ఇంత తాగితే ‘పర్లేదు’!
మద్యం ఎంత తక్కువ మోతాదులో తీసుకున్నా కూడా.. మనిషి శరీరంలోని దాదాపు ప్రతి వ్యవస్థపైనా ప్రభావం చూపుతుంది. మెదడు ఏక కాలంలో చాలా అంశాలతో వ్యవహరించాల్సి ఉంటుంది. నిర్విరామంగా లెక్కలేనంత సమాచారాన్ని విశ్లేషించుకోవాల్సి ఉంటుంది. మద్యం.. మెదడు చురుకుదనంపై, తక్షణ నిర్ణయం తీసుకునే సామర్థ్యంపై, చుట్టూ పరిస్థితుల్లో మార్పులకు వేగంగా స్పందించే సామర్థ్యంపై, కీలక సమయాల్లో కచ్చితమైన, కొన్ని సందర్భాల్లో క్లిష్టమైన చర్యలు చేపట్టడంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మద్యం మోతాదు ఒక డ్రైవరుపై ఎలా ప్రభావం చూపుతుందంటే...
20 ఎం.జి./డెసీలీటర్ :
మద్యం మోతాదు 0.02 కు చేరగానే.. పరిస్థితులను ఆకళింపు చేసుకుని నిర్ణయానికి వచ్చే (జడ్జిమెంట్) సామర్థ్యం, ప్రశాంతత కొంత కోల్పోవటం ప్రారంభమవుతుంది. మూడ్ మారిపోతుంటుంది. ఫలితంగా చూపు మందగించటం మొదలవుతుంది. ఏక కాలంలో రెండు పనులు చేసే సామర్థ్యం తగ్గిపోతుంటుంది.
50 ఎం.జి./డెసీలీటర్ :
మెదడులో ఆలోచనలకు అనుగుణంగా శరీర కండరాల కదలిక (సైకోమోటార్) ప్రక్రియ గణనీయంగా కుంటుపడుతుంది. కంటి కదలికలు మందగిస్తాయి. దృష్టి కోణం, ప్రతిస్పందన సమయం, సమాచార విశ్లేషణలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఫలితంగా సమన్వయం తగ్గిపోతుంది. కదిలే వస్తువులను గమనించే సామర్థ్యం తగ్గిపోతుంది. స్టీరింగ్‌ను నియంత్రించటం కష్టమవుతుంది. డ్రైవింగ్‌లో అత్యవసర పరిస్థితులకు స్పందించటం తగ్గిపోతుంది.
80 ఎం.జి./డెసీలీటర్ :
కండరాల సమన్వయం (ఉదాహరణకు మాట, చూపు, ప్రతిస్పందించే సమయం, వినికిడి) కనిష్టానికి పడిపోతుంది. ప్రమాదాన్ని గుర్తించటం, నిర్ణయానికి రావటం మరింత కష్టంగా మారుతుంది. స్వీయ నియంత్రణ, విచక్షణ, జ్ఞాపకం కుంటుపడతాయి. ఫలితంగా.. దృష్టి (లేదా ఆలోచన) కేంద్రీకరించటం తరిగిపోతుంది. తాత్కాలికంగా జ్ఞాపకశక్తిని కోల్పోతారు. మాటలపై నియంత్రణ కోల్పోతారు. సమాచారాన్ని విశ్లేషించే సామర్థ్యం (సిగ్నల్‌ను గమనించటం, చూపుతో పరిశీలించటం వంటివి) తగ్గిపోతుంది. కచ్చితత్వం కుంటుపడుతుంది.
‘30’ దాటితే కేసు
ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టిన రోడ్ సేఫ్టీ ఇన్ టెన్ కంట్రీస్ (ఆర్‌ఎస్-10) ప్రాజెక్టు కింద లభించిన ఉపకరణాలను వినియోగించి ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్‌డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నారు. మద్యం తాగి చిక్కినవారిని కోర్టుకు తీసుకువెళ్లాలంటే సెక్షన్ 185 ప్రకారం బుక్ చేసి, ఆధారాలతో వెళ్లడం అవసరం. చట్ట ప్రకారం ప్రతి 100 మిల్లీలీటర్ల రక్తంలో 30 మిల్లీగ్రాములు అంతకంటే ఎక్కువ ఉంటేనే చర్యలు తీసుకునే వీలుంది. బ్రీత్ ఎనలైజర్లు అల్కహాల్ పరిమాణాన్ని ప్రింట్ అవుట్ రూపంలో ఇస్తాయి.
యూత్... టూ వీలర్స్...
మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్లనే రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని హైదరాబాద్ పోలీసుల అధ్యయనంలో తేలింది. దీన్ని నివారించి ప్రమాదాలను, మృతుల సంఖ్యను తగ్గించేందుకు పోలీసు కమిషనర్ నవంబర్ 4, 2011న మొదటిసారిగా హైదరాబాద్‌లో ‘డ్రంకన్ డ్రైవ్’తనిఖీలకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి నేటి వరకు ఈ తనిఖీల్లో 46,252 మంది పట్టుబడగా వీరిలో 4500 మందికి జైలు శిక్షలు పడ్డాయి. అత్యధికంగా ఇద్దరు లారీ డ్రైవర్లకు రెండు నెలల జైలుశిక్ష వేశారు. ఇక జరిమానా రూపంలో వీరందరి నుంచి రూ.7,56,17,977 వసూలయ్యాయి.
పట్టుబడ్డవారిలో అత్యధికంగా 33490 ద్విచక్రవాహనదారులు ఉన్నారు. రెండోస్థానంలో కార్లు(10255), మూడో స్థానంలో ఆటో డ్రైవర్లు (1916 ) ఉన్నారు. వయసులవారీగా పరిశీలిస్తే 21-30 ఏళ్ల వయసువారు 21571 మంది. 31-40 ఏళ్లవారు 14772 మంది. 70కిపైగా వయసున్నవారు 1352 మంది. పట్టుబడిన వారిలో ఆల్కహాల్ పరిమాణం 51-100 మిల్లీ గ్రాములున్నవారు 20186 మంది. వీరినే వర్గాలవారీగా చూస్తే అత్యధికంగా ప్రైవేటు ఉద్యోగులు(16,309), అత్యల్పంగా ఉపాధ్యాయులు(29).
అనుమతించబడే మద్య పరిమితి వివిధ దేశాల్లో వివిధ రకాలుగా ఉంది.
భారత్ 30 ఎం.జి./డెసీలీటర్
స్పెయిన్ 25 ఎం.జి./డెసీలీటర్
ఇజ్రాయెల్ 24 ఎం.జి./డెసీలీటర్
నార్వే 20 ఎం.జి./డెసీలీటర్
స్వీడన్ 20 ఎం.జి./డెసీలీటర్
రష్యా 20 ఎం.జి./డెసీలీటర్
పోలండ్ 20 ఎం.జి./డెసీలీటర్
ఎస్తోనియా 20 ఎం.జి./డెసీలీటర్