
స్త్రీలకు అందం కురులే. అందుకే మహిళలు శిరోజాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటిది క్యాన్సర్ చికిత్సలో భాగంగా జుట్టంతా ఊడిపోయి.. గుండు చేయించుకోవాల్సి వస్తే ఆ బాధను మాటల్లో వర్ణించడం కష్టం. అసలు గుండు చేయించుకోవడమే కష్టం అంటే.. ఇక ఆ అవతారంతో మనుషుల్లో కలవడానికి చాలా ఇబ్బంది పడతారు. అలాంటిది ఓ క్యాన్సర్ పేషంట్ మాత్రం గుండు మీదనే పెళ్లి కూతురుగా తయారయ్యి ఫోటో షూట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడమే కాక ఆమె ఆత్మవిశ్వాసాన్ని అభినందిస్తున్నారు నెటిజన్లు.
నవి ఇంద్రాణ్ పిల్లయ్ కొన్నేళ్ల కిందట రొమ్ము క్యాన్సర్ బారిన పడి.. చికిత్స తరువాత కోలుకుంది. కానీ దురదృష్టవషాత్తు ఐదేళ్ల తర్వాత మళ్లీ క్యాన్సర్ వచ్చింది. ఈసారి ఆమె కాలేయం, వెన్నుపూసకు క్యాన్సర్ సోకింది. అప్పటికే కిమోథెరపీలతో రూపం కోల్పోయిన ఆమె.. మళ్లీ అదే ట్రీట్మెంట్ తీసుకోక తప్పలేదు. దాంతో ఆమె జుట్టు ఊడిపోయి ఆరోగ్యం మరింత క్షీణించింది. అయితే, ఆత్మస్థైర్యంతో రెండోసారి కూడా క్యాన్సర్‌ను జయించింది. ఈ నేపథ్యంలో తనలా క్యాన్సర్‌తో బాధపడేవారికి స్ఫూర్తిగా ఉండేందుకు పెళ్లి కూతురిగా మారి ఫోటోషూట్ చేసింది నవి.
ఈ విషయం గురించి నవి మాట్లాడుతూ.. ‘క్యాన్సర్ పేషంట్‌గా చికిత్స తీసుకుంటున్నప్పుడు నేను నా జీవితం గురించి కలలు కనే దాన్ని. ప్రేమించిన వ్యక్తి గురించి కలలు కనేదాన్ని. పెళ్లి కూతురి అలంకరణలో నేను ఎలా ఉంటానా అని ఆలోచిస్తూ ఉండేదాన్ని. కానీ ఈ చికిత్సలో నా జుట్టు పూర్తిగా పోయింది. దాంతో నేను అందంగా ఉండనని అనిపించేది. కానీ ఈ నిరాశవాదం నుంచి బయటడాలని భావించాను. మనం ఎలా ఉన్నామో అలానే అంగీకరించడంలోనే సంతోషం ఉంటుందని తెలిసింది. పరిస్థితులు ఏవైనా సరే వాటిని అంగీకరించడం.. మనల్ని మనం అభినందించుకోవడం జీవితంలో అన్నింటికంటే ముఖ్యం అని అర్థమయ్యింది. అందుకే ఈ ఫోటో షూట్ చేసానం’టూ చెప్పుకొచ్చారు.
అంతేకాక ఎంతో మంది మహిళలు ఈ వ్యాధి బారినపడి మానసికంగా కుంగిపోతున్నారని పేర్కొంది. వారిలో ధైర్యం నింపేందుకు తాను ఈ ఫొటో షూట్ చేశానని, క్యాన్సర్ బాధితులు ‘బోల్డ్ అండ్ బ్యూటీఫుల్’ అని చెప్పడమే తన ముఖ్య ఉద్దేశమని ఆమె తెలిపింది. ప్రస్తుతం ‘బోల్డ్ ఇండియన్ బ్రైడ్’తో ఈ ఫోటోలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. అందం అంటే బాహ్య సౌందర్యం మాత్రమే కాదు.. ఆత్మవిశ్వాసంతో ఉండటమే అసలైన అందమంటూ అభినందిస్తున్నారు నెటిజన్లు.
Comments
Please login to add a commentAdd a comment