సాక్షి, న్యూఢిల్లీ : ప్రత్యేక హోదా ఇవ్వకుంటే కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కూడా సిద్ధమేనని వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. హోదా కోసం పార్లమెంటులో వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలంతా పోరాడుతారని, ఈ నెల 21న కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడతామని ఆయన తెలిపారు. అయినా, కేంద్ర ప్రభుత్వం స్పందించకుంటే ఏప్రిల్ 6న పార్టీ ఎంపీలతా రాజీనామా చేస్తారని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేవరకు తమ పోరాటం ఆగబోదని, ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే వైఎస్‌ఆర్‌సీపీతో కలిసిరావాలని పిలుపునిచ్చారు. ఐదుకోట్ల ఆంధ్రులకు అపర సంజీవని వంటి ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోని సంసద్ మార్గ్‌లో సోమవారం చేపట్టిన మహాధర్నా పెద్ద ఎత్తున ప్రారంభమైంది. ‘ప్యాకేజీతో మోసం చేయొద్దు.. ప్రత్యేక హోదా మన హక్కు’’ అన్న నినాదంతో చేపట్టిన ఈ ధర్నాలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్యనేతలతోపాటు శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. హోదా కోసం మొదటినుంచి వైఎస్ జగన్ నేతృత్వంలో పోరాటాలు చేశామని గుర్తుచేశారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని పేర్కొన్నారు. హోదా వస్తేనే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని, యువతకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీలన్నింటినీ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యక్తిగత కారణాలతోనే చంద్రబాబు కేంద్రంతో లాలూచీ పడ్డారని మండిపడ్డారు. హోదా కాకుండా కేంద్రం ప్యాకేజీ ఇస్తానంటే చంద్రబాబు ఏం మాట్లాడలేదని గుర్తుచేశారు. మహాధర్నా సందర్భంగా సంసద్‌మార్గ్ ప్రాంతమంతా వైఎస్సార్‌సీపీ శ్రేణులతో నిండిపోయింది. వైఎస్‌ఆర్‌సీపీ జెండాల రెపరెపలు.. కార్యకర్తల నినదాలతో ఆ ప్రాంతం హోరెత్తుతోంది. ‘ప్రత్యేక హోదా భిక్ష కాదు.. ఐదు కోట్ల ఆంధ్రుల హక్కు’ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఉత్సాహంగా మహాధర్నాలో పాల్గొంటున్నారు.
(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Published Mon, Mar 5 2018 10:15 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment