మీకు కార్లంటే విపరీతమైన అభిమానమా.. ఖరీదైన, హై ఎండ్ ఫీచర్లతో కూడిన కారు కొనాలనుకుంటున్నారా.. అయితే ఓ సారి ఈ వీడియో చూడండి. ఆ తర్వాత నిర్ణయం తీసుకొండి అంటూ ఓ నెటిజన్ ట్విటర్‌లో షేర్ చేసిన ఓ వీడియో నవ్వులు పూయించడమే కాక.. మన రోడ్ల స్థితిగతులను కళ్లకు కడుతుంది. కొద్ది రోజులుగా దేశంలోని పలు రాష్ట్రాలు వర్షాలతో తడిసి ముద్దవుతున్న సంగతి తెలిసిందే. భారీ వర్షాల కారణంగా రోడ్లన్ని గుంతలమయం అయ్యాయి. ఎక్కడ చూసినా నీరు నిలిచిపోయి చిన్న సైజు తటకాలను తలపిస్తున్నాయి. సామాన్యులు వినియోగించే ఆటో, లారీలు, టూవీలర్స్‌కు ఈ రోడ్ల మీద ప్రయాణం కొట్టిన పిండితో సమానం. కాబట్టి ఎలాంటి గుంతలనైనా లెక్క చేయక ముందుకు సాగిపోతుంటాయి.
అదే ఈ గతుకుల రోడ్ల మీద ఓ లగ్జరీ కారు ప్రయాణం చేయాల్సి వస్తే.. ఎలా ఉంటుందో ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది. పాపం గంటకు వందల కిలోమీటర్ల స్పీడ్‌తో దూసుకెళ్లే.. రూ కోటి ఖరీదైన హై ఎండ్ చెవర్‌లెట్ కారు.. ఈ గతుకుల రోడ్లను చూసి కళ్లు తేలేసింది. గుంతలు లేని చోటు చూసుకుంటూ తాబేలు కంటే నెమ్మదిగా ముందుకు కదల సాగింది. దాని వెనకే వచ్చే ఆటోలు, కార్లు చల్తా హై అన్నట్లు దూసుకుపోతుంటే.. పాపం ఈ ఖరీదైన కారు మాత్రం ఎండ కన్నెరగని సుకుమారిలా.. నిదానంగా ప్రయాణించింది.
Never get richer than the Government. pic.twitter.com/rpqoUKvjGl
— Godman Chikna (@Madan_Chikna) September 4, 2019
గాడ్‌మ్యాన్ చింకా అనే ట్విటర్ యూజర్ ‘ఎప్పడు ప్రభుత్వం కంటే ధనవంతుల కాకుడదు’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ‘ఈ రోడ్లను చూశాక ట్రాక్టర్ కొనడం ఉత్తమం అనిపిస్తుంది’.. ‘దీని బదులు ఆటో కొని ఉంటే.. ఈ పాటికి ఓ రౌండ్ వేసి వచ్చేవాడవి కదా’.. ‘అందుకే మన దేశంలో తయారయ్యే కార్లనే కొనాలి. వాటికి ఇక్కడ రోడ్ల గురించి బాగా తెలుసు’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు.
Comments
Please login to add a commentAdd a comment