మాట్లాడుతున్న మారెడ్డి సుబ్బారెడ్డి
సాక్షి, ఒంగోలు సిటీ: రైతుల్ని టీడీపీ ప్రభుత్వం వంచించి, మోసగించి వారి సంక్షేమాన్ని విస్మరించిందని వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి తీవ్రంగా విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రుణమాఫీ అంతా మోసమన్నారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన రుణమాఫీ హామీ అమలు చేయకుండా మాట మార్చారని విమర్శించారు. కుటుంబానికి అయిదు విడతల్లో రూ.1.5 లక్షలు ఇస్తామని చెప్పి మూడు విడతలతో సరిపెట్టారన్నారు. చివరి రెండు విడతలు మరిచిపోయారని పేర్కొన్నారు. ఎన్నికలు వస్తున్నా రుణమాఫీ సొమ్ము ఇవ్వకుండా అన్నదాత సుఖీభవ అంటూ తిరిగి మరో కొత్త హామీతో ముందుకు వచ్చారన్నారు.
ధరల స్థీరీకరణ నిధి ఎక్కడ..?
పంటలకు గిట్టుబాటు ధరలు రాని సమయంలో రైతులను ఆదుకునేందుకు జగన్ తన ఎన్నికల ప్రణాళికలో రూ.3 వేల కోట్లు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారని ప్రస్తావించారు. దీని వల్ల జగన్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందోనని చంద్రబాబు తన ఎన్నికల ప్రణాళికలో రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానని ప్రకటించారన్నారు. నేటికి కూడా తన హామీ పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. కౌలు రైతులు టీడీపీ ప్రభుత్వంలో నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సుబాబుల్, జామాయిల్ రైతుల పొట్టకొట్టారు..
జిల్లాలో సుబాబుల్, జామాయిల్ రైతుల పొట్టకొట్టారని చంద్రబాబు విధానాలను విమర్శించారు. సామాజిక వనాల్లో జిల్లా వాటా 42 శాతంగా ఉందన్నారు. కాగితపు గుజ్జుకు ఉపయోగపడే తోటలను ఒకప్పుడు వ్యవసాయ రంగ నిపుణులు సుస్థిర వ్యవసాయంలో భాగంగా వర్ణించారని పేర్కొన్నారు. కాగితపు గుజ్జుకు పనికి వచ్చే తోటలను ప్రోత్సహించి రైతులను ఆదుకునే చర్యలేమీ తీసుకోలేదన్నారు.
పొరుగు రాష్ట్రంలో జామాయిల్ రైతులకు ఇక్కడ లభించే ధర మీద టన్నుకు రూ.1500 అదనంగా లభిస్తుందని వివరించారు. చంద్రబాబు పాలనలో కాగితపు టన్ను ధర రూ.15 వేల ఉంటే అదే దామాషాలో కర్ర కొనుగోలులో పెరగాల్సిన ధరలు పెరగకపోగా సగాని కంటే ఎక్కువగా ధరలు పడిపోయాయని వాపోయారు. జీఓల మీద జీఓలు ఇవ్వడమే కానీ ఆచరణలో ఎక్కడా సుబాబుల్, జామాయిల్ రైతులకు కలిసి వచ్చిన ప్రయోజనం లేదన్నారు. రైతుల పొట్ట గొట్టి ఐటీసీ సంస్థలకు అధికంగా లబ్ధి చేకూర్చి వారికి మేలు చేశారని వివరించారు.
జిల్లాకు రావాల్సిన సాగర్ నీటి వాటా ఎక్కడ?
జిల్లాకు సాగర్ నీరు వాటా ప్రకారం రాలేదన్నారు. వాటా ప్రకారం ఇస్తే సాగు బాగా చేసుకోవచ్చని వివరించారు. నీరు ఇస్తారన్న రైతుల ఆశలు అడియాశలయ్యాయి. ఇస్తానన్న నీటి వాటాలో 30 టీఎంసీలే నీరు ఇచ్చారన్నారు. జిల్లాకు 53 టీఎంసీల నీరు రావాల్సి ఉందని, వాస్తవంగా నీటి వృథా ఇతర కారణాలతో 22 టీఎంసీలకు మించి నీరు రాలేదని వివరించారు. వైఎస్సార్ సీఎంగా శ్రీశైలంలో 542 అడుగులు నీరు ఉన్నప్పుడే పుష్కలంగా సాగునీరు ఇచ్చారని గుర్తు చేశారు. శ్రీశైలం డ్యాంలో నీరున్నా జిల్లాకు మాత్రం చంద్రబాబు నీరు ఇవ్వలేదన్నారు. కనీసం తాగేందుకు కూడా నీరు ఇవ్వడం లేదన్నారు.
ఈ ఐదేళ్లలో ఖరీఫ్, రబీ బాగా దిగజారిందన్నారు. ఫసల్ బీమా కూడా రైతులను ఆదుకోలేదన్నారు. 2017లో ఫసల్ బీమా పరిహారం సాగు నష్ట పరిహారం ఇప్పటికీ విడుదల చేయలేదన్నారు. మోసపు మాటలతో రైతులను గందరగోళపరిచారన్నారు. రైతు సమస్యలపై నిజాయితీతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. సాగర్ వాటా జలాలతో పాటు వెలిగొండ పాజెక్టును ఏడాది లోగా పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని గెలిపించాలని కోరారు.
అపరాలకు గిట్టుబాటు లేదు..
జిల్లాలో పండించిన అపరాలకు గిట్టుబాటు« ధరలు లేవన్నారు. దేశీయంగా శనగ పంటను కొనే నాథుడే లేరన్నారు. కోల్డ్ స్టోరేజీల్లో లక్షల క్వింటాళ్లు మగ్గిపోతున్నాయని వివరించారు. జిల్లాలో అపరాల సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. దళారులు విపరీతంగా లాభపడ్డారని అన్నారు. టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే దళారులు లావాదేవీలను నిర్వహించారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment