సాక్షి, హైదరాబాద్: ఫొటో చూసి ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు అని భ్రమపడ్డారా.? మీరే కాదండోయ్.. తెలంగాణ పోలీసులు కూడా అలానే భావించారు. అంతేనా.. వారికి ఆన్‌లైన్‌లో చలానా కూడా విధించారు. ఇది చూసి వాహనదారుడు షాకయ్యాడు. ఎందుకంటే అందరూ అనుకుంటున్నట్టుగా అది ట్రిపుల్ రైడ్ కానే కాదు. ముందు వేరే వాహనంపై వెళ్తున్న వ్యక్తి సరిగ్గా ఇతని వాహనాన్నే నడుపుతున్నట్టుగా అనిపించడంతో పోలీసులు చలానా జారీచేశారు. కానీ కాస్త పరిశీలించి చూస్తే అది అబద్ధమని రుజువైంది. చేయని తప్పుకు చలానా విధిస్తారా అంటూ సదురు వాహనదారుడు పోలీసులపై మండిపడ్డాడు. సరిగ్గా చూడండి. మీకే తెలుస్తుంది వాహనంపై ముగ్గురున్నామా? లేక ఇద్దరున్నామా..? అంటూ పోలీసులనే ప్రశ్నించాడు.
ఈ దెబ్బకు పోలీసులు తొలుత నాలుక్కరుచుకున్నారు. ఆ తర్వాత అతనికి దిమ్మతిరిగే సమాధానమిచ్చారు. ‘మీ అభ్యర్థనను స్వీకరించాం. ఆ చలానాను ట్రిపుల్ రైడింగ్ నుంచి హెల్మెట్ పెట్టుకోనందుకుగా మార్చుతున్నాం’ అంటూ సమాధానమిచ్చారు. మీరు హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతూ ట్రాఫిక్ ఆంక్షలను ఉల్లంఘించారని, ట్రాఫిక్ నిబంధనలను పాటించండి.. ఎప్పుడూ హెల్మెట్ ధరించండి అంటూ అదిరిపోయే రిప్లై ఇచ్చారు. ఇది చూసిన సోషల్‌మీడియా జనాలు పాపం.. ఆ వ్యక్తి పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టైంది అని సెటైర్స్ వేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment