
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన అంధ్రప్రదేశ్ తిరిగి అభివృద్ధి పథంలో పయనించాలంటే విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలుచేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు డిమాండ్ చేశారు. హామీల సాధనకు పార్లమెంటులో పోరాడుతామని వారు స్పష్టం చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో గురువారం లోక్‌సభ స్పీకర్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అధ్యక్షతన జరిగిన అఖిపక్ష సమావేశాల్లో వైఎస్సార్‌సీపీ లోక్‌సభా పక్షనేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి పాల్గొన్నారు.
విభజన హామీలను వీరిరువురూ అఖిలపక్ష సమావేశం లో ప్రస్తావించారు. అంతకుముందు ఏపీ భవన్‌లో మేకపాటి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోవడంతో కేంద్రం ఇచ్చిన హామీల మేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, పెట్రో కాంప్లెక్స్, దుగ్గరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇక పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో బాబు తిరకాసులు పెడుతున్నారని మేకపాటి మండిపడ్డారు. ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రాజెక్టును పూర్తిచేయాల్సిన బాధ్యత కేంద్రం పై ఉందని, ప్రాజెక్టు పూర్తికి వైఎస్సార్ సీపీ తరఫున పూర్తి మద్దతు ఇస్తామని మేకపాటి స్పష్టం చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై మాట్లాడుతూ.. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు చెప్పినట్టుగా పార్టీ ఫిరాయింపులపై మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లును అడ్డుకుంటాం
రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. నష్టాల్లో ఉన్న బ్యాంకులను ఆదుకునేందుకు బ్యాంకుల్లోని డిపాజిట్లను సెట్ ఆఫ్ చేసి వాటిని తిరిగి డిపాజిటర్లకు చెల్లించే అవకాశం లేకుండా చేసే ప్రతిపాదిత ఫైనాన్షియల్ రిసొల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ బిల్లు–2017 (ఎఫ్‌ఆర్‌డీఐ)ను అడ్డుకుంటామని స్పష్టంచేశారు. ప్రభుత్వం ఈ బిల్లును పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని చూస్తుండడంతో.. ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలను ఏకంచేసి బిల్లు వీగిపోయేలా చూస్తామ న్నారు. ప్రజా వ్యతిరేక చర్యగా ఉన్న ఈ బిల్లును ప్రవేశపెట్టాలనుకోవడం ప్రభుత్వ అసమర్థతను అద్దంపడుతుందన్నారు. ఏపీలో రిజిస్ట్రర్డ్ ఆఫీసు కలిగి ఉన్న డ్రెడ్జింగ్ కార్పిరేషన్ ఆఫ్ ఇండియాను ప్రైవేటీకరించే చర్యలను అడ్డుకుంటామని, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉభయ సభల్లో పోరాటం చేయాలని తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment