హైదరాబాద్: ఆపరేషన్ గరుడ వెనుకున్నది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. ఆపరేషన్ గరుడకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ చంద్రబాబేనంటూ ఆయన విమర్శించారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పై దాడి చేసిన వ్యక్తి గరుడ బొమ్మతో ఉన్న వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీని పెట్టడంతోనే టీడీపీ డ్రామా బయటపడిందని సుబ్బారెడ్డి విమర్శించారు. వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీలో గరుడ బొమ్మను ఎవరైనా పెడతారా అంటూ ఆయన ప్రశ్నించారు.
సిటీ న్యూరో సెంటర్‌లో చికిత్స పొందుతున్న వైఎస్ జగన్‌ను పరామర్శించడానికి వచ్చిన సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు పదే పదే చెబుతున్న ఆపరేషన్ గరుడ వెనుక ఉన్నది చంద‍్రబాబేనన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఎల్లో రంగు ఫ్లెక్సీని ఒక వైఎస్సార్‌సీపీ అభిమాని పెడతాడా అని ఆయన నిలదీశారు. ఫొటోలు మార్ఫింగ్ చేసి ఫ్లెక్సీలు సృష్టించారన్నారు.
జగన్‌ను కత్తితో పొడిచిన వ్యక్తి టీడీపీ నేత హోటల్‌లో పనిచేస్తున్నాడన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అసలు పోలీసుల అనుమతి లేకుండా ఒక వ్యక్తి కత్తితో ఎయిర్‌పోర్ట్‌లోకి రాగలడా అని సుబ్బారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలన్నారు. దీనిపై కేంద్ర హోంమంత్రి, రాష్ట్రపతి, గవర్నర్‌లను కలుస్తామన్నారు. వైఎస్ జగన్‌పై జరిగింది ముమ్మూటికీ హత్యాయత్నమేనన్నారు. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలన్నారు. ఘటన జరిగిన వెంటనే ఏపీ డీజీపీ ఎలా మాట్లాడతారన్నారు.
గతంలో అలిపిరి ఘటనలో చంద్రబాబు నాయడు గాయపడ్డప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి వెంటనే ఖండించిన విషయాన్ని సుబ్బారెడ్డి గుర్తు చేశారు. స్వయంగా వెళ్లి చంద్రబాబును వైఎస్సార్ పరామర్శించారన్నారు. ఇప్పుడు చంద్రబాబు మానవత్వం లేకుండా వ్యవహరించారంటూ సుబ్బారెడ్డి మండిపడ్డారు. ఫ్లెక్సీ తరహాలోనే 11 పేజీల లెటర్‌ను కూడా సృష్టించారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment