
హోదా ఆంధ్రుల హక్కు అని నినాదాలు చేస్తూ విశాఖ కలెక్టరేట్‌కు ప్రదర్శనగా వెళ్తున్న ఎంపీ విజయసాయిరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు
సాక్షి నెట్‌వర్క్: ‘ప్రత్యేకహోదా మా హక్కు’ అని ఆంధ్రప్రదేశ్ ముక్త కంఠంతో నినదించింది. ‘ప్యాకేజీతో మోసం చేయవద్దు’ అని కేంద్ర, రాష్ట్ర పాలకులను హెచ్చరించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ఆ పార్టీ యావత్తూ కదిలి గురువారం నాడు రాష్ట్రంలోని కలెక్టరేట్లను ముట్టడించింది. పార్టీ నాయకులు, శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని కలెక్టరేట్ల వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమించిన వైఎస్సార్సీపీ శ్రేణులకు పలుచోట్ల సీపీఎం, సీపీఐ, ఆమ్‌ఆద్మీ పార్టీ నాయకులు సంఘీభావం ప్రకటించారు. అనేక చోట్ల విద్యార్థులు, ఉద్యోగార్థులు స్వచ్ఛందంగా తరలివచ్చి ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రత్యేక హోదా డిమాండ్‌తో కర్నూలులో భారీర్యాలీ నిర్వహిస్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు
ధర్నాకు ముందు అనేక పట్టణాలలో యువకులు బైక్ ర్యాలీలతో హోరెత్తించారు. ఉదయానికల్లా పార్టీ కార్యాలయాల వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న నాయకులు, కార్యకర్తలు అక్కడి నుంచి కలెక్టరేట్ల వద్దకు ప్రదర్శనగా బయలుదేరి వెళ్లారు. ‘ప్రత్యేక హోదా సాధించే వరకు ఈ పోరాటం ఆగదు’ అంటూ నినాదాలు చేసుకుంటూ సాగిన ప్రదర్శనలను ప్రజలు ఆసక్తిగా తిలకించారు. పలుచోట్ల ప్రజలు కూడా ఆ ప్రదర్శనలలో చేరడం, పార్టీకి సంఘీభావం ప్రకటించడం కనిపించింది. ‘నీ కేసుల కోసం మా జీవితాలు ఫణంగా పెడతావా.. చంద్రబాబూ డౌన్‌డౌన్’, ‘ప్రత్యేక విమానాలలో తిరిగే చంద్రబాబూ ప్రత్యేక హోదా వద్దా’, ‘ప్రత్యేక హోదా భిక్ష కాదు మా హక్కు’ అని రాసి ఉన్న ప్లకార్డులతో విజయవాడలో జరిగిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ధర్నా కార్యక్రమంలో నేతల ప్రసంగాలకు కార్యకర్తల నుంచి మంచి స్పందన లభించింది. ప్రత్యేక హోదా ఆవశ్యకతను, హోదా ఉన్న రాష్ట్రాలలో జరిగిన అభివృద్ధిని, హోదాతో జరిగే ప్రయోజనాలను నాయకులు వివరించారు. నాలుగేళ్లుగా చంద్రబాబు పలు సందర్భాలలో ప్రత్యేక హోదాపై ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా మాటమార్చారో వివరించారు. పోలవరం కమీషన్ల కోసమే ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని, ఓటుకు కోట్లు కేసు నుంచి బైట పడడం కోసమే హోదాను వదిలేశారని విమర్శించారు. ధర్నా అనంతరం ఆయా కలెక్టర్ కార్యాలయాలలో అధికారులకు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ పార్టీ నాయకులు వినతిపత్రాలు సమర్పించారు.
బైక్ ర్యాలీలు.. తీన్‌మార్ డప్పులు..
కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమంలో పాల్గొనేందుకు పలు జిల్లాల్లో యువకులు, విద్యార్థులు బైక్‌లతో ర్యాలీగా రావడం అందరినీ ఆకట్టుకుంది. యువకుల నినాదాలతో పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు మారుమోగింది. తీన్‌మార్ డప్పులు, మోటార్‌సైకిల్ ర్యాలీలతో కలెక్టరేట్ ప్రాంతం సందడిగా మారింది. గుంటూరు నగరంలో పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలోనూ, ప్రత్తిపాడు నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలోనూ బైక్‌ర్యాలీలు జరిగాయి. వారు ర్యాలీగా వచ్చి ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. కర్నూలు నగరంలో పార్టీ జిల్లా కార్యాలయం నుంచి దాదాపు ఐదు వేల మందితో నిర్వహించిన భారీ ర్యాలీ ఆకట్టుకుంది. ఒంగోలులో నిర్వహించిన ధర్నాలో విద్యార్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విశాఖలోనూ, నెల్లూరులోనూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. యువకులు నినాదాలతో హోరెత్తించారు.
ప్రత్యేక హోదా మా హక్కు అని నినదిస్తూ విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయానికి భారీ ర్యాలీగా వస్తున్నవైఎస్సార్‌సీపీ నేతలు కొలుసు పార్థసారథి, సామినేని ఉదయభాను, జోగి రమేష్, మల్లాది విష్ణు తదితరులు
ఆటంకపరిచినా..
ధర్నా కార్యక్రమంలో పాల్గొనకుండా చేయడం కోసం రాష్ట్రంలో అనేక చోట్ల పోలీసులు ఆటంకపరిచారు. విశాఖ జీవీఎంసీ ఎదుట నిర్వహించిన మహా ధర్నాకు జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది తరలివచ్చారు. రెడ్నం గార్డెన్స్ జంక్షన్, జిల్లా కోర్టుల సముదాయం, జగదాంబ జంక్షన్, కేజీహెచ్‌ల మీదుగా కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. కలెక్టరేట్‌ను ముట్టడించేందుకు కార్యకర్తలు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. కృష్ణా జిల్లాలోనూ పలుచోట్ల నాయకులను పోలీసులు అటకాయించారు. విజయవాడలో ధర్నా కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు వెళ్లకుండా ఆపేందుకు ప్రయత్నించారు.
అయినా పెద్ద సంఖ్యలో చేరుకున్న కార్యకర్తలు ప్రదర్శనగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. శ్రీకాకుళంలో కలెక్టరేట్ వద్దకు వెళ్లడానికి పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వైఎస్సార్‌సీపీ నాయకులు, శ్రేణులు కలెక్టరేట్ సమీపంలో కాసేపు సమావేశమయ్యారు. అనంతరం భారీఎత్తున ప్రదర్శనగా కలెక్టరేట్‌కు వెళ్లారు. ప్రత్యేక హోదాపై తమ డిమాండ్లతో వినతిపత్రాన్ని జాయింట్ కలెక్టర్‌కు అందజేశారు. కడప నగరంలో కలెక్టరేట్ ముట్టడించనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు
Comments
Please login to add a commentAdd a comment