వతి, శివయ్య, బ్రహ్మ, విష్ణుమూర్తి) వంటి పేర్లను రాసుకుంటున్నారు. గతంలో ఎస్‌ఎస్సీ పరీక్షల్లో తండ్రి పేరే రాయాల్సి ఉండేది. 2009 సెప్టెంబర్ 14 నుంచి తల్లి పేరు తప్పనిసరి చేయడంతో తల్లి పేరు కూడా రాయాల్సి వస్తుంది. ఇప్పటి వరకు తండ్రి పేరు రాసేందుకు తంటాలు పడిన విద్యార్థులు చివరకు తల్లిదండ్రులుగా దేవుళ్లు, దేవతల పేర్లనే దరఖాస్తుల్లో నమోదు చేసుకుంటున్నారు.
సంక్షేమానికి దూరంగా అనాథ బాలబాలికలు
రాష్ట్ర ప్రభుత్వం విద్యావిప్లవాన్ని తీసుకొచ్చింది. పాఠశాలల్లో సమూల మార్పులు చేశారు. నాడు–నేడు పథకంతో మౌలిక వసతులను సమకూర్చింది. అర్హులైన విద్యార్థులు పాఠశాలల్లో ఉండాలనే సంకల్పం తీసుకుంది. ఇంతటి మహోన్నత ఆశయంలో కూడా అనాథ బాలబాలికలకు ‘అమ్మఒడి’ అర్హత లేకుండా పోయింది. సంక్షేమ పథకాలకు ప్రధానంగా రేషన్‌కార్డు, కులం, ఆదాయం, ఆధార్ కార్డు తప్పనిసరిగా అయ్యాయి. ఎవరో దాత దాతృత్వంతో బతికే వీరికి కులం, ఆదాయ ధ్రువీకరణ, గుర్తింపు కార్డులు గగనమయ్యాయి. దీంతో అర్హులైనప్పటికీ అమ్మఒడి వర్తించడంలేదు.
ఫలించిన ఎంపీ వేమిరెడ్డి కృషి
వాత్సల్య అనాథాశ్రమ నిర్వాహకులు ఈ పరిస్థితిని ఓ వైపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తూనే మరోవైపు రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి వివరించారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాలబాలికల విద్యకోసం విశేషంగా కృషి చేస్తున్న తరుణంలో అనాథలకు అమ్మఒడి పథకం వర్తించకపోవడాన్ని విని చలించిపోయారు. కలెక్టర్‌తో చర్చించి నివేదికను రూపొందించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 227 మంది అనాథ బాలబాలికలు అమ్మఒడికి అర్హులుగా తేల్చారు.
అదే విషయాన్ని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. నెల్లూరు జిల్లాతో సరిపెట్టకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆశ్రమాల్లో ఉంటూ చదుకుంటున్న అనాథ బాలబాలికలు వివరాలపై నివేదిక కోరారు. ఆ విధంగా 5,990 మంది అనాథ విద్యార్థులకు రూ.7.787 కోట్లు విడుదల చేస్తూ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లెటర్ నంబర్.1768275/2022 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. ఆ మేరకు నెల్లూరు జిల్లాలోని అనాథ బాలబాలికలకు రూ.29.51 లక్షలు విడుదలయ్యాయి.
నెల్లూరులో బీజం..
అనాథ బిడ్డలకు అమ్మఒడి పథకం వర్తింప చేయాలనే ఆలోచనకు నెల్లూరులో బీజం పడింది. రాష్ట్ర వ్యాప్తంగా అనాథాశ్రమాల్లో ఆశ్రయం పొందుతున్న అందరికీ వర్తించింది. నెల్లూరు నగరంలోని కొండాయపాళెం రోడ్డు సమీపంలోని రామకృష్ణానగర్‌లో ఉన్న జనహిత–వాత్సల్య సేవా సంస్థలో దాదాపు 117 మంది అనాథ బాలలు ఆశ్రమం పొందుతున్నారు. దాతల దాతృత్వంలో నడిచే ఈ సేవా సంస్థ ఆధ్వర్యంలో భారతీయ విద్యా వికాస్ పేరుతో ఇంగ్లిష్ మీడియం పాఠశాలలను నిర్వహిస్తోంది.
ఆ పాఠశాలలో విద్యను అభ్యసించే ఇతర విద్యార్థులకు అమ్మఒడి పథకం వర్తిస్తోంది. అనాథలుగా ఉన్న విద్యార్థులకు వర్తించడం లేదు. ఇదే విషయం జనహిత–వాత్సల్య సేవా సంస్థ ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. కలెక్టర్ చక్రధర్‌బాబు చొరవతో ఇటువంటి అనాథలను జిల్లా వ్యాప్తంగా 227 మందిని గుర్తించి ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ప్రజాప్రతినిధుల తోడ్పాటుతో అమ్మఒడి పథకం వర్తించింది. జిల్లా నుంచి వెళ్లిన సిఫార్సులను పరిశీలించిన ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా వర్తింప చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనాథ బాలబాలికలకు 5,590 మందికి రూ.7.787 కోట్లు అమ్మఒడి నిధులు మంజూరయ్యాయి.
అనాథలకు ఎంతో ఉపయోగం
చదువుకు సర్కార్ తోడ్పాటునిస్తోంది. అమ్మఒడి చక్కటి పథకం. ఎంతో కాలంగా అనాథ విద్యార్థులకు కూడా వర్తింపజేయాలని కోరుతున్నాం. మా అభ్యర్థను కలెక్టర్ మన్నించారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి చొవర కారణంగా సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్తింపజేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మనసున్న ముఖ్యమంత్రి అని చాటుకున్నారు. ఆశ్రమాలు నిర్వహణకు అమ్మఒడి తోడ్పాటు కానుంది.
– జీవీ సాంబశివరావు, వాత్సల్య అనాథాశ్రమం సంస్థాగత కార్యదర్శి
సమాజంలో వారికి గుర్తింపు
సమాజంలో అనా«థలను ప్రభుత్వాలు అక్కున చేర్చుకోవాలి. గత ప్రభుత్వాలు అనా«థల విషయంలో సరైన న్యాయం చేయలేకపోయింది. కేవలం దాతల దాృతత్వంతోనే జీవనం సాగిస్తున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం స్పందించింది. అమ్మ ఒడి పథకం వర్తించేలా కసరత్తు చేయడం హర్షనీయం. అనా«థలు అంటే మన పిల్లలే అనే భావన అందరిలో కలగాలి. వారిని చేరదీసి ప్రయోజకుల్ని చేయాలి.
– సామంతు గోపాల్‌రెడ్డి, వాత్సల్య సేవా సంస్థ గౌరవాధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment