సాక్షి, విజయవాడ: ముఖ‍్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో 13 దేశాల‍్లో చక‍్కర్లు కొట‍్టడం తప‍్ప సాధించింది ఏమీలేదని వైఎస్సార్‌సీపీకి చెందిన ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలిన చంద్రబాబు దేశాలు తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నారని ఎద్దేవాచేశారు. గురువారం ఆయన ఇక‍్కడ మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాను వదిలిపెట్టిన చంద్రబాబు పోలవరం విషయంలోనూ నిర‍్లక్ష‍్యం వహిస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా సాధనకు వైఎస్సార్‌సీపీ కట్టుబడి ఉందని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత‍్వంలోనే పోలవరం, ప్రత్యేక హోదా సాధిస్తామని ధీమా వ‍్యక‍్తంచేశారు. పోలవరం ప్రాజెక్టును నిర‍్మించాల్సిన బాధ‍్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ఆయన పేర‍్కొన్నారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని, పుట్టిన రోజు కూడా వైఎస్ జగన్ ప్రజల మధ్యే వున్నారని ఆయన గుర్తుచేశారు. ప్రజా సమస్యలపై అన్ని వర్గాలను చైతన్యవంతం చేయడమే ప్రజా సంకల్ప యాత్ర లక్ష్యమని చెప్పారు. పోలవరంపై కేంద్రమంత్రి నితిన్ గడ‍్కరిని శుక్రవారం వైఎస్సార్‌సీపీ ఎంపీల బృందం కలుస్తుందని ఆయన తెలిపారు.