పాడి రైతులకు గేదెలు | Telangana to offer subsidy for buying buffalo to sc st's | Sakshi
Sakshi News home page

పాడి రైతులకు గేదెలు

Published Wed, Jan 17 2018 11:51 AM | Last Updated on Sat, Aug 11 2018 4:59 PM

Telangana to offer subsidy for buying buffalo to sc st's - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వం పాడి రైతులకు సబ్సిడీపై గేదెలను అందజేయనుంది. నెల రోజుల్లో పంపిణీ మొదలు పెట్టే అవకాశాలున్నట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఒక్కో యూనిట్‌ ధర, సబ్సిడీపై వారం రోజుల్లో స్పష్టత రానుందని సమాచారం. ఆర్థిక పరిపుష్టి సాధించాలన్న లక్ష్యంతో ఇప్పటికే గొల్ల, కురుమ, యాదవులకు సబ్సిడీపై జీవాలను అందజేస్తున్న ప్రభుత్వం.. త్వరలో పాడి రైతులకు గేదెలను పంపిణీ చేస్తామని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన కసరత్తు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. ఒక్కో యూనిట్‌లో ఒక గేదె ఉండనుంది. యూనిట్‌ ధర, సబ్సిడీ, ఏ రకం గేదెలు అందజేయాలనే విషయంపై రాష్ట్ర పశు సంవర్థక శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. గేదెల పంపిణీ బాధ్యతలను పశు సంవర్థక శాఖకు అప్పగించకపోవచ్చు. రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్‌ కోఆపరేటివ్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో అందజేస్తారు.

2.17 లక్షల మందికి లబ్ధి
పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల్లో సభ్యులుగా చేరిన పాడి రైతులకే సబ్సిడీపై గేదెలను ఇవ్వాలని ప్రభుత్వం ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. సహకార సంఘాల్లో సభ్యత్వం లేకుండా వ్యక్తిగతంగా పాడిపై ఆధారపడిన వారికి అందజేయకపోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆధీనంలో విజయ డెయిరీ ఉండగా.. సహకార రంగంలో మదర్‌ డెయిరీ (నార్ముల్‌), కరీంనగర్‌ డెయిరీ, ముల్కనూర్‌ డెయిరీలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 2.17 లక్షల మంది పాడి రైతులు సభ్యులుగా నమోదయ్యారు. రంగారెడ్డి జిల్లాలో సుమారు 10 వేల మందికి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘాల్లో సభ్యత్వం ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం గేదెల అందజేత ఎప్పుడు మొదలుపెట్టినా.. వీరికి లబ్ధి కలగనుంది. ఇప్పటికే పాల ఉత్పత్తిలో జిల్లా ముందు వరుసలో ఉంది. ఇక సబ్సిడీపై గేదెలు అందజేస్తే ఉత్పత్తి గణనీయంగా పెరిగి.. పాడి రైతులకు ఆదాయం ఒనగూరనుంది.  

యూనిట్‌ ధర రూ.80 వేలు?
యూనిట్‌ ధర రూ.60 వేలు ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని సీఎం కేసీఆర్‌ వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ ధరకు మేలు జాతి గేదేలు లభించకపోవచ్చని అధికారులు తెలిపినట్లు సమాచారం. ఈ క్రమంలో యూనిట్‌ ధర పెంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. రూ.70 వేలు నుంచి రూ.80 వేలు ఉండొచ్చని అంచనా. ఒక్కో యూనిట్‌పై కనీసం 50 శాతం సబ్సిడీ ఉండనుంది. ఎస్సీ, ఎస్టీలకు 75 శాతం సబ్సిడీ ఇవ్వనున్నారు. యూనిట్‌ ధరలో సబ్సిడీపోను మిగిలిన సొమ్మును లబ్ధిదారులు భరించాల్సి ఉంటుంది. పాల దిగుబడి అధికంగా ఉండే మేలు జాతి గేదెలను అందజేసే అవకాశం ఉంది. దిగుమతి కోసం గేదెల లభ్యతతోపాటు మేలు జాతివి అధికంగా ఉంటే ఇతర రాష్ట్రాలపై ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా హరియాణా, పంజాబ్, గుజరాత్‌ రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement