
ఓఎస్డీ ఐశ్వర్య రస్తోగికి వినతిపత్రం అందజేస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు
తాడిపత్రి:తాడిపత్రిలో శాంతిభద్రతలను కాపాడాలని ఓఎస్డీ ఐశ్వర్య రస్తోగిని వైఎస్సార్‌సీపీ నాయకులు కోరారు. జేసీ అనుచరుల ఆగడాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక సబ్ డివిజనల్ పోలీసు కార్యాలయంలో ఓఎస్డీని వైయస్సార్‌సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కొనుదుల రమేష్‌రెడ్డి, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు గయాజ్‌బాషా, పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు పైలా నర్సింహయ్యలు కలిశారు. మంగళవారం రాత్రి మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు గయాజ్‌బాషాపై జరిగిన హత్యాయత్నం గురించి ఓ ఎస్డీకి వివరించారు.
కొనసాగుతున్న హత్యారాజకీయాలు
తాడిపత్రిలో కొన్నేళ్లుగా హత్యారాజకీయాలు కొనసాగుతున్నాయని వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి పేర్కొన్నారు. జేసీ దివాకర్‌రెడ్డి – జేసీ ప్రభాకర్‌రెడ్డి సోదరులు ఎవరినైనా తమ దారికి తెచ్చుకోవడానికి అనుచరుల చేత దాడులు, బెదిరింపులకు చేయిస్తుంటారని తెలిపారు. ఈ ప్రాంతంలో రోజురోజుకూ శాంతిభద్రతలు అదుపుతప్పుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గయాజ్‌బాషాపై కూడా జేసీ సోదరులు పథకం ప్రకారమే అనుచరులతో హత్యాయత్నం చేయించారని వివరించారు.
తన ప్రాణాలకు ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డిల నుంచి ముప్పు ఉందని, తనకు రక్షణ కల్పించాలని గయాజ్‌బాషా ఓఎస్డీ ఐశ్వర్య రస్తోగికి వినతిపత్రం అందజేశారు. వీరి వెంట నాయకులు నరసింహారెడ్డి, వెంకట్రామిరెడ్డి, భాస్కర్‌రెడ్డి, ఓబుళరెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి, పట్టణాధ్యక్షుడు మనోజ్, తిమ్మేపల్లి నాగార్జునరెడ్డి, నిట్టూరు రామాంజులరెడ్డి, ఓబుళరెడ్డి, చవ్వా రాజశేఖర్‌రెడ్డి, బాణా నాగేశ్వరరెడ్డి, శిలార్‌వలి, పెయింటర్ బాషా, తదితర నాయకులు ఉన్నారు.
ఎవరినీ ఉపేక్షించం : ఓఎస్డీ
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినీ ఉపేక్షించబోమని ఓఎస్డీ ఐశ్వర్య రస్తోగి వైఎస్సార్‌సీపీ నేతలకు హామీ ఇచ్చారు. ఇప్పుడిప్పుడే తాడిపత్రి ప్రాంతంలోని పరిస్థితులను ఆకళింపు చేసుకుంటున్నామని చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment