ఆత్మకూరు: ఆత్మకూరు శాసనసభకు త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సులతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డికి లక్ష ఓట్ల భారీ మెజార్టీ ఖాయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. విక్రమ్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమం గురువారం ఉదయం అట్టహాసంగా జరిగింది.
►విక్రమ్‌రెడ్డి తన తండ్రి నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, తల్లి మణిమంజరి, భార్య వైష్ణవి, సోదరి ఆదాల రచనలతో కలిసి తొలుత ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని బైపాస్‌రోడ్డు వద్ద కొలువైన అభయాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
►అనంతరం నెల్లూరుపాళెం మీదుగా ఆత్మకూరు పట్టణంలోకి ప్రవేశించిన అభ్యర్థి విక్రమ్‌రెడ్డికి వైఎస్సార్‌సీపీ నాయకులు ఆర్టీసీ డిపో వద్ద ఘన స్వాగతం పలికారు. మున్సిపల్ వైస్ చైర్మన్ డాక్టర్ కేవీ శ్రావణ్‌కుమార్ విక్రమ్‌రెడ్డికి శాలువా కప్పి భారీ పూలమాల వేశారు.
►అక్కడి నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ప్రచార వాహనంలో విక్రమ్‌రెడ్డి మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, రాజ్యసభసభ్యుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి, సూళ్లూరుపేట, కందుకూరు ఎమ్మెల్యేలు కిలివేటి సంజీవయ్య, మానుగుంట మహీధర్‌రెడ్డి తదితరులతో కలిసి పట్టణంలోని ప్రధాన రహదారి మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. కార్యకర్తలు పార్టీ జెండాలు చేతపట్టి వాహనం ముందు సాగుతుండగా ప్రజలు పూలవర్షం కురిపించారు.
►బీఎస్సార్ సెంటర్లోని సుల్తాన్ షాహిద్ దర్గాకు రాజమోహన్‌రెడ్డి, విక్రమ్‌రెడ్డి నాయకులతో కలిసి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం హిల్‌రోడ్డులోని తెలుగు బాప్టిస్ట్ చర్చిలో ప్రార్థనల్లో పాల్గొన్నారు.
►కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అభయాంజనేయస్వామి గుడి వద్ద విక్రమ్‌రెడ్డిని కలిసి వైఎస్సార్‌సీపీ కండువా కప్పి అభినందనలు తెలిపారు. అలాగే నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్ పుష్పగుచ్ఛం అందజేశారు.
►తర్వాత ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా సాగింది. అక్కడి నుంచి ఎన్నికల నిబంధనల మేరకు మంత్రి కాకాణి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే, పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి రెండుసెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి, జేసీ హరేంద్ర ప్రసాద్‌కు అందజేశారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి, విజయ డెయిరీ చైర్మన్ కొండూరు రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి, ఎఫ్‌ఎఫ్‌సీ చైర్మన్ మేరిగ మురళి, డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతి, నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్, ఆత్మకూరు మున్సి పల్ చైర్‌పర్సన్ గోపారం వెంకటరమణమ్మ, వైస్ చైర్మన్ షేక్ సర్దార్, వైఎస్సార్‌సీపీ పట్టణాధ్యక్షుడు అల్లారెడ్డి ఆనంద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అమ్మ ఆశీర్వాదం తీసుకుని..
నెల్లూరు(సెంట్రల్): ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మేకపాటి విక్రమ్‌రెడ్డి గురువారం నెల్లూరులోని తన ఇంట్లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆత్మకూరుకు బయలుదేరి వెళ్లే ముందు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చిత్రపటం వద్ద నామినేషన్ పత్రాలను ఉంచారు. తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, తల్లి మణిమంజిరికి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. గౌతమ్‌రెడ్డి చిత్రపటానికి సాష్టాంగ నమస్కారం చేస్తున్న సమయంలో అక్కడున్న వారి కళ్లు చెమ్మగిల్లాయి. అనంతరం తల్లి చేతుల మీదుగా నామినేషన్ పత్రాలు తీసుకుని ఆత్మకూరుకు బయలుదేరారు.
విద్యాధికుడు
సాక్షి, నెల్లూరు: ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి విద్యాధికుడు. తన సోదరుడు గౌతమ్‌రెడ్డి లాగే ఉన్నత చదువులు చదివారు. వ్యాపార రంగంలో ఉన్న విక్రమ్‌రెడ్డి మేకపాటి కుటుంబ వారసుడిగా ఉప ఎన్నికల బరిలో నిలిచారు. ఆయన విద్యాభ్యాసం ఊటీలోని గుడ్‌షెపర్డ్ పబ్లిక్ స్కూల్‌లో జరిగింది. ఆపై బీటెక్ (సివిల్) ఐఐటీ చెన్నైలో పూర్తి చేసి, ఆస్ట్రేలియాలో ఎంఎస్ చదివారు. కేఎంసీ డైరెక్టర్‌గా వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
మేకపాటి కుటుంబంపై అభిమానం
ఆత్మకూరు: ‘మేకపాటి కుటుంబంపై ఆత్మకూరు ప్రజలకు అపారమైన అభిమానం ఉంది. గత రెండు ఎన్నికల్లో ఇది కనిపించింది.’ అని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. నామినేషన్ అనంతరం ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో మీడియా పాయింట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. రానున్న ఉప ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదయ్యేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
సీఎం అభినందించారు
రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ మేకపాటి రాజమోహన్‌రెడ్డి సూచించిన విక్రమ్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అవకాశం కల్పించారన్నారు. బీఫారం అందుకునే క్రమంలో విక్రమ్‌రెడ్డి తాను గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చూసిన విషయాలను, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఎంతో ఆసక్తిగా ముఖ్యమంత్రికి వివరించారన్నారు. దీంతో ఆయన విక్రమ్‌రెడ్డిని అభినందించి ఆశీర్వదించినట్లు చెప్పారు.
వారివి మచ్చలేని రాజకీయాలు
నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ మేకపాటి కుటుంబం మచ్చలేని రాజకీయాలు చేస్తుంటారని, అదే వారికి శ్రీరామరక్ష అని చెప్పారు. గౌతమ్‌రెడ్డి మంత్రిగా తన బా«ధ్యతలను సంపూర్ణంగా నెరవేర్చారని, రాజకీయాల్లో నూతన ఒరవడిని సృష్టించారన్నారు. విక్రమ్‌రెడ్డి విద్యావంతుడని, రాజకీయాల గురించి ఇప్పుడిప్పుడే అవగాహన పెంచుకుంటున్నారని, తప్పనిసరిగా మంచి ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకుంటారన్నారు.
దిగ్విజయంగా సాగుతారు
ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నిరాడంబరంగా నిర్వహించాలని అనుకున్న నామినేషన్ కార్యక్రమానికి ప్రజలు తరలిరావడం శుభపరిణామమన్నారు. పారిశ్రామికవేత్తగా దూసుకుపోతున్న విక్రమ్‌రెడ్డి రాజకీయాల్లో సైతం విజయపం«థాలో దిగ్విజయంగా సాగుతారని చెప్పారు.
ప్రభుత్వంపై ప్రజలకు ఎంతో నమ్మకం
అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ ఇటీవల గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కొన్ని గ్రామాల్లో, మున్సిపల్ పరిధిలో నాలుగు వార్డుల్లో తిరిగానన్నారు. సంక్షేమ పథకాలు పక్కాగా అందుతుండడంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై ప్రజలకు ఎంత నమ్మకం ఉందో తెలిసిందన్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టేలా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించేలా కృషి చేస్తానని చెప్పారు. కార్యకర్తల అండతోనే నాయకులు తయారవుతారని, ఆ విషయం తాను గుర్తెరిగినట్లు, తప్పకుండా వారి మనోభావాల మేరకే పనిచేస్తానని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో ప్రజల అండదండలతో విజయం సాధిస్తానని, 2024లో ఎన్నికలకు సమాయత్తమయ్యేలా ఈ రెండేళ్లు పనిచేస్తానని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment