గౌతమికి బాకీ లేదు | I do not speak without reason and proof | Sakshi
Sakshi News home page

ఆరోపణలకు ఆధారాలున్నాయి

Published Wed, Feb 28 2018 9:43 AM | Last Updated on Wed, Feb 28 2018 3:01 PM

 I do not speak without reason and proof - Sakshi

నటి గౌతమి , కమలహాసన్‌

తమిళసినిమా: కమలహాసన్‌పై ఆరోపణలకు తన వద్ద ఆధారాలున్నాయని నటి గౌతమి అన్నారు. మూడు రోజుల క్రితం కమలహాసన్‌ చిత్రాలకు పనిచేసినందుకు గానూ తనకు ఆయన పారితోషికం చెల్లించలేదంటూ పలు ఆరోపణలను గుప్పించిన గౌతమి మంగళవారం మరోసారి ఆయనపై ధ్వజమెత్తారు. గౌతమి తన ట్విట్టర్‌లో పేర్కొంటూ తాను ఇంతకు ముందు రాసిన పాస్ట్‌ ఈజ్‌ పాస్ట్‌ లేఖలో నటుడు కమలహాసన్‌ నుంచి తాను ఏ విధంగానూ, ఎలాంటి ప్రయోజనాన్ని ఆశించలేదన్నానని, తాను ఆయన పార్టీలో చేరబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఖండించానన్నారు. తాను కమలహాసన్‌ చిత్రాలకు పని చేసిన దానికి పారితోషికం అడిగానని, తన ఆరోపణలకు తన వద్ద ఆధారాలున్నాయని అన్నారు.

అయితే వాటికి తారుమారుగా ప్రచారం జరగడం తనను తీవ్రంగా బాధించిందన్నారు. తన నిర్ణయాలను మార్చుకోకపోవడానికి ఒక తల్లిగా కొత్త జీవితాన్ని సాగించడానికి, సురక్షితమైన భవిష్యత్‌ కోసం ఒంటరి పోరాటం చేస్తున్నానని చెప్పారు. జీవితంలో ఎన్నో నిజాయితీతో కూడిన సంతోషాన్ని కలిగించే మార్గాలు ఉన్నాయని, మంచి, మానవత్వం కలిగిన మనుషులు ఈ ప్రపంచంలో ఉన్నారని, వారితో కలిసి సమాజ సేవకు ఉపక్రమించాలని కోరుకుంటున్నానన్నారు. జీవితంలో చెడు సంఘటనలు అనేవి అందరి జీవితంలోనూ జరుగుతుంటాయని, అయితే అది మనం ఎంచుకునే మార్గాన్ని బట్టి ఉంటుందని పేర్కొన్నారు. ప్రకాశవంతమైన జీవితం కోసం కొన్ని సవాళ్లను నిజాయితీగా ఎదుర్కొనాలని అన్నారు. తానిప్పుడు అదే చేస్తున్నానని చెప్పారు. 20 ఏళ్లుగా తన జీవితంలో అన్నీ ఎదుర్కొన్నానని, ఇప్పుడు నిజాయతీతో కూడిన ప్రశాంత జీవితాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తున్నానని గౌతమి పేర్కొన్నారు.

గౌతమికి బాకీ లేదు:  నటి గౌతమి ఆరోపణలకు స్పందించిన కమలహాసన్‌కు చెందిన రాజ్‌కమల్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ నిర్వాహకులు ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో దశావతారం చిత్రాన్ని నిర్మించిన ఆస్కార్‌ సంస్థకు, విశ్వరూపం చిత్రాన్ని చేసిన పీవీపీ సంస్థకు సంబంధించిన ఆర్థికపరమైన సమస్య రాజ్‌కమల్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ఎలా బాధ్యత అవుతుందని ప్రశ్నించారు. రాజ్‌కమల్‌ సంస్థకు సంబంధించి గౌతమికి ఎలాంటి బాకీ లేదని, అందుకు ఆధారాలు చూపితే ఆమె పారితోషికాన్ని చెల్లించడానికి సిద్ధం అని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement