సాక్షి, విజయవాడ : దళితుడైన తనను బాపట్ల ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంతో చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నందిగం సురేష్ అన్నారు. వైఎస్సార్ సీపీలో దళితులకు పెద్దపీట వేస్తుంటే చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నారని మండిపడ్డారు. మంగళవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ... తాను విధ్వంసాలకు పాల్పడ్డానని చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ నిజంగా తాను అలా చేసి ఉంటే ఇన్నాళ్లు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. దళితులంటే చంద్రబాబుకు చిన్నచూపు కాబట్టే ఇలా చేస్తున్నారని విమర్శించారు.
వారిద్దరు నన్ను చంపేస్తామని బెదిరించారు..
రాజధాని భూముల కోసం పోరాటం చేస్తే అరటి తోటలు తగులబెట్టింది వైఎస్సార్ సీపీ వాళ్లేనని చెప్పమంటూ పోలీసులు తనను గన్‌తో బెదిరించారని నందిగం సురేష్ అన్నారు. ‘ వాళ్లు చెప్పినట్టు చేస్తే 50 లక్షలు ఇస్తామని బేరసారాలు ఆడారు. మంత్రి పుల్లారావు, ఎమ్మెల్యే శ్రావణ్ కూడా నన్ను చంపేస్తామని బెదిరించారు. పంట తగులబెట్టిన కేసులో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పేరు చెప్పాలంటూ నా భుజాలపై తన్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. అరటి తోటల విధ్వంసంపై విచారణ జరిపే దమ్ము చంద్రబాబుకు లేదని, ఎందుకంటే పంటలు తగులబెట్టింది ఆయనేనని రైతులందరికీ కూడా తెలుసునని పేర్కొన్నారు. 2019లో చంద్రబాబుకు ఛలో సింగపూర్ తప్పదని సురేష్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment