
సాక్షి, అమరావతి : పవన్ కల్యాణ్ రాష్ట్రంలో కులమతాలను, ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని సాగునీటి శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన సోమవారం సాయంత్రం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పవన్‌ను ప్రతిపక్ష నేత అందామంటే ఎన్నికల్లో ఒక్క సీటు వచ్చిందని, పోనీ యాక్టర్ అందామంటే సినిమాలు కూడా ఆపేశారని వ్యాఖ్యానించారు. గతంలో ‘వేర్ యూ గో... ఐ విల్ ఫాలో...’ అని హచ్ మొబైల్ నెట్‌వర్క్‌కు సంబంధించి ఒక అడ్వర్టయిజ్‌మెంట్ వచ్చేదని ఇప్పుడు పవన్ అలాగే చంద్రబాబును అనుసరించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. తాను జగన్ రెడ్డి అనే పిలుస్తానని పవన్ అంటున్నాడని, అసలు ఆయన పిలిస్తే ఎంత? పిలవక పోతే ఎంత? అని ప్రశ్నించారు.
ఆయన పిలిచినా పిలవక పోయినా రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని అనిల్ అన్నారు. ఓ పక్క చంద్రబాబు మతి స్థిమితం కోల్పోయి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని, ఆయనను ఫాలో అయ్యే పవన్ కూడా జగన్‌కు దమ్మూ, ధైర్యం లేదని మాట్లాడడం శోచనీయమన్నారు. సోనియానే ఎదిరించిన జగన్ దమ్మూ, ధైర్యం ఏపాటిదో అందరికీ తెలుసన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రమంతటా, ముఖ్యంగా రాయలసీమ సస్యశ్యామలంగా ఉంటే దానిని సైతం జీర్ణించుకోలేని కడుపుమంటతో పవన్ మాట్లాడుతున్నారన్నారు.
కులమతాలకు అతీతంగా పని చేస్తున్న సీఎంను పట్టుకుని క్రిస్టియన్ అంటున్నాడని దుయ్యబట్టారు. ‘నా మతం మానవత్వం... నా కులం మాట నిలబెట్టుకునే కులం...’ అని జగన్ స్పష్టంగా చెప్పారన్నారు. నోరు ఉంది కదా అని ఏదంటే అది సంస్కారహీనంగా మాట్లాడొద్దని అనిల్ హెచ్చరించారు. కర్నూలులో 2017లో ఓ స్కూలు యాజమాన్యానికి ఓ పాపకు జరిగిన సంఘటన ఏదో జగన్‌కు సంబంధించింది అయినట్లు మాట్లాడుతున్న పవన్ ముందు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీకి డిసెంబర్ 26న జగన్ శంకుస్థాపన చేస్తున్నట్లు తెలిసినా పవన్ విమర్శిస్తున్నారని, ముందుగా ఆయన పత్రికలు చదవాలన్నారు.