బాబు మాదారిలోకొచ్చారు, అభినందనలు.. | YSRCP Protests in Delhi demanding Special Status for AP | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదా మన హక్కు

Published Mon, Mar 5 2018 11:45 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

YSRCP Protests in Delhi demanding Special Status for AP - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : హోదా సాధన కోసం ఢిల్లీ హోరెత్తింది. ఐదు కోట్ల ఆంధ్రుల న్యాయమైన హక్కు ప్రత్యేక హోదా.. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు హోదా ఇవ్వాల్సిందేనన్న నినాదాలు దేశ రాజధాని ఢిల్లీలో మార్మోగాయి. ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఢిల్లీలోని సంసద్‌మార్గ్‌లో చేపట్టిన మహాధర్నా ఉధృతంగా కొనసాగింది. ఆంధ్రప్రదేశ్‌ ఆవేదనను యావత్‌ భారతావనికి వినిపించేలా వైఎస్‌ఆర్‌సీపీ నేతలు గళమెత్తారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ఇప్పటివరకు సాగించిన సుదీర్ఘగా పోరాటాన్ని గుర్తుచేసిన నేతలు.. ఇప్పుటికైనా కేంద్రం స్పందించాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. హోదా కోసం పార్టీ ఎంపీలు పార్లమెంటు వేదికగా పోరాడుతారని, ఈ నెల 21న కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని పెడతామని, అప్పటికీ కేంద్రం దిగిరాకపోతే.. తమ ఎంపీలు రాజీనామా అస్త్రాన్ని ప్రయోగిస్తారని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు స్పష్టం చేశారు. సంసద్‌మార్గ్‌లో కొనసాగిన ధర్నాలో నాయకులు ఏమన్నారంటే..

చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలి

గవర్నర్‌ ప్రసంగంలో ప్రత్యేక హోదాను చేర్చడం సంతోషకరమని వైఎస్‌ఆర్‌ సీపీ సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. ఇన్నాళ్లకు చంద్రబాబు తమ దారిలోకి వచ్చినందుకు అభినందనలు అని అన్నారు. హోదా కంటే ప్యాకేజీనే ముద్దని ఇన్నాళ్లు ప్రజలను మభ్యపెట్టినందుకు ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని ధర్మాన డిమాండ్‌ చేశారు. దొంగ పేర్లతో నిధులను చంద్రబాబు దోచుకుంటున్నారని, అందుకే కేంద్రాన్ని నిలదీసే ధైర్యం చేయలేకపోతున‍్నారని విమర్శించారు. విభజన హామీలు అమలు కావాలంటే వైఎస్‌ జగనే సరైన నాయకుడని, ఆయన నాయకత్వంలో హోదాను సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.

మోదీని, బాబును ప్రజలు క్షమించరు!
‘పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. ఇది ఆంధ్రుల హక్కు. హోదాతోపాటు ఏపీకి అనేక హామీలిచ్చారు. ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. కానీ చంద్రబాబు మాత్రం చాలా అమలైనట్టు చెప్తున్నారు. మోదీ, చంద్రబాబు ఏపీకి తీవ్ర అన్యాయం చేశారు. వాళ్లిద్దరినీ ఏపీ ప్రజలు క్షమించరు. హోదా కోసం పార్లమెంటులో తీవ్ర పోరాటం చేస్తాం. ఈ నెల 21న కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని పెడతాం. అప్పటికీ దిగిరాకపోతే ఏప్రిల​ 6న రాజీనామాలు చేస్తాం. మాకు ఏపీ ప్రయోజనాలే ముఖ్యం. ప్రజలు చంద్రబాబుకు చాలాసార్లు అవకాశం ఇచ్చారు. ఒక్కసారి జగన్‌కు అవకాశం ఇవ్వాలని కోరుతున్నా. కులం, మతం చూడని మహానాయకుడు వైఎస్‌ఆర్‌. తండ్రి బాటలోనే తనయుడూ నడుస్తాడనే నమ్మకం నాకుంది. వైఎస్‌ జగన్‌ను ఆదరించాలని ప్రజలందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మెజారిటీ ఎంపీ స్థానాలు మనం గెలుచుకుంటే.. హోదాను సాధించడం అసాధ్యం కానేకాదు’ అని వైఎస్‌ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.

కుంభకర్ణుడు ఆరునెలలే.. కానీ చంద్రబాబు!
‘కుంభకర్ణుడు ఆరునెలలు మాత్రమే నిద్రపోతాడు. కానీ చంద్రబాబు గత నాలుగేళ్లుగా నిద్రపోతూనే ఉన్నారు. నాలుగేళ్లలో లోకేశ్‌కు రాష్ట్రంలో తప్ప ఎవరికీ ఉద్యోగం రాలేదు. హోదా వస్తే లక్షలాది మంది యువకులకు ఉద్యోగాలు వస్తాయి. ఇప్పటికైనా చంద్రబాబు నిద్రమత్తు నుంచి బయటకు రావాలి’అని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయి. వేలకోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయి. హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. హోదా కోసం వైఎస్‌ జగన్‌ పోరాడుతుంటే.. చంద్రబాబు ఎమ్మెల్యేలు కొనే పనిలో ఉన్నారు. ప్రభుత్వ నిధుల్లో వాటాలను సమానంగా పంచుకోవాలని చంద్రబాబే చెప్పారని మంత్రులు అంటున్నారు’ అని ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావు అన్నారు.

టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేయాలి: ఎంపీ వరప్రసాద్‌
రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేకహోదా కోసం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గత నాలుగేళ్లుగా రాజీలేని పోరాటం చేస్తున్నారని ఎంపీ వరప్రసాద్‌ అన్నారు. చంద్రబాబు మాత్రం కేసుల భయంతో ప్రత్యేకహోదా విషయంలో రాజీపడుతున్నారని, నాలుగేళ్లలో ఏనాడు హోదా గురించి మాట్లడలేదని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కావడానికి చంద్రబాబే కారణం అని మండిపడ్డారు. కమీషన్లకోసం పోలవరం పనులను దక్కించుకున్నారని విమర్శించారు. ఏప్రిల్‌ 5లోపు ప్రత్యేకహోదాపై కేంద్రం దిగిరాకుంటే 6న ఎంపీలంతా రాజీనామా చేసి తీరుతామన్నారు. తమకు పదవులు ముఖ్యం కాదని, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. తెలుగుదేశం ఏంపీలు కూడా తమతో కలిసి పోరాడితే కేంద్రం దిగొస్తుందన్నారు. తమతో కలిసి టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

దేశంలోనే అవినీతిపరుడు చంద్రబాబు!
‘దేశంలోనే అత్యంత అవినీతిపరుడు చంద్రబాబు. అందుకే ఏపీ ప్రయోనాలను ఆయన తాకట్టు పెట్టారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కాంగ్రెస్‌ పార్టీకి పట్టిన గతే బీజేపీకి పడుతుంది. చంద్రబాబు సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయి’ అని వైఎస్‌ఆర్‌సీపీ మైనారిటీ నేత రెహ్మాన్‌ మండిపడ్డారు.

ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు లొంగిపోయారు
‘ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు కేంద్రానికి లొంగిపోయారు. కేంద్రానికి లొంగకపోతే జైలుకు వెళాల్సి వస్తుందని ఆయన భయపడుతున్నారు. అందుకే ఊసరవెల్లిలా మాట్లాడుతున్నారు. ఏపీ ప్రజల హక్కులను తాకట్టు పెట్టే అధికారం చంద్రబాబుకు లేదు. హోదా వస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రజల ఆకాంక్షను కేంద్రానికి చెప్పేందుకు ఢిల్లీకి వచ్చాం’ అని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు.
‘ప్రత్యేక హోదా కోసం మొదటినుంచి పోరాడుతున్నది వైఎస్‌ జగనే. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తానంటే చంద్రబాబు ఏం మాట్లాడలేదు. చిత్తశుద్ధి ఉంటే హోదా కోసం టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేయాలి’ అని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు.

ప్రతి ఒక్కరినీ చైతన్యవంతుల్ని చేసింది వైఎస్‌ జగనే!
ప్రత్యేక హోదా గురించి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి ఒక్కరినీ చైతన్యవంతులను చేసింది వైఎస్‌ జగన్‌ ఒక్కరేనని వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఢిల్లీలోని సంసద్‌మార్గ్‌లో వైఎస్‌ఆర్‌సీపీ చేపట్టిన మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ.. తిరుమల వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని మాట ఇచ్చి.. ఇప్పుడు మాట తప్పుతున్నారని గుర్తుచేశారు. ప్రజల సంక్షేమంపై వైఎస్‌ఆర్‌సీపీ పోరాడుతూనే ఉంటుందని తెలిపారు. కుట్రలు, కుతంత్రాలతో మాయ చేసే స్వభావం చంద్రబాబుదన్నారు. ప్రజలకు అన్యాయం జరిగిన ప్రతిసారి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వ్యక్తి వైఎస్‌ జగన్‌ అని తెలిపారు. చంద్రబాబులా మోకరిల్లడం వైఎస్‌ జగన్‌కు చేతకాదని, ప్రజల సంక్షేమం కోసం ఢిల్లీ నడివీధుల్లో ఆందోళనలు చేపడుతున్నామని చెప్పారు. విభజన హామీలపై తమ ఎంపీలు పోరాడుతూనే ఉంటారని చెప్పారు.

ప్రత్యేక హోదా బ్రాండ్‌ అంబాసిడర్‌ వైఎస్‌ జగన్‌
ప్రత్యేక హోదా బ్రాండ్‌ అంబాసిండర్‌ వైఎస్‌ జగన్‌ అని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు. నాలుగేళ్లుగా హోదా కోసం పోరాడుతున్న ఒకే ఒక్క నాయకుడు వైఎస్‌ జగన్‌ అని అన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్రవ్యాప్తంగా యువభేరీలు చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు. స్వలాభం కోసమే చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని మండిపడ్డారు.

చంద్రబాబు నమ్మించి మోసం చేశారు
ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ ప్రజలను నమ్మించి మోసం చేశారని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పుష్పవాణి మండిపడ్డారు. నాలుగేళ్లుగా ప్రజలకు ఇచ్చిన ఒ ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదని విమర్శించారు. ప్రత్యేక హోదా సంజీవనీ కాదని చంద్రబాబు చెప్పుకొచ్చారని అన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ జగన్‌ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసానికి సైతం సిద్ధమయ్యారని, వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామాకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. టీడీపీ ఎంపీలు మాత్రం రాజీనామా చేసేందుకు వెనకడుగు వేస్తున్నారని విమర్శించారు.

బాబును జైల్లో పెట్టాలి : ఎమ్మెల్యే సురేష్‌
గతంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేకహోదాపై ఉద్యమిస్తే జైల్లో పెడతామని చంద్రబాబు బెదిరించారని, కానీ ఇప్పుడు మాట మార్చిన చంద్రబాబును ఏంచేయాలని వైస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ ప్రశ్నించారు. ఓటుకు కోట్లు కేసులో దర్యాప్తు చేయకుండా ఉండేందుకు, ఆంధ్రప్రదేశ్‌కు సంజీవని లాంటి ప్రత్యేకహోదాను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలే వైఎస్‌ఆర్‌పీసీకి ముఖ్యమని అందుకోసం రాజీనామాలకు వెనుకాడబోమని సురేష్‌ స్పష్టం చేశారు. పార్లమెంట్‌ సాక్షిగా గత నాలుగేళ్లుగా ప్రత్యేకహోదా కోసం తమ పార్టీ ఎంపీలు పోరాటం చేస్తున్నారని, ఇకపై కూడా తమ పోరాటాన్ని కొనసాగిస్తారని వెల్లడించారు. ఈ పార్లమెంట్‌ సమావేశాల్లో కేంద్రం నుంచి స్పందన రాకపోతే ఎంపీలు రాజీనామా చేస్తారని పేర్కొన్నారు. ప్రత్యేకహోదా కోసం తాము కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.

ఎన్నికలు రావడంతో బాబు మాట మార్చారు: రాజన్న దొర
ఎన్నికలు దగ్గర పడుతుండటంతో చంద్రబాబు ప్రత్యక హోదా కావాలంటూ మాట మార్చారని సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర మండిపడ్డారు. గతంలో తమ ప్రయోజనాల కోసం చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించారని, కానీ  ఇప్పుడు ప్రజలను మభ్యపెట్టడానికి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందేనంటూ మాటమార్చారని విమర్శించారు. హోదాపై వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని, టీడీపీ ఎంపీలు మాత్రం నాటకాలు ఆడుతున్నారని, రాజీనామాలకు వెనుకాడుతున్నారంటూ మండిపడ్డారు.


రాష్ట్రానికి బాబు వెన్నుపోటు పొడిచారు
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితోనే సాధ్యమని ఎమ్మెల్యే అంజాద్‌ బాషా స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు రాష్ట్రాన్ని వెన్నుపోటు పొడిచారని, అలాంటి వారికి రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం ప్రజలు చెబుతారని అన్నారు. ప్రత్యేకహోదా కోసం ప్రతిపక్ష పార్టీ చేస్తున్న పోరాటానికి అధికార పార్టీ నేతలు మద్దతు ఇవ్వాలని కోరారు. కలిసికట్టుగా పోరాడితే కేంద్రం కచ్చితంగా దిగొస్తుందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement