సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. ప్రతి ఒక్కరికి ఫేమస్ అవ్వాలనే పిచ్చి బాగా ముదిరింది. అందుకోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రమాదకరమైన ఫీట్లు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ జంట కూడా ఇలాంటి ప్రయోగమే చేసి విమర్శలు ఎదుర్కొంటున్నారు. కెల్లి కాస్టెల్, కొడి వర్కమ్యాన్ అనే దంపతలు పోస్టీట్రావేల్లీ అనే ఇన్‌స్టాగ్రామ్ ట్రావెల్ అకౌంట్ ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ.. అక్కడి అందమైన ప్రదేశాలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూంటారు. ఈ క్రమంలో కొద్ది రోజుల కిత్రం వీరు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కొన్ని ఫోటోలు విమర్శలు ఎదుర్కొంటున్నాయి. పెరువియన్ అండెస్‌లోని లగునా హుమాంటయ్ అనే సరస్సుకు దాదాపు వంద అడుగుల ఎత్తులో.. కొండ చరియలపై ప్రమాదకర రీతిలో ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ జంట.
‘గతంలోని ప్రతికూలతలను, అణచివేతను వదిలేసి ఓ అవకాశం తీసుకొండి. మీరు ఏం కావాలనుకుంటున్నారో గమనించండి. మీ ప్రాణాలను మీరే ప్రమాదంలో పెట్టడానికి.. రిస్క్ తీసుకోవడానికి మధ్య వ్యత్యాసం ఉంది’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ ఫోటోలపై నెటిజనులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ‘ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి తప్ప ఇలాంటి ప్రయోగాల వల్ల దేశానికి కొంచెం కూడా ప్రయోజనం లేదు’.. ‘అతను ఎప్పుడు మిమ్మల్ని కొండ అంచుకే తీసుకెళ్తాడు ఎందుకు’.. ‘జనాల దృష్టిని ఆకర్షిస్తున్నాం అనుకుంటున్నారు. కానీ మీరు చేసేవన్ని బుద్ధిలేని పనులే’ అంటూ విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు. అయితే ఈ జంట మాత్రం తమ ప్రయత్నాన్ని సమర్థించుకుంటున్నారు. ‘ఇది మాకు ప్రమాదకరంగా ఏం అనిపించలేదు. చాలా సులభంగానే చేశాం. మాలోని సృజనాత్మకతకు ఈ ఫోటోలు నిదర్శనం.. మా ప్రాణాలను మేం పణంగా పెట్టం’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment