సిట్టింగ్ ప్రెట్టీ
‘సిట్టింగ్ ప్రెట్టీ’ అంటే జీవితంలో అన్ని అవకాశాలు
మన దగ్గరకి వచ్చే పొజిషన్‌లో కూర్చుని ఉండడం...
సక్సెస్ కొట్టి కంఫర్ట్‌లో కూర్చుని ఉండడం...
కంఫర్టబుల్‌గా కూర్చున్నా కెరీర్ పరుగులు పెట్టడం...
ప్రతి ‘సిట్టింగ్’లోనూ హీరోయిన్‌గా ఈవిడే కావాలని డైరెక్టర్ అనడం..
అన్ని సినిమాల్లోనూ అబ్బో.. ఎంత ‘ప్రెట్టీ’ అని ఆడియన్స్ ఆరాధించడం...
దిస్ ఈజ్ శ్రుతీహాసన్... షి ఈజ్ ‘సిట్టింగ్ ప్రెట్టీ’
అమ్మానాన్నల నుంచి అవి నేర్చుకున్నా...
నాన్నగారు చాలా క్రమశిక్షణ గల నటుడు. పాత్రలోకి చాలా డీప్‌గా వెళ్లిపోతారు. ప్రయోగాలు చేయడానికి ఏమాత్రం భయపడరు. అమ్మ కూడా చాలా స్ట్రాంగ్. తల్లవ్వాలనుకున్నప్పుడు కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉంది. స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటుంది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా అమ్మానాన్న దగ్గర నుంచి ఆదర్శంగా తీసుకోదగ్గ విషయాలు చాలా ఉన్నాయి.
⇔ న్యూ ఇయర్, సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేసుకున్నారు.. త్వరలో వేలంటైన్స్ డే రాబోతోంది.. ఎలా?
(మధ్యలో అందుకుంటూ) ఏం అడగబోతున్నారో అర్థమైంది. నాకు ఊహ తెలియకముందు వేలంటైన్స్ డే గురించి తెలియదు. తెలిశాక దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. సెలబ్రేట్ చేసుకునే అలవాటు లేదు.
⇔ ఫుల్ జోష్‌గా ఉన్నారు.. ఇంతకుముందు కనిపించిన శ్రుతీకీ, ఇప్పటి శ్రుతీకి కొంచెం మార్పు కనిపిస్తోంది?
ఎప్పటిలానే ఉన్నాను. కాకపోతే ఆలోచనా విధానం మారింది. జీవితాన్ని చూసే తీరులో మార్పొచ్చింది. లైఫ్ పట్ల క్లారిటీ వచ్చింది.
⇔ అందుకేనేమో ‘మార్పు చాలా అందమైనది. నా లైఫ్‌లో ఆ మార్పు వచ్చింది. మార్పు అనేది సవాల్ లాంటిది’ అని ట్వీట్ చేశారు. మీకు సవాల్ అనిపించిన విషయం ఏంటి?
సవాల్ అని అన్నది మనుషులను ‘డీల్’ చేసే విషయం గురించి. కొందరు అస్సలు అర్థం అవ్వరు. సినిమా ప్రపంచం పెద్దది. కొందరిని డీల్ చేయడం కష్టంగా ఉంటుంది. మార్పు గురించి చెప్పాలంటే.. నా ఆలోచనా విధానం మారింది. లైఫ్ సై్టల్ మారింది. ఆహారపు అలవాట్లు మారాయి. ఈ మార్పులు బాగున్నాయి.
⇔ ‘నా చుట్టూ ఉన్న గుడ్ పీపుల్‌కి థ్యాంక్స్’ అని కూడా ట్వీట్ చేశారు.. ఆ మంచి వ్యక్తులెవరో చెబుతారా?
నా ఫ్యామిలీ మెంబర్స్, నా ఫ్రెండ్స్‌ని ఉద్దేశించే అలా అన్నాను. ఎంత కాదనుకున్నా ఒక్కోసారి ‘లో’ అవుతాం. అలాంటి సమయాల్లో నా ఫ్రెండ్స్ మీద డిపెండ్ అవుతాను. నిజంగా ‘గాడ్ ఈజ్ వెరీ గ్రేట్’. ఎందుకంటే, నాకు మంచి ఫ్యామిలీ మెంబర్స్‌ని, ఫ్రెండ్స్‌నీ ఇచ్చాడు. నా చుట్టూ ఉన్నవాళ్లంతా నా సంతోషాలనూ, బాధలనూ సమానంగా పంచుకునేవాళ్లే.
⇔ సెలబ్రిటీల లైఫ్ క్లిష్టమే. కాంప్లిమెంట్స్ తక్కువ.. కాంట్రవర్సీలు ఎక్కువ?
కామెంట్స్ తీసుకోదగ్గవి అయితే తీసుకుంటాను. టైమ్‌పాస్ కోసం మాట్లాడుతున్నారనిపిస్తే... మనసుకి ఎక్కించుకోను. పట్టించుకుంటే నా పని మీద దృష్టి పెట్టలేను. ‘డౌన్’ అయిపోతాను. ఒకర్ని ‘డౌన్’ చేయడం ద్వారా తాము ‘అప్’ అవుతామనుకునేవాళ్లు ఏదేదో మాట్లాడతారు. ఆ మాటలను నెగటివ్‌గా కాకుండా పాజిటివ్‌గా తీసుకుంటే మనకు మంచిది. మన పని మనం బాగా చేయగలుగుతాం.
⇔ బాగా చెప్పారు... ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. సినిమా హిట్టయితే హీరో గురించి ఎక్కువ.. హీరోయిన్ల గురించి తక్కువ మాట్లాడుతుంటారు. అప్పుడు మీకేమనిపిస్తుంది?
ఇది ఎప్పటి నుంచో ఉన్నదే. ఉన్నట్లుండి మార్పు ఆశించలేం. హీరోల గురించి ఎక్కువ మాట్లాడితే మాట్లాడనివ్వండి. నో ప్రాబ్లమ్. నా మటుకు నేను నాకు మంచి పాత్ర ఇచ్చారా? ఆ పాత్ర బాగా చేశానా? అని మాత్రమే ఆలోచిస్తాను. ఆ సంగతలా ఉంచితే.. ఇప్పుడు సినిమా ఫీల్డ్‌లో ఉమెన్ డామినేషన్ కూడా ఉంది. ఈ మధ్య లేడీ ఓరియంటెడ్ మూవీస్ ఎక్కువ అయ్యాయి. అవి హిట్టవుతున్నాయి. వాటి గురించి మాట్లాడేటప్పుడు హీరోయిన్ల గురించే మాట్లాడాలి కదా.
⇔ సెలబ్రిటీల జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చాలామంది ఉత్సాహంగా ఉంటారు.. అది మీకెలా అనిపిస్తుంది?
ఓ స్టార్ కూతురిగా నా పర్సనల్ లైఫ్ ఎప్పుడూ పబ్లిక్‌లోనే ఉంది. చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది. నా పర్సనల్ లైఫ్ గురించి ఎక్కడా మాట్లాడను. తెలుసుకోవాలనుకున్నవాళ్లు ఆసక్తి కనబరుస్తారు. నేనేం చేయలేను.
⇔ మీ నాన్నగారి నుంచి గౌతమిగారు విడిపోవడానికి కారణం మీరే అని కూడా ఆసక్తిరాయుళ్లు అంటున్నారు..
అది నాన్నగారి పర్సనల్ విషయం. దాని గురించి నేనేం మాట్లాడదల్చుకోలేదు. నిజానికి నాన్నగారనే కాదు.. నేను ఎవరి పర్సనల్ విషయాల గురించీ పబ్లిక్‌గా మాట్లాడను.
⇔ ఎంత కాదనుకున్నా.. ఇలాంటి నెగటివ్ కామెంట్స్ ప్రభావం ఉండకుండా ఉండదు.. ఆ ప్రభావం నుంచి మీరెలా బయటపడతారు?
కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. కాదనడంలేదు. కాసేపు ఆలోచిస్తా. ఇతరుల నుంచి ప్రశంసలు ఆశిస్తేనే ప్రాబ్లమ్. ఒకళ్లు ఇచ్చే క్రెడిట్‌ని ఆశిస్తే పైకి రాలేం. అందుకే ప్రశంసలను ఆశించను. విమర్శలను కూడా లైట్ తీసుకోవడానికే ప్రయత్నిస్తా.
⇔ ఈ మధ్య మీ నాన్న (కమల్‌హాసన్) గారితో మీరెక్కువగా టైమ్ స్పెండ్ చేస్తున్నట్లనిపిస్తోంది. వయసు పెరిగే కొద్దీ తల్లిదండ్రుల విలువ బాగా తెలుస్తుందంటారు. మీలో ఆ మార్పు...
అఫ్‌కోర్స్ మనం ఎదిగే కొద్దీ పేరెంట్స్ విలువ స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్లు బాగా అర్థం అవుతారు. అది కామన్. అయితే మా నాన్నగారితో నేను ఇప్పుడు కాదు.. ఎప్పుడూ క్లోజ్‌గానే ఉంటాను. ఆయన ఆలోచనలు నాకు నచ్చుతాయి. అవసరమైనప్పుడు ఇచ్చే సలహాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. నన్నూ, అక్షరనీ మగపిల్లల్లా ట్రీట్ చేస్తారు. ఆయన చెప్పే మాటలు ఇన్‌స్పైరింగ్‌గా ఉంటాయి.
⇔ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో శుత్రీ పెళ్లి చేసుకుంటే చూడాలనీ, తన పిల్లలను ఎత్తుకోవాలనీ మీ నాన్న అన్నారు. మరి.. ఎప్పుడు నెరవేరుస్తారు?
(నవ్వుతూ). నాన్నగారు ఈ మాటలు చాలాసార్లు అన్నారు. కానీ, దేనికైనా టైమ్ రావాలి. అది వచ్చినప్పుడు ఏదీ ఆగదు.
⇔ కొంతమంది ఆడవాళ్లు పెళ్లయిన తర్వాత ఉద్యోగానికి ఫుల్‌స్టాప్ పెట్టేస్తుంటారు.. మీరు?
ఇంకా పెళ్లి గురించే ఆలోచించలేదు. ఆ తర్వాత విషయం గురించి అడుగుతున్నారు. కెరీర్‌కి పెళ్లి ఆటంకం కాదని నా ఫీలింగ్. ఇష్టపడి ఫుల్‌స్టాప్ పెడితే ఓకే. కానీ, అత్తమామలు వద్దన్నారనో, భర్త వద్దన్నాడనో కెరీర్‌ని త్యాగం చేయకూడదు. నేను నా ఇష్టప్రకారమే నిర్ణయాలు తీసుకుంటాను. నాకు సినిమాలంటే ఇష్టం. భార్య అయ్యాక, తల్లయ్యాక కూడా వదలనేమో.
⇔ మగవాళ్లతో పోల్చితే ఆడవాళ్లు శారీరకంగా వీక్... మానసికంగా కూడా చాలామంది అలానే ఉంటారు.. వాళ్లకు మీరిచ్చే సలహా?
సలహాలిచ్చేంతగా ఎదిగానో లేదో తెలియదు. కానీ, ఒకటి మాత్రం చెబుతాను. ప్రపంచాన్ని చూడండి. ఏం జరుగుతుందో తెలుసుకోండి. భారతదేశంలోనే కాదు.. అమెరికాలోనూ ఆడవాళ్ల గురించి ఎలా మాట్లాడుతున్నారో వినండి. శారీరక బలంకన్నా మానసికం బలం గొప్పది. అందుకే అంటున్నా... ‘బీ స్ట్రాంగ్’. అలాగని ఎగబడి ఎవర్నీ తిట్టమనడంలేదు.. కొట్టమనడంలేదు. మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా జీవించడం కోసం బలంగా ఉండాలి.
⇔ ఆడవాళ్ల సక్సెస్‌ని అంగీకరించడానికి పురుషాధ్యిక ప్రపంచం దాదాపు ఒప్పుకోదు. ప్రతిభ గురించి మాట్లాడకుండా అందంగా ఉందని సక్సెస్ అయిందనో, మాటలు చెప్పగలదనో.. ఇలా ఏవేవో అంటారు. మీ ఫీల్డ్ నుంచి మా ఫీల్డ్ వరకూ ఇలానే ఉంది..
సరిగ్గా చెప్పారు. ఇది మేల్ డామినేటెడ్ వరల్డ్. ఫిమేల్ సక్సెస్‌ని మనస్ఫూర్తిగా అంగీకరించేవాళ్లు తక్కువమంది ఉంటారు. కానీ, మా నాన్నగారిలాంటి మగవాళ్లు కూడా ఉంటారు. తన కూతుళ్ల సక్సెస్‌నే కాదు.. బయటి ఆడవాళ్ల సక్సెస్‌ని కూడా ఆయన అభినందిస్తారు. ఇక, విమర్శించే వాళ్ల గురించి అంటారా? పట్టించుకోవడం అనవసరం. మన పని మనం చేసుకుంటూ వెళ్లడమే.
⇔ రీసెంట్‌గా బర్త్‌డే జరుపుకున్నారు. ఆ సెలబ్రేషన్స్?
నా బర్త్‌డే పార్టీ చాలా చిన్నగా ఉంటుంది. నా ఫ్యామిలీ మెంబర్స్, క్లోజ్ ఫ్రెండ్స్.. అంతే. చెన్నైలో ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. నాన్నగారితో కలసి సెలబ్రేట్ చేసుకుంటాను. ఈసారి అక్కడే ఉన్నాను. నాన్నగారు, నా ఫ్రెండ్స్‌తో ఇంట్లోనే ఎంజాయ్ చేశా.
⇔ రోజులు.. నెలలు.. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ వ్యక్తిగా ఎదుగుతాం.. మారతాం. మీలో వచ్చిన మార్పు గురించి?
మీరన్నది కరెక్టే. ఐదేళ్ల క్రితం ఉన్నట్లు ఇప్పుడు ఉండం. ఇప్పుడున్నట్లు ఐదేళ్ల తర్వాత ఉండం. ఈ మధ్య నాలో వచ్చిన ఒక ముఖ్యమైన మార్పు ఏంటంటే... ఏ విషయం గురించైనా క్లియర్‌గా ఆలోచించిస్తున్నాను. నాకేం కావాలో, ఏం అక్కర్లేదో స్పష్టంగా తెలుసుకోగలుగుతున్నా. ‘మనం ఈ మాట మాట్లాడితే ఎవరైనా హర్ట్ అవుతారేమో’ అనే ఫీలింగ్‌తో నా మనసులోని మాటలను చెప్పేదాన్ని కాదు. కానీ, ఇప్పుడు మనం అబద్ధం ఆడనంతవరకూ, నిజాయితీగా ఉన్నంతవరకూ మన మనసుకి అనిపించిన మాటలు మాట్లాడాలని ఫిక్స్ అయ్యాను. అయితే నా మాటలు ఎవర్నీ బాధపెట్టకుండా జాగ్రత్తపడుతున్నా.
చిన్నప్పటి నుంచి నాకు పుస్తకాలు చదవడం బాగా
అలవాటు. యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు ‘ఇల్యూజన్’ అనే పుస్తకం చదివాను.
ఇప్పటికీ అప్పుడప్పుడూ తిరగేస్తుంటాను.
ఆ పుస్తకం చదువుతుంటే నా జీవితానికి అర్థం తెలుసుకున్నట్లుగా ఉంటుంది. రిచర్డ్ బక్ అద్భుతంగా రాశారు.
⇔ సినిమాల ఎంపిక విషయంలో కూడా మీలో ఏమైనా మార్పు వచ్చిందా?
ఆ మార్పు కూడా వచ్చింది. ప్రొఫెషనల్‌గా అంతకుముందు ‘యస్’ అన్నవాటికి ఇప్పుడు ‘నో’ అంటున్నా. ‘క్రిస్టల్ క్లియర్’ అంటారు. ఇప్పుడు నా ఆలోచనా విధానం అలానే ఉంది.
⇔ మామూలుగానే మీరు స్ట్రాంగ్ గర్ల్.. ఇప్పుడు మరీ స్ట్రాంగ్ అయినట్లున్నారు?
అవును. చైల్డ్‌హుడ్ నుంచీ నేను కొంచెం స్ట్రాంగే. నా బాడీ లాంగ్వేజ్, నా మాట తీరు ఆ విషయాన్ని బయటపెట్టేస్తాయి. నేను బోల్డ్‌గా ఉండటానికి ఓ కారణం పెంపకం. నాన్నగారు ‘నువ్వు ఆడపిల్లవి’ అని గుర్తు చేస్తూ నన్ను, అక్షరను పెంచలేదు. చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఇప్పుడూ అలానే ఉంటున్నారు. ఏదైనా చెప్పుకునేంత స్వేచ్ఛ నాన్న దగ్గర ఉంది.
⇔ ఈ మధ్య ఏడాదికో తీపి గుర్తు అన్నట్లు.. 2015లో ‘శ్రీమంతుడు’, 2016లో ‘ప్రేమమ్’.. ఈ రెండూ మిగిల్చిన అనుభూతి గురంచి?
నిజంగా ‘శ్రీమంతుడు’ నా సినిమా కెరీర్‌లో ఎప్పటికీ ఓ స్వీట్ మెమరీ. ఒక కమర్షియల్ సినిమాలో మంచి వేల్యూస్ చెప్పడం అనేది వందకు వంద శాతం కుదరకపోవచ్చు. ‘శ్రీమంతుడు’కి కుదిరింది. నా క్యారెక్టర్ సూపర్బ్. ఆర్టిస్ట్‌గా సంతృప్తినిచ్చిన పాత్ర. ఇక, ‘ప్రేమమ్’ డిఫరెంట్. ‘శ్రీమంతుడు’లో స్టూడెంట్‌గా చేస్తే.. ‘ప్రేమమ్’లో లెక్చరర్‌గా చేశా. సింపుల్ అండ్ బ్యూటిఫుల్ క్యారెక్టర్.
⇔ 2017 ఎలా ఉంటుందనుకుంటున్నారు?
ఎప్పటిలానే పాజిటివ్‌గానే ఉన్నాను. నాన్నగారికి కూతురిగా నా రియల్ లైఫ్ క్యారెక్టర్‌ని ‘శభాష్ నాయుడు’లో చేయడం ఓ మంచి అనుభూతి. నాన్నగారి లాంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్, టెక్నీషియన్‌తో సినిమా చేయడం మంచి లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్‌లాంటిది. ఆనందించదగ్గ విషయం ఏంటంటే.. ఓ దర్శకుడిగా నాన్నగారికి నా నటన నచ్చింది. అది చాలు. తెలుగులో ‘గబ్బర్‌సింగ్’ తర్వాత పవన్ కల్యాణ్‌గారితో ‘కాటమరాయుడు’ చేస్తున్నాను. ఇది కూడా చాలా మంచి సినిమా. త్వరలో విడుదల కానున్న ‘సింగమ్ 3’ కూడా బాగుంటుంది.
⇔ అవకాశాలు తెచ్చుకోవడం కష్టం. స్టార్ కావడం ఇంకా కష్టం. ఆ స్టేటస్‌ని నిలబెట్టుకోవడం మరీ మరీ కష్టం. ఓ స్టార్‌గా మీకిది ఒత్తిడిగా ఉంటుందా?
అస్సలు లేదు. ఇప్పుడు మనం స్టార్.. రెండేళ్ల తర్వాత ఇలానే ఉంటామా? అని ఆలోచించడం మొదలుపెట్టిన క్షణం నుంచి ప్రెజర్ మొదలవుతుంది. అందుకే నా ఆలోచనలను అంత దూరం వెళ్లనివ్వను. ఇప్పుడు మంచి సినిమాలు చేస్తున్నానా? లేదా అని మాత్రమే పట్టించుకుంటాను. మంచి రోల్స్ చేయాలని తాపత్రయపడతాను.
⇔ ఒకేసారి రెండు మూడు సినిమాలు చేçస్తున్నారు.. ఎక్కువ వర్క్ చేస్తే బోర్..?
సక్సెస్ అనేది నాకు ఈజీగా రాలేదు. చాలా స్లోగా వచ్చింది. వెనక్కి తిరిగి చూసుకోలేనంత బిజీని చేసింది. చేతినిండా పని ఉంది. చేసే పనిని కష్టంగా ఫీలైతే బోర్ ఏంటి.. అలసట కూడా అనిపిస్తుంది. రెండేళ్ల క్రితం నేను ఏడు సినిమాలు చేశాను. పర్సనల్ లైఫ్ గురించి ఆలోచించుకునే తీరికే లేకుండాపోయింది. అయినా బాగానే అనిపించింది. ఎందుకంటే, టాలెంట్ ఉండి కూడా సరైన ఛాన్స్ దక్కనివాళ్లు ఉన్నారు.
⇔ ఫైనల్లీ హీరోయిన్‌గా సెవన్ ఇయర్స్ జర్నీ ఎలా అనిపిస్తోంది?
ఏడేళ్లు త్వరగా గడచిపోయాయి. ఇంకా చాలా సినిమాలు చేయడానికి ఎగై్జటెడ్‌గా ఉన్నాను. చిన్నప్పటి నుంచి నాన్న కెరీర్ చూస్తున్నాను. అందుకే ఫ్లాప్స్.. సక్సెస్‌లను సమానంగా తీసుకోవడం అలవాటైంది.
– డి.జి. భవాని