మాట్లాడుతున్న కాకాణి గోవర్దన్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య చిత్రంలో మేరిగ మురళీధర్
నెల్లూరు(సెంట్రల్): ముఖ్యమంత్రి చంద్రబాబు దళితులకు ఎంతో ద్రోహం చేశారని, ఆయన్ను, టీడీపీని దళితులు నమ్మరని వైఎస్సార్‌సీపీ నెల్లూరు, తిరుపతి పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు, సర్వేపల్లి, సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్యలు అన్నారు. నెల్లూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం వారు విలేకరుల సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ నెల్లూరులో దళిత తేజం సభను లక్ష మందితో నిర్వహిస్తామని నాయకులు గొప్పలు చెప్పారన్నా రు. రాష్ట్ర స్థాయి సభకు కనీసం పదివేల మంది కూడా లేకపోవడంతోనే టీడీపీపై దళితులు ఎంత వ్యతిరేఖత ఉన్నారో తెలుస్తోందన్నారు. ప్రజలు రాకపోవడంతో ఆశావర్కర్లను, అంగన్‌వాడీ కార్యకర్తలను సభకు తరలించారన్నారు. కొందరు చంద్రబాబును అంబేడ్కర్‌తో పోల్చడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అంబేడ్కర్ మహోన్నత వ్యక్తి అని, ఆయన్ను చంద్రబాబు లాంటి మోసకా రితో పోల్చడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. బాబాసాహెబ్‌కు టీడీపీ భారతరత్న ఇప్పించిందని చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు.
ఎన్ని అమలుచేశారో చెప్పాలి
చంద్రబాబుకు ధైర్యం ఉంటే ఎన్నికల సమయంలో దళితులకు ఇచ్చిన హామీలపై టీడీపీ మేనిఫెస్టో బయట పెట్టాలని, అందులో ఎన్ని అమలుచేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దళితుల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారన్నారు. అయితే బాబు అన్నదమ్ముల్లా కలసిఉన్న వారి మధ్య వర్గీకరణ చిచ్చుపెట్టారన్నారు. దొడ్డిదారిన మంత్రి పదవి పొందిన లోకేష్‌కు ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే స్థాయి, అర్హత లేదన్నారు. కనీసం తెలుగు కూడా సరిగ్గా మాట్లాడలేని లోకేష్ తమ పార్టీపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. గతంలో ఉక్కు పరిశ్రమ స్థాపన వద్దని నెల్లూరులో దీక్ష చేసిన సోమిరెడ్డి దీనిపై మాట్లాడటం దారుణమన్నారు. గతంలో అసెంబ్లీలో దళితులపై జరుగుతున్న దాడులు, కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌పై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చర్చ జరపాలంటే ఆ చర్చను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారన్నారు.
బాబుకు అర్హత లేదు
ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ చంద్రబాబు దళితులను చిన్నచూపు చూస్తూ వారిని అవమానపరిచే విధంగా మాట్లాడారన్నారు. ఆయనకు దళితల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంపై తిరగబడతారని దళిత తేజం పేరుతో డ్రామాలు ఆడుతున్నారన్నారు. చంద్రబాబు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి, కాళ్లు పట్టుకుని ఇంకెప్పుడూ దళితులను కించపరిచే విధంగా మాట్లాడనని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దళితులకు కనీసం ఒక్క సెంట్ భూమి కూడా ఇవ్వని బాబు వారి అభివృద్ధి గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. 600 హామీల్లో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. దళిత విద్యార్థులు చదివే ఎన్నో వసతిగృహాలు మూసివేశారన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు అనుకూలంగా ఈ పనిచేశారని చెప్పారు. దళితులకు టీడీపీ ప్రభుత్వం విద్య, వైద్యం, భూమిని దూరం చేస్తోందన్నారు. టీడీపీ నాయకులు దాడులు చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే దళితులు నడుస్తారని స్పష్టం చేశారు. సమావేశంలో గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళి, జెడ్పీటీసీలు బిరదవోలు మహేంద్ర, నెల్లూరు శివప్రసాద్, మెట్టా విష్ణువర్ధన్‌రెడ్డి, బి.వెంకటపతి, ఏడుకొండలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment