సాక్షి, న్యూఢిల్లీ : వెంకన్న పాదాల సాక్షిగా ఐదుకోట్ల మంది ఆంధ్రులకు ఇచ్చిన మాటను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తప్పారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. ఎన్నికల్లో గెలవడానికి అబద్ధపు హామీలతో ఆంధ్రులను మోదీ, చంద్రబాబు ఇద్దరు మోసం చేశారని నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్ష చేపట్టిన ఎంపీలకు సంఘీభావం తెలిపిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హోదా కోసం నాలుగేళ్లుగా పోరాటం చేస్తుంటే అధికార పక్షానికి చీమ కుట్టునట్లుగా కూడా లేదని దుయ్యబట్టారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం నాలుగేళ్లుగా అలుపెరుగని పోరాటం చేస్తున్నారని చెప్పారు. పార్లమెంట్ చరిత్రలో వైఎస్సార్ సీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలు ఎవరూ ఇచ్చి ఉండరని అన్నారు.
వైఎస్సార్ సీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం చర్చించడానికి అధికార బీజేపీ భయపడిందని అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. వైఎస్సార్ సీపీ అవిశ్వాస తీర్మానం ఇచ్చిన తర్వాతనే ఇతర పార్టీలు గొంతు విప్పాయని వెల్లడించారు. ఐదు కోట్ల ఆంధ్రుల హక్కు కోసం ఐదుగురు ఎంపీలు ఆమరణ దీక్షకు దిగారని, గత ఎన్నికల సమయంలో తెలుగుదేశం, బీజేపీలు పోటా పోటీగా ఇచ్చిన హామీల అమలు కోసం దీక్షకు కూర్చున్నా కనీసం స్పందించకోవడం దారుణమన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ కనుమరుగైందని, కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని హోదా కోసం పోరాడని తెలుగుదేశం, ఇవ్వని బీజేపీలకు కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఐదేళ్లు అంటే బీజేపీ పదేళ్లు ఇస్తామని చెప్పింది. చంద్రబాబు నాయుడు ఏకంగా 15ఏళ్లు ప్రత్యేకహోదా కావాలన్నారు. ఈ నాలుగేళ్లలో ప్రధానికి రాష్ట్రానికి చెంబెడు నీళ్లు, తట్టెడు మట్టి ఇస్తే, 29 సార్లు ఢిల్లీ వెల్లిన చంద్రబాబు ఆయనకు తిరుపతి లడ్డూలు ఇచ్చి , శాలువాల కప్పి సన్మానం చేసి వచ్చారు. మోదీ, చంద్రబాబులు ఇచ్చిపుచ్చుకున్నారే తప్ప రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని విమర్శించారు. సభ ఆర్డర్‌లో లేకపోయినా ఆర్థిక బిల్లులు పాస్ చేసిన కేంద్రం.. అవిశ్వాస తీర్మానాన్ని చర్చించకోవడం దారణమైన విషయం అని వ్యాఖ్యానించారు. రాజీనామాలు చేసి ప్రజల ఆకాంక్షను బీజేపీకి గట్టిగా వినిపించాల్సింది పోయి, లోక్‌సభలో టీడీపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
రాజీనామాలు చేసి పోటీ చేస్తే 18 స్థానాలు కోల్పోతారని చంద్రబాబు భయపడుతున్నారని అనిల్ యాదవ్ ఎద్దేవా చేశారు. కెమెరాలకు ఫోజులు ఇచ్చే సీఎం ఉండటం మన దౌర్భాగ్యం అని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు అబద్ధాల జబ్బు ఉందని ఆయన మండిపడ్డారు. నాలుగేళ్లపాటు బీజేపీతో లాలూచీ పడిన తెలుగుదేశం ఇప్పుడు వైఎస్సార్‌సీపీపై పచ్చమీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదాపై ఎవరైతే స్పష్టమైన హామీ ఇస్తారో వారికే తమ మద్ధతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment