ఆ లేఖ పెద్ద కుట్ర.. | YSRCP Leaders Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

ఆ లేఖ పెద్ద కుట్ర..

Published Thu, Mar 19 2020 4:01 AM | Last Updated on Thu, Mar 19 2020 8:23 AM

YSRCP Leaders Fires On Chandrababu Naidu - Sakshi

మీడియాతో మాట్లాడుతున్న అంబటి. చిత్రంలో రమేష్, పార్థసారథి

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పేరుతో కేంద్ర హోం శాఖకు అందిన ఐదు పేజీల లేఖను నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ రాశారో లేదో తేల్చి చెప్పాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు అంబటి, జోగి రమేష్, కొలుసు పార్థసారథి డిమాండ్‌ చేశారు. ఈ లేఖ పెద్ద కుట్ర అని, ఇది అతిపెద్ద క్రైమ్‌ అని పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయం నుంచి బయట పడిన ఈ లేఖకు ఎల్లో మీడియా పనిగట్టుకుని విస్తృత ప్రచారం కల్పించిందని మండిపడ్డారు. ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ పేరు మీద సర్క్యులేట్‌ అవుతున్న లేఖపై బుధవారం వారు తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను, దాని నిర్ణయాలను సుప్రీంకోర్టు తప్పుబట్టిందన్న వార్తను డైవర్ట్‌ చేయడానికి ఒక పథకం ప్రకారం ఓ ఉత్తరాన్ని కేంద్ర హోంశాఖకు ఎన్నికల కమిషనర్‌ రాసినట్టుగా టీడీపీ సృష్టించిందని, దానికి ఎల్లో చానళ్ల ప్రతినిధులు ప్రచారం కల్పించినట్లు తమకు నిర్దిష్ట సమాచారం ఉందన్నారు. ఇదంతా ఒక కుట్ర అని, మూడు ఎల్లో చానళ్లు, రెండు ఎల్లో పేపర్లు ఇందులో తమ పాత్ర పోషించాయని చెప్పారు. వారు ఇంకా ఏం చెప్పారంటే.. 

చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా పనే 
– ఈ ఉత్తరంపై ప్రభుత్వంలో అత్యున్నత అధికారులను మేం సంప్రదించాం. వారు కేంద్ర హోం శాఖ వారితో మాట్లాడగా.. నిమ్మగడ్డ రమేశ్‌ అనే పేరుతో ఉన్న ఈ మెయిల్‌ నుంచి ఆ లేఖ వచ్చిందని అధికారికంగా ధృవీకరించారు. 
– ఇంతకూ ఆ లేఖ పంపిన ఆ మెయిల్‌ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌దా? కాదా? అనే విషయాన్ని ఆయనే తేల్చి చెప్పాలి. 
– ఎన్నికల కమిషన్‌ ఈ లేఖ రాసిందని ఎల్లో చానళ్లలో తొలుత హడావిడి జరిగింది.  
– సాయంత్రం ఎన్నికల కమిషన్‌ కార్యాలయం నుంచి నిమ్మగడ్డ బయటకు వెళ్లిపోతున్నప్పుడు కొంతమంది విలేఖరులు ఈ ఉత్తం మీరే పంపారా? అని అడిగితే తనకు సంబంధం లేదని చెప్పినట్లు తెలిసింది.
– కానీ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి తన లెటర్‌ హెడ్‌ పేరుమీద.. తన సంతకంతో లేదా.. తన సంతకం లాంటి సంతకంతో ఐదు పేజీల లేఖ ఒకటి వెళ్లిందని మీడియాలో వస్తే.. అది అవునో, కాదో స్పష్టం చేయకుండా నిమ్మగడ్డ రమేశ్‌ కొన్ని గంటల పాటు చోద్యం చూశారు. 
– ఈ కుట్రలో నేరుగా ఆయన్ని భాగస్వామిగా చేస్తూ చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా ప్రతినిధులు చేసిన కుట్రగానే వైఎస్సార్‌సీపీ భావించాల్సి వస్తుంది. 
– దీనిపై రేపు (గురువారం) మేము ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేస్తాం. దీని వెనుక ఉన్న కుట్రను ఛేదించాలని,  చానళ్ల పాత్రను బయట పెట్టాలని కోరతాం.  
– ఆ లేఖను టీడీపీనే సృష్టించింది. లేని పక్షంలో దానిపై కొన్ని చానళ్లు అంత ప్రేమ చూపవన్నది నగ్న సత్యం.    

ఇదీ మా ఘనత..
– ఈ 9 నెలల కాలంలో మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 90 శాతం హామీలు అమలు చేశాం. రైతు భరోసా, అమ్మ ఒడి, పెన్షన్ల పెంపు, ఇంటì æవద్దకే పరిపాలన, గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ, 4.5 లక్షల ఉద్యోగాల కల్పన.. ఇలా చరిత్రలో ఎన్నడూ లేని గొప్ప పనులు చేశాం.  
– గత సాధారణ ఎన్నికల్లో 90 శాతం స్థానాల్లో విజయం సాధించాం. వైఎస్‌ జగన్‌కు పులివెందుల నియోజకవర్గంలో వచ్చిన మెజారిటీ ఎంతో తెలుసు కదా!
– వైఎస్సార్‌ జిల్లాల్లో 10 కి 10 స్థానాలు సాధించాం. కర్నూలు, విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో కూడా క్లీన్‌ స్వీప్‌ చేశాం. ఈ లెక్కన మరి మాకు ఎన్ని సీట్లు రావాలి? ఎన్ని ఏకగ్రీవాలు కావాలి? 

ఓర్వలేక కుట్ర పన్నారు..
– సుప్రీంకోర్టు తీర్పు వల్ల కోడ్‌ ఎత్తేశారు. ఫలితంగా పేదలకు ఇళ్లపట్టాలు వస్తున్నాయి. మీరు రానీయకుండా అడ్డుకోవాలని నానా ప్రయత్నాలు చేశారు. అది కుదర్లేదు. ఇప్పుడు రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొంది. అది తట్టుకోలేకే ఈ కుట్రలు పన్నుతున్నారు. 
– ఈ లేఖ మీద ఎన్నికల కమిషనర్‌ అధికారికంగా స్పందించక ముందే కేంద్ర హోంమంత్రికి బీజేపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాయడం హాస్యాస్పదం. సీపీఐ రామకృష్ణ ఏకంగా టీడీపీ కార్యాలయంలోనే కూర్చొని చంద్రబాబు తయారు చేసిన పాయింట్స్‌ను తన మాటాల ద్వారా ప్రభుత్వంపై ధ్వజమెత్తున్నారు.  
– తన పేరిట ఒక ఫేక్‌ లెటర్‌ సృష్టించి మీడియాలో ప్రచారం చేస్తుంటే రమేష్‌ కుమార్‌ రాష్ట్ర పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement