ప్రభుత్వ ప్రోత్సాహం తోడుండటం వల్ల కూడా కావచ్చు... ప్రస్తుతం మార్కెట్లో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు గృహ రుణాలపై ఆకర్షణీయమైన ఆఫర్లిస్తున్నాయి. తగ్గుతున్న వడ్డీ రేట్లు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, రెరా చట్టం ప్రయోజనాలు, అమ్ముడు కాకుండా పెద్ద సంఖ్యలో పేరుకుపోయిన గృహాలు... ఇవన్నీ చూస్తే ఇంటి కొనుగోలుకు అనువైన పరిస్థితులు కల్పిస్తున్నాయి. మీరు కొనడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అన్నది వేరే విషయం. ఒకవేళ కొనాలనే ఉద్దేశం ఉండి, ఊగిసలాడుతుంటే కనక సొంతింటి కలను సాకారం చేసుకునే ముందు చూడాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం...
అనువైన ఇల్లు ఏది..?
ఎలాంటి ఇంటిని కొనాలనుకుంటున్నారో నిర్ణయించుకోవడం రెండో అంశం. ఇది కష్టమైన వ్యవహారమే. మంచి లొకాలిటీలో మీరు మెచ్చిన ఇంటిని వెతికిపుచ్చుకుంటే సరిపోదు. ఆ ఇంటి ఖరీదు మీ బడ్జెట్‌కి అనువైనదిగాను, ఇటు సౌకర్యంతో పాటు అటు మానసిక సంతృప్తినిచ్చేదిగా కూడా ఉండాలి. అలాంటి ప్రాపర్టీని ఎంచుకున్నాక... తర్వాతి దశలో చూడాల్సినవి మరికొన్ని ఉన్నాయి.
చేతి నుంచీ కొంత పడుతుంది..
ఇంటి కొనుగోలు అంటే బోలెడన్ని లావాదేవీలుంటాయి. డౌన్ పేమెంటు, రిజిస్ట్రేషన్.. స్టాంపు డ్యూటీ, ఫర్నిషింగ్, బ్రోకరేజి, లోన్ చార్జీలు, ఈఎంఐలు.. వగైరా వంటి అనేకానేకం ఉంటాయని గుర్తుంచుకోవాలి. గృహ రుణం సంగతి పక్కనపెడితే.. డౌన్ పేమెంటు, ఇతర ఖర్చులన్నీ మీ జేబు నుంచే కట్టాలి. ఎందుకంటే గృహ రుణం అనేది ప్రాపర్టీ విలువలో సుమారు 70–90 శాతానికే వస్తుంది. ఇక మిగతా ఖర్చులన్నీ మీరు చూసుకోవాల్సినవే. ఇందుకు సరిపడేంత నగదు కూడా చేతిలో పట్టుకుని ఉన్న పక్షంలో .. తదుపరి అంశంపై దృష్టి పెట్టవచ్చు.
ఏ అవసరానికి కొంటున్నాం..
ముందుగా ఇంటి కొనుగోలు అవసరం గురించి ప్రశ్నించుకోవాలి. చాలా మందికి రెండే కారణాలుంటాయి. ఒకటి సొంతంగా నివసించేందుకు కాగా రెండోది.. పన్నుపరమైన మినహాయింపు, క్యాపిటల్ గెయిన్స్ ప్రయోజనాలు పొందడం కోసం ఇన్వెస్ట్‌మెంట్ కోణంలో కొనడం. అవసరం ఏదైనా రెండింటిలో సానుకూల, ప్రతికూలాంశాలను బేరీజు వేసుకోవాలి. కుటుంబానికి సొంతింటి భరోసా, పెరిగే అద్దెల నుంచి రక్షణ, పెరిగే ఆస్తి విలువ, పన్నుపరమైన ప్రయోజనాలు మొదలైనవి సానుకూలాంశాలు ఉంటాయి. ఇక దీనికి వ్యతిరేక అంశాల విషయానికొస్తే.. చేతిలో నగదు లభ్యత, మార్కెట్.. చట్టపరమైన రిస్కులు, తీసుకున్న రుణం తిరిగి చెల్లింపులో ఎదురయ్యే సమస్యలు లాంటివి ఉంటాయి.
పేపర్‌వర్క్ పక్కాగా..
సాధారణంగా ఇంటి కొనుగోలు అనేది చాలా మంది జీవితాల్లో చాలా పెద్ద ఆర్థిక లావాదేవీగానే చెప్పవచ్చు. అందుకే అన్నీ సక్రమంగా ఉండాలి. మీరు కొందామనుకుంటున్న ఇంటికి సంబంధించి మున్సిపల్ క్లియరెన్సులు, ఇతరత్రా అవసరమైన పర్మిట్లు ఉన్నాయా లేదా చూసుకోవాలి. పేపర్‌వర్క్ పక్కాగా ఉండాలి. స్థల వివాదాల్లాంటివేమీ ఉండకూడదు. ఇంటి పత్రాలను మదింపు చేయడంలో న్యాయనిపుణుడి సలహాలనూ తీసుకోవడం మంచిది. ప్రాపర్టీ చట్టబద్ధంగా పక్కాగా ఉందని పూర్తిగా నమ్మకం కలిగాకే కొనుగోలు విషయంలో ముందడుగు వేయాలి.
ఎంత గృహ రుణం రావొచ్చు..
ఏ రుణానికైనా కొన్ని అర్హతా ప్రమాణాలుంటాయి. అవి కుదిరితేనే బ్యాంకులు రుణాలిస్తాయి. గృహ రుణమూ ఇందుకు మినహాయింపేమీ కాదు. ఆ అర్హతా ప్రమాణాలేమిటంటే.. మీ వయస్సు (సాధారణంగా 18–65 ఏళ్ల మధ్య), ఆదాయం, క్రెడిట్ స్కోరు, ప్రస్తుతం కడుతున్న రుణ మొత్తాలు మొదలైనవి. రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే గానీ క్రెడిట్ స్కోరు తెలుసుకునే వీలు లేదు కదా అనుకోవద్దు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లోనే ఉచితంగా కూడా క్రెడిట్ రిపోర్టు పొందే వెసులుబాటుంది. సదరు నివేదికను బట్టి రుణ అర్హత మెరుగుపర్చుకునేందుకు వీలయితే ప్రస్తుత రుణాలను తీర్చుకునే అంశాన్ని కూడా పరిశీలించవచ్చు. ఒకవేళ మీ ఎలిజిబిలిటీ తక్కువగా ఉన్న పక్షంలో అర్హత ఉన్న కుటుంబ సభ్యులతో కలిసి జాయింట్‌గా కూడా రుణం తీసుకోవచ్చు.
దీర్ఘకాలమని గుర్తుంచుకోవాలి..
ప్రాపర్టీ కొనాలన్నా, అమ్మాలన్నా చాలా పెద్ద వ్యవహారమే. సొంతంగా ఉండటానికైనా లేదా ఇన్వెస్ట్‌మెంట్ కోసమైనా... చాన్నాళ్ల పాటు దాన్నే అట్టే పెట్టుకుని ఉండాలి. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి ఇతరత్రా ఆర్థిక అసెట్స్‌ను ఏ రోజైనా విక్రయించుకునే వీలుంది. అదే ప్రాపర్టీ విషయానికొస్తే.. అలాంటి వెసులుబాటు ఉండదు. అనుకున్న రేటుకు విక్రయించుకుని, వైదొలగాలంటే కాలం పట్టేస్తుంది. ఇక, గృహ రుణం తీసుకున్నారంటే.. కాలపరిమితి ఎంతైనా సరే చట్టప్రకారంగాను, ఆర్థికంగానూ, నైతికంగాను కట్టి తీరాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment