శ్రీమతి కమల్ హాసన్ కాదు | marriages or Maiden Heaven. | Sakshi
Sakshi News home page

శ్రీమతి కమల్ హాసన్ కాదు

Published Sat, Jun 13 2015 10:33 PM | Last Updated on Sun, Sep 3 2017 3:41 AM

శ్రీమతి కమల్ హాసన్ కాదు

శ్రీమతి కమల్ హాసన్ కాదు

మేరేజెస్ ఆర్ మేడిన్ హెవెన్.
లవ్ ఈజ్ మేడ్ ఆన్ ఎర్త్.
మూడుముళ్లు వేస్తేనేనా ప్రేమించినట్టు?
ప్రేమిస్తేనేనా మూడుముళ్లు వేసేది?
జీవిత భాగస్వామి కావడానికి ప్రేమ, పెళ్లి కాదు...

 
 బాధ్యత అవసరం.
గౌతమి కూతురు కమల్ హాసన్‌ని
‘పప్పా’ అని పిలుస్తుంది. అంటే డాడీ అని.
కమల్ హాసన్ కన్నతండ్రి కాకపోయినా.. అంతకంటే ఎక్కువే.
గౌతమి శ్రీమతి కమల్ హాసన్ కాకపోయినా అంతకు మించే.

 
 మీ పేరు చెప్పగానే ఎవరికైనా శ్రీనివాస కల్యాణం, గాంధీ నగర్ రెండవ వీధి సినిమాలు గుర్తుకొస్తాయి. తక్కువ సినిమాలు చేసినా అంత దగ్గరయ్యారు. అసలు సిసలు తెలుగమ్మాయైన మీరు మళ్లీ తెలుగు సినిమాలు చేయాలి.
 గౌతమి: (నవ్వుతూ) చెయ్యాలనే ఉంది. ఇన్నేళ్ల తర్వాత ‘పాపనాశం’ (మలయాళ ‘దృశ్యం’కి తమిళ రీమేక్) సినిమా చేయడానికైనా మా అమ్మాయి సుబ్బలక్ష్మి కారణం. ‘నా ఆలనా పాలనా చూసుకోవడం కోసం ఇన్నాళ్లూ సినిమాలకు దూరంగా ఉన్నావ్. ఇప్పుడు నేను మేనేజ్ చేసుకోగలుగుతాను. నువ్వు మళ్లీ సినిమాలు చేయాలి’ అని చెప్పింది. పిల్లల వైపు నుంచి ఇలాంటి ప్రోత్సాహం లభిస్తే, ఇక చెప్పడానికేముంటుంది? మా అమ్మ విషయంలో నేనిలానే ఆలోచించేదాన్ని.

మీ అమ్మానాన్నల గురించి చెప్పండి.
నాన్నగారు శేషగిరిరావు వైజాగ్‌లో పెద్ద పేరున్న డాక్టర్. అమ్మ వసుంధరాదేవి కూడా డాక్టరే. నాన్నగారు ఆర్మీలో పని చేశారు. మంచి ఆర్కిటెక్ట్. టోర్నమెంట్ లెవల్‌లో బ్రిడ్జ్ ప్లేయర్. బ్రహ్మాండమైన ఫొటోగ్రాఫర్. నేను పుట్టాక నాకు నచ్చలేదని హంటింగ్ వదిలేశారు. అమ్మ సూపర్ ఉమన్. ఆవిడ వర్క్ చేయని టైమ్ అంటూ ఉండేది కాదు. మా నాన్నగారికి, అన్నయ్యకి అమ్మ వంట చేస్తేనే నచ్చుతుంది. ఇంటి పనులన్నీ చక్కబెట్టి, తర్వాత కికక్‌కి వెళ్లేది. నేను సినిమాల్లోకొచ్చాక ఆవిడ లేకుండా కాలు

 బయటపెట్టేదాన్ని కాదు. సడన్‌గా అమ్మకి బైపాస్ సర్జరీ చేయాల్సి వచ్చింది. ‘ఇక చాలు.. ఆమెకి విశ్రాంతి కావాలి’ అని అప్పుడు అనిపించింది. అమ్మకి ఏం కావాలో ఆలోచించే మెచ్యూర్టీ అప్పుడు నాకొచ్చింది. ఇప్పుడు నాకేది తృప్తిగా ఉంటుందో ఆలోచించే మెచ్యూర్టీ మా సుబ్బలక్షి్ష్మకి వచ్చింది.

ఇప్పుడు మీ అమ్మ, నాన్న ఉన్నారా?
సుబ్బలక్ష్మి పుట్టిన ఏడాదికి అమ్మ చనిపోయింది. ఆమె  చనిపోయిన ఏడాది లోపు నాన్న కూడా చనిపోయారు. నా కుడి, ఎడమ భుజం లాంటి ఇద్దరూ పోవడం షాకింగ్‌గా అనిపించింది. అప్పటివరకూ రక్షణగా ఓ గూడులో ఉండేదాన్ని. ‘ఇక ఒంటరి ప్రయాణం మొదలుపెట్టాలి’ అనే ఫీలింగ్ నన్ను మానసికంగా స్ట్రాంగ్ చేసింది.

సినిమాలకు ఎందుకు దూరమయ్యారు?
అప్పటికే 120 సినిమాలకు పైగా  చేశాను. ఎంతోమంది అభిమానం పొందగలిగాను. తర్వాత ఏంటి? అనుకున్నాను. జీవితంలో ఆయా సందర్భాలను బట్టి మన ప్రాధాన్యాలు మారతాయి. నాకు మొదట్నుంచీ రైట్ టైమ్‌లో మొదటి బిడ్డను కనాలని ఉండేది. అది కూడా పాపే కావాలని అనుకున్నాను. పాప పుట్టింది. తన ఆలనా పాలనా నేనే చూసుకోవాలనుకున్నా. అందుకే, సినిమాలను పక్కనపెట్టా.
     
రైట్ ఏజ్‌లో పెళ్లి చేసుకోవాలనే చేసుకున్నారా... మీది లవ్ మ్యారేజే కదా?

అవును. మాది లవ్ మ్యారేజే. కానీ, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. వాస్తవానికి పెళ్లి కోసం నేను సినిమాలు మానేయలేదు. పెళ్లి చేసుకునే ఏడాదిన్నర ముందే సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చాను.

కానీ, పెళ్లయ్యాక కనీసం రెండేళ్లు కాకుండానే విడిపోయారేం?
     ఎవరూ ఎప్పుడూ ఒకే రకంగా ఉండరు. మనషుల మనసులు మారుతూ ఉంటాయి. ఆ మార్పు అన్నది ఒకే డెరైక్షన్‌లో జరిగితే బాగుంటుంది. వేరు వేరు డెరైక్షన్‌లో మార్పు వస్తే, కలిసి ఉండటం కష్టంగా ఉంటుంది. అందుకే, మేం విడిపోయాం.

వృత్తిపరంగా సక్సెస్ అయ్యి... వ్యక్తిగతంగా ఓడిపోయానని అనుకున్నారా?
లేదు. ఎందుకంటే, ఎవరి జీవితంలో జరగనిది ఏమీ నా జీవితంలో జరగలేదు. సిగ్గుపడిపోయి, దాక్కునేంత పని చేయలేదు నేను. రెండు మనసులు కలవనప్పుడు, కలిసి బాధపడుతూ బతికేకన్నా, విడిపోయి ఆనందంగా ఉండాలనుకున్నాం. ఇది నా ఓటమి అనుకోవడంలేదు. ఎందుకంటే, మా పాప రూపంలో నా జీవితానికో గమ్యం ఉంది. అమ్మ, నాన్న ఉన్నంతవరకూ నేను ‘వెరీ షెల్టర్డ్’. ఆ ఇద్దరూ పోవడంతో ఆ షెల్టర్  చెదిరిపోయింది. చివరికి చంటిపిల్లతో ఒంటరిగా మిగిలా. అప్పుడే ప్రపంచాన్ని చూడటం మొదలుపెట్టా (చెమర్చిన కళ్లతో).
     
మీ పాప తన తండ్రి గురించి అడగలేదా?

పాపకు ఊహ తెలిసినప్పట్నుంచీ నా జీవితంలో జరిగిన అన్ని విషయాలనూ చెప్పడం మొదలుపెట్టా. అయితే, ఏ వయసులో ఏది చెబితే అర్థమవుతుందో, అందుకు తగ్గట్టుగా అన్నీ చెప్పుకుంటూ వచ్చాను. మా పాప పరిస్థితులను అర్థం చేసుకుంది. నా కూతురు అని చెప్పడంలేదు కానీ, తను చాలా తెలివి గలది.

ఒకవైపు విఫలమైన వైవాహిక బంధం, అమ్మా, నాన్న తిరిగి రాని లోకాలకు వెళ్లడం. పైగా, చంటిపిల్ల  పెంపకం.. ఇవన్నీ ఒక ఎత్తయితే క్యాన్సర్ మరో ఎత్తు. ఒకేసారి ఇన్ని ఎదురు దెబ్బలను ఎలా డీల్ చేశారు?
ఇవన్నీ నేను ఎదురు దెబ్బలుగా అనుకోవడం లేదు. జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఉపకరించాయి. వాస్తవానికి ప్రెగ్నెన్సీ టైమ్‌లో నాకు టాక్సెమియా వచ్చింది. దాంతో బాగా బరువు పెరిగాను. కాంప్లికేషన్స్ వచ్చాయి. ఎలాగో వాటిని అధిగమించి, సేఫ్‌గా బిడ్డను కనగలిగాను. కానీ, పెంపకం పూర్తిగా నా మీద ఉంటుందనుకోలేదు. మదర్, ఫాదర్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్... నా కూతురికి అన్నీ నేనే. పాపకి ఏం పెట్టాలి? ఎలా పెంచాలి? అని నాకు నేనుగా తెలుసుకుని పెంచాను. ఈ క్రమంలో ఓ మూడు, నాలుగేళ్లు బయటి ప్రపంచాన్ని చూడటం మర్చిపోయాను. మరోవైపు క్యాన్సర్. అది కూడా నాకు తగిలిన దెబ్బగా అనుకోవడం లేదు. నా ప్రాధాన్యాలు తెలిసేలా చేసింది. ‘నా బిడ్డ, అన్నయ్య కుటుంబం, కమల్..’ ప్రపంచంలో వీళ్లే నా ప్రాధాన్యాలు అని నాకు స్పష్టంగా తెలియజేసింది. నా మానసిక ధైర్యం, వాళ్లిచ్చిన ధైర్యం నా అనారోగ్యాన్ని జయించేలా చేశాయి.

సినిమాలు చేస్తున్నప్పుడే మీరు కమల్ హాసన్‌కి దగ్గరయ్యారా?
ఆయనతో సినిమాలు చేసినప్పుడు ‘కమల్ సార్..’ అంటూ దూరం దూరంగా ఉండేదాన్ని. కమల్‌తో ఎక్కువ సినిమాలు చేసేకొద్దీ గౌరవ భావం పెరిగిపోయింది. ఇద్దరం కలిసి చేసిన చివరి సినిమా ‘ద్రోహి’. ఆ తర్వాత మేం దాదాపు నాలుగైదేళ్లు కలవలేదు. పెళ్లి చేసుకుని, అమెరికా వెళ్లిపోయాను.

మరి.. కమల్‌తో మీ బంధం ఎలా బలపడింది?
ఇండియా వచ్చిన తర్వాత పలు సందర్భాల్లో నేనూ, ఆయన కలిశాం. అప్పటికి మేమిద్దరం ఒంటరివాళ్లం. మొదట్లో సినిమాల గురించి మాట్లాడుకునేవాళ్లం. ఆ తర్వాత ఫిలాసఫీ, సైకాలజీ.. వాట్ నాట్... బోల్డన్ని టాపిక్స్ వచ్చేవి. జీవితం పట్ల అవగాహన, ప్రతిభ, అందమైన గుణం, ఆశావహ దృక్పథం... ఇలాంటి మంచి లక్షణాలు కమల్‌లో చాలా ఉన్నాయి. ఆయనతో మాట్లాడుతుంటే మంచి మంచి విషయాలు తెలుస్తాయి. స్టేజ్ బై స్టేజ్ మా మధ్య అనుబంధం పెరిగింది.

ఆ అనుబంధం దీర్ఘకాలంగా (దాదాపు పదేళ్లు) కొనసాగడానికి కారణం?
నా జీవితాన్ని ఒక రకంగా ముందు నుంచీ ఊహించుకున్నాను. అమ్మ, నాన్న, అన్నయ్య... వీళ్లతోనే నా లైఫ్ అనుకున్నాను. అనుకోకుండా సినిమాల్లో అవకాశం వచ్చింది.  సక్సెస్ అయ్యాను. పెళ్లయ్యింది. అది సక్సెస్ కాలేదు. చేతిలో చంటిబిడ్డతో మిగిలాను. ఒక రకంగా అది పరీక్షాకాలం. ఆ సమయంలో నాకు కమల్  సెక్యూర్టీని  ఇవ్వగలిగారు. ఏ బంధం అయినా దీర్ఘకాలం నిలవాలంటే ఒకరిపట్ల మరొకరికి గౌరవం ఉండాలి. ఒకరి అభిప్రాయాలకు మరొకరు విలువ ఇవ్వాలి. ఇద్దరికీ తాము అనుకున్నది ఎదుటి వ్యక్తికి చెప్పుకోగల స్వేచ్ఛ ఉండాలి. అంత  ఓపెన్‌గా ఉన్న ఏ బంధం అయినా బలంగా ఉంటుంది. దానికి ‘లాంగ్ స్టాండింగ్’ ఉంటుంది.

మీ సహజీవనం గురించి మీకెలాంటి విమర్శలూ వినిపించలేదా?
 అస్సలు లేదండి. నేను సినిమాల్లోకొచ్చే ముందు ‘ఇండస్ట్రీ మంచిది కాదు.. చాలా జాగ్రత్తగా ఉండాలి’ అనేవాళ్లు. కానీ, ఇక్కడ నాకెలాంటి చేదు అనుభవాలు ఎదురు కాలేదు. దాన్నిబట్టి నేను చెప్పేదేంటంటే, ‘మనం ఎలా ఉంటామో.. మనతో ఎదుటి వ్యక్తులు అలానే ఉంటారు’ అని. ‘రిలేషన్‌షిప్స్’కి కూడా ఇది వర్తిస్తుంది. ఒక వ్యక్తి నుంచి ఏదైనా ఆశించి, అందుకు తగ్గట్టుగా లెక్కలేసుకుని ఆ వ్యక్తికి దగ్గరైతే, అది బయటివాళ్లు కనిపెట్టగలుగుతారు. అప్పుడు విమర్శలు వస్తాయి. నిజాయతీగా ఏర్పడిన బంధాల మీద గౌరవ భావం ఉంటుంది.
 
కానీ, సహజీవనాన్ని సమాజం ఒప్పుకుంటుందా?

సమాజం అంటే ఏంటండి? నేను, మీరు, ఇంకొకరు, మరొకరు... అంతేగా? ఎవరి జీవితాలు వాళ్లవి. అందరూ ఒకే విధంగా జీవించరు కదా. అయితే, జీవించే విధానంలో హుందాతనం ఉండాలి. అప్పుడు సమాజం కూడా ఆ హుందాతనాన్ని గౌరవిస్తుంది.

సహజీవనం చేయాలనుకున్న తర్వాత, మీ పిల్లలు ఏమైనా అనుకుంటారేమోనని మీరు, కమల్ అనుకోలేదా?
 ‘టు ఇండిపెండెంట్ పీపుల్ ఆన్ ది సేమ్ రోడ్’ అనుకున్నాం. కలిసి ప్రయణం చేస్తాం. మా ఇద్దర్నీ ఆమోదించాల్సిందేనని ముగ్గురు పిల్లల్నీ ఒత్తిడి చేయలేదు. వాళ్లే అర్థం చేసుకున్నారు.

మళ్లీ పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకోలేదు?
పెళ్లి మీద గౌరవం ఉంది కాబట్టే, చేసుకున్నా. కానీ, విఫలమైంది. ఇద్దరు వ్యక్తులు కలిసి బతకాలనుకుంటే, మాట రూపంలో చెప్పినా, వేడుకగా జరిపి నలుగురికీ తెలియజేసినా... ఏ రూపంలో వ్యక్తపరిచినా ఒకటే. వీటిలో ఏం చేసినా ఇద్దరి మధ్య అవగాహన ఉండటం ముఖ్యం. మా లైఫ్‌లో ఆ అవగాహన ఉంది. ఘనంగా పెళ్లి చేసుకున్నవాళ్లల్లో ఎంతమంది ఆనందంగా ఉంటున్నారో చెప్పండి? పెళ్లయ్యింది కదా... ఇక కలిసి బతికేద్దాం అని బలవంతంగా బతుకుతున్నవాళ్లు లేరా?.
     
మరి... మీ సుబ్బలక్ష్మి పెళ్లి చేసుకోనంటే అంగీకరిస్తారా?

తన ఇష్టం. పెళ్లయినా, రిలేషన్‌షిప్ అయినా... ఏం చేసినా సిన్సియర్‌గా చేయమని చెబుతా.

ఓకే... చాలా విరామం తర్వాత ‘పాపనాశం’లో నటించారు. కమల్ సినిమా కాబట్టే ఒప్పుకున్నారనుకోవచ్చా?
చాలామంది కమల్ సినిమాల్లోనే నటిస్తానని ఊహించుకుంటున్నారు. కానీ, అందరితోనూ సినిమాలు చేయాలనుకుంటున్నా. ‘పాపనాశం’లోని పాత్ర నేను చేస్తే బాగుంటుందని దర్శక, నిర్మాతలు కమల్‌ని అడిగారు. నన్నడగమని కమల్ అన్నారట. ఆ తర్వాత నన్నడగడం, యాక్టింగ్ నా ఫస్ట్ లవ్ కావడంతో ఆనందంగా అంగీకరించడం జరిగాయి.

ఇక  పైనా సినిమాల్లో కొనసాగుతారా?
సినిమాల్లో నటించడం మానేశాను తప్ప కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేస్తున్నాను. ‘దశావతారం’ అప్పుడు ఎందుకన్నారో కానీ, ‘ఈ సినిమాకు నువ్వు కాస్ట్యూమ్ డిజైన్ చేస్తున్నావ్’ అని కమల్ అన్నారు. అదొక మంచి సవాల్ అనిపించి, ఒప్పుకున్నాను. అప్పట్నుంచీ ఇప్పటివరకూ కమల్ చేసిన సినిమాలకు డిజైనింగ్ చేస్తున్నాను. నటన అంటే ఇష్టం కాబట్టి, ఇక నటిగా కొనసాగాలనుకుంటున్నా.

ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు?
రొటీన్ అనిపించే పాత్రలకు దూరంగా ఉండాలనుకుంటున్నా. నేను చేసే పాత్ర ఆ సినిమాకి కీలకంగా ఉండాలి. అది ఏ భాష సినిమా అయినా ఓకే. నేను చేయడానికి రెడీ.

మళ్లీ వ్యక్తిగత విషయాలకొద్దాం.. కమల్‌తో మీ కూతురి అనుబంధం గురించి.. ఆయన్ను తను ఏమని పిలుస్తుంది?
‘షీ ఈజ్ హిజ్ డాటర్’. పప్పా అని పిలుస్తుంది. ఆ రిలేషన్‌షిప్ వాళ్లు బిల్డప్ చేసుకున్నదే తప్ప నేను కావాలని బిల్డప్ చేసినది కాదు. సుబ్బలక్ష్మికి కమల్ అంటే ఎంతో ప్రేమ. ఆయనక్కూడా అంతే.

{శుతీహాసన్, అక్షరాహాసన్‌లు మిమ్మల్ని అంగీకరించారా?
అంగీకరించడం అంటే ఏంటి? వాళ్లిద్దరూ కమల్ కూతుళ్లు. కమల్ జీవితంలో ఉన్న ఆ ఇద్దర్నీ ఎవరూ రీప్లేస్ చేయలేరు. నా జీవితంలో ఉన్న  సుబ్బలక్ష్మిని ఎవరూ రీప్లేస్ చేయలేరు. ఆ క్లారిటీ మాకు ఉంది.

నటిగా శ్రుతీహాసన్ దూసుకెళుతున్నారు.. తన గురించి నాలుగు మాటలు?
{శుతీహాసన్ చాలా హార్డ్ వర్కింగ్. లాస్ ఏంజిల్స్‌లో తను మ్యూజిషియన్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాలనుకున్నప్పుడు నా క్యాన్సర్ ట్రీట్‌మెంట్ చివరి చికిత్స పూర్తయ్యింది. అప్పుడు కమల్ బిజీగా ఉన్నారు.  సుబ్బలక్ష్మిని తీసుకుని శ్రుతీతో లాస్ ఏంజిల్స్ వెళ్లి, అన్ని ఏర్పాట్లూ చేసొచ్చాను. ఆ తర్వాత తను ఒంటరిగా అక్కడ ఉండి, చదువుకుని ఇక్కడికొచ్చింది. వచ్చాక తన కెరీర్‌ని తానే బిల్డప్ చేసుకోవాలనే పట్టుదల మీద ఉండేది. ఆ పట్టుదల ఫలితమే తన ఈ సక్సెస్. శ్రుతి ఎదుగుదల చూస్తే, గర్వంగా ఉంటుంది.
     
సుబ్బలక్ష్మిని కూడా కథానాయిక చేస్తారట?
నటన అనే కాదు.. ఫిలిం మేకింగ్ అంటే తనకిష్టం. ఆర్టిస్ట్, టెక్నీషియన్.. ఏది కావాలన్నా ఇంకా చాలా టైముంది. తనకిప్పుడు పదిహేనేళ్లే కదా.

మీరు వంట చేస్తారా? ఎప్పుడైనా కమల్ కూడా గరిట తిప్పుతారా?
కుక్ ఉన్నారు. ఎందుకంటే, పని మీద నేను బయటికెళ్లినప్పుడు ఇంట్లోవాళ్లు ఇబ్బందిపడకూదు కదా. వీలు చిక్కినప్పుడల్లా నేను వంట చేస్తాను. ఒకసారి ‘అవియల్’ (కలగలుపు కూర) చేస్తున్నా. వంట గదిలోకి తొంగి చూసి, ‘ఏం చేస్తున్నావ్’ అని కమల్ అడిగారు. అవియల్ చేస్తున్నానంటే, ‘నేనూ హెల్ప్ చేస్తా’ అంటూ, కూరగాయలు కోసి ఇచ్చారు. కూరకు కావాల్సిన దినుసులను మిక్సీ పట్టి ఇచ్చారు. ఆ పనులన్నీ ఇష్టంగా చేశారు. మర్నాడు కూడా వంటలో సహాయం చేశారు. ఆయన ఏం చేసినా సరే చాలా ఆసక్తిగా చేస్తారు.
     
మామూలుగా వైవాహిక బంధంలోనే ‘సెవెన్ ఇయర్స్ ఇచ్’ అంటుంటారు.
(మధ్యలో అందుకుంటూ...) ఎలాంటి ఇచ్చింగ్స్ లేవు. ప్రతిరోజూ కొత్తగా, ఆసక్తిగా ఉంటుంది. మేం బోల్డన్ని విషయాలు మాట్లాడుకుంటాం. పుస్తకాలు చదువుతాం. మా డైనింగ్ రూమ్‌లో టీవీ ఉండదు. సెల్‌ఫోన్స్, ఐప్యాడ్‌లకు స్థానం లేదు. హాయిగా మాట్లాడుకుంటూ, భోజనం చేస్తాం.

‘విశ్వరూపం’ సమయంలో కమల్ ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు. అలాంటి క్లిష్టమైన పరిస్థితులను, బాధలను మీతో పంచుకుంటారా?
నాకేదైనా సమస్య వచ్చినప్పుడు నేను ఆయన దగ్గరే చెప్పుకుంటాను. ఆయన కూడా అంతే. మంచి, చెడూ పంచుకోలేని బంధం ఎందుకు? అందుకే.. మా బాధలనూ, సంతోషాలనూ పంచుకుంటాం.

కమల్‌ని ఎవరైనా కలవాలంటే, ముందు మీ అనుమతి తీసుకోవాలన్నది చాలామంది ఊహ?
ఆ ఊహ నిజం కాదు. నా సలహాల మీద ఆధారపడేంత చిన్నపిల్లాడు కాదాయన. ‘కమల్ ఈజ్ అడల్ట్’. లైఫ్‌ని మ్యానేజ్ చేయడం ఆయనకు బాగా తెలుసు. నేను చెప్పిందే చేస్తారని చాలామంది అనుకుంటారు. ఆయన మా ఇంటి పెద్ద. నా నిర్ణయాల కోసం నేనే ఆయన సలహా తీసుకుంటాను. ఇక, నేను చెబితే ఆయన చేస్తారని అనుకోవడం నాకు జోక్‌గా అనిపిస్తుంది. అందుకే, కమల్‌ని కలవాలనుకుని నా అనుమతి కోసం ఎదురుచూసేవాళ్ల దగ్గర, ఆయన మేనేజర్ నంబరో, పీఆర్‌ఓ నంబరో ఇచ్చేస్తాను.
     
ఫైనల్లీ మీ జీవితం గురించి?

చాలా ప్రశాంతంగా ఉంది.     - డి.జి. భవాని
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement