సాక్షి, హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. ఆమె సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. వేంకటేశ్వరస్వామి ఆభరణాల అంశంపై టీటీడీ తీసుకున్న నిర్ణయం సరైనది కాదన్నారు. టీటీడీ అధికారుల సమక్షంలో నగల పరిశీలన అంటున్నారని.. అది టీటీడీ కాదు.. టీడీపీ పాలకకమిటీ అని విమర్శించారు. ఒకవేళ నగల పరిశీలన జరిగితే న్యాయం జరుగదన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల భూములను సైతం కాజేసిన వారు పరిశీలన కమిటీలో ఉన్నారని, ఇది దేవస్థానం వారికే అవమానమన్నారు. కేరళలోని పద్మనాభస్వామి ఆలయంలో వేసిన జ్యుడీషియల్ కమిటీలా.. ఇక్కడ కూడా నగల పరిశీలనకు కమిటీ వేస్తే తప్ప న్యాయం జరుగదని తెలిపారు.
కాగా, శ్రీవారి ఆభరణాలు ప్రదర్శించాలని మొదట టీటీడీ భావించినప్పప్పటికీ.. ఇందుకు ఆగమసలహా మండలి సభ్యులు అభ్యంతరం తెలిపారు. శ్రీవారి ఆభరణాల ప్రదర్శణను ఆగమ సలహాదారు సుందరవదన భట్టాచార్య తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. శ్రీవారి ఆభరణాలు అత్యంత పవిత్రమైనవని, వాటికి విలువ కట్టలేమని ఆయన అన్నారు. ఆభరణాలను ప్రదర్శిస్తే.. వాటి భద్రత బాధ్యత ఎవరిదని ఆయన ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment