
వైఎస్సార్ సీపీ పార్టీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అమలు చేస్తామని రాష్ట్ర విభజన సమయంలో స్వయంగా నాటి ప్రధాని హామీ ఇస్తే.. ఇప్పుడు దాన్ని వదులుకునే హక్కు టీడీపీకి ఎవరిచ్చారని వైఎస్సార్ సీపీ ఎంపీలు ప్రశ్నించారు. శుక్రవారం ఉదయం పార్లమెంటు ఆవరణలో పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, వైఎస్ అవినాష్‌రెడ్డి, వి.విజయసాయిరెడ్డి ధర్నా నిర్వహించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని డిమాండ్ చేశారు. హోదా వచ్చే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు.
హోదా సంగతే మరిచిన టీడీపీ..
టీడీపీ చిత్తశుద్ధి తేటతెల్లమైందని, కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలగినా ప్రజలు ఆ పార్టీని నమ్మరని ఎంపీ మేకపాటి రాజమోహ న్‌రెడ్డి పేర్కొన్నారు. ‘టీడీపీ సభ్యుల్లా మేం చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తించం. నిరసన అంటే నిరసనే. నిబంధన అంటే నిబంధనే. మేం నమ్మిన సిద్ధాంతాల మేరకు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు మా పోరాటం కొనసాగుతుంది..’ అని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. టీడీపీ ప్రత్యేక హోదా ఊసే మరచిపోయిందని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. ‘మరీ ఎంత దారు ణమంటే.. వాళ్ల (టీడీపీ) ఎంపీ లోక్‌సభలో మాట్లాడుతూ ప్యాకేజీ ఇస్తామంటే ప్రత్యేక హోదా వదిలేశామని అన్నారు. ప్రత్యేక హోదా వదిలేసేందుకు మీకు అధికారం ఎవరిచ్చారు? రాష్ట్ర ప్రజలు వద్దన్నారా? వీళ్లెవరు హోదా వదిలేయడానికి? ప్రత్యేక హోదా ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు. కలిసి వచ్చే అన్ని పార్టీలతో కలిసి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీ పోరాడుతోంది. టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం నుంచి వైదొలగాలి. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ పార్లమెంటులో, బయటా ప్లకార్డులు పట్టుకుని నిరసన ఎలా తెలియజేస్తారు? రాష్ట్ర ప్రజలు వారికి తగిన సమయంలో గుణపాఠం తెలియచేస్తారు..’ అని పేర్కొన్నారు. ఏపీకి చట్టం ప్రకారం కేబీకే, బుందేల్‌ఖండ్ తరహాలో ప్రత్యేక అభివృద్ధి నిధులు ఇవ్వాలని ఎంపీ వరప్రసాదరావు డిమాండ్ చేశారు. ‘ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా చిత్తశుద్ధితో పోరాడుతున్నాం. మేం ఎన్నికల కోసం పోరాటం చేయడం లేదు. ప్రత్యేక హోదాపై టీడీపీ రాజీ పడి ప్యాకేజీకి ఒప్పుకొంది. ఇప్పుడు కూడా రాజీపడుతోంది..’ అని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి చెప్పారు.
సభలో వైఎస్సార్ సీపీ ఎంపీల నిరసన
ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే వైఎస్సార్ సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాదరావు, వైఎస్ అవినాష్‌రెడ్డి వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో టీడీపీ ఎంపీలు కూడా వెల్‌లో నినాదాలు చేశారు. టీడీపీ ఎంపీ శివప్రసాద్ పార్లమెంటు ఆవరణలో పోతరాజు విన్యాసాలు ప్రదర్శించి అదే వేషంతో సభలోకి రావటంతో.. ‘ప్రతి రోజూ ఇలా చేయడం సరికాదు..’ అంటూ స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. సభ 12 గంటలకు తిరిగి ప్రారంభం కాగా వైఎస్సార్‌సీపీ ఎంపీలు నిరసన కొనసాగించారు. అనంతరం 12.10 సమయంలో స్పీకర్ సభను మార్చి 5వ తేదీకి వాయిదా వేశారు.
ఏమిటీ అన్యాయం?
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే వరకూ మిగిలిన రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి జరగటం అసాధ్యమని వైఎస్సార్ సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ఆయన రాజ్యసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర మంత్రివర్గంలో కొనసాగుతూ రాష్ట్రానికి న్యాయం చేయాల్సిన స్థానంలో ఉన్న టీడీపీ ఎంపీలే న్యాయం కావాలని డిమాండ్ చేయటం ఏమిటని నిలదీశారు. ఏపీకి తక్షణమే ప్రత్యేక హోదా ప్రకటించి విభజన హామీలను నెరవేర్చాలని రాజ్యసభలో వెల్‌లో నిలబడి ప్లకార్డును ప్రదర్శించారు. తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని సభాపతి స్థానంలో ఉన్న బస్వరాజ్ పాటిల్‌ను కోరి రెండు నిమిషాలు మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment