అంతా మేజిక్‌లా ఉంది!
‘‘మా నాన్నగారు వెరీ స్ట్రాంగ్. ఆయనకు జరిగిన ప్రమాదం నుంచి కోలుకోవడానికి చాలా నెలలు పడుతుందనుకున్నా. కానీ, చాలా త్వరగా కోలుకుంటున్నారు. అంతా మేజిక్‌లా అనిపిస్తోంది. త్వరలో ‘శభాష్ నాయుడు’ షూటింగ్ మొదలుపెడతాం’’ అని శ్రుతీహాసన్ అన్నారు. దాదాపు ఏడు నెలల క్రితం కమల్‌హాసన్ ఇంట్లో పడిపోయిన విషయం, అప్పుడు ఆయన కాలు ఫ్రాక్చర్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన దాదాపు రికవర్ అయ్యారు.
ఈ సందర్భంగా శ్రుతీహాసన్ మాట్లాడుతూ – ‘‘వాస్తవానికి నాన్నగారికి ప్రమాదం జరిగినప్పుడు నేను ఇండియాలో లేను. ఫోన్‌లో చెప్పారు. వినగానే చాలా బాధపడ్డాను. ఇండియా వచ్చాక ఆయన పరిస్థితి చూసి, కంగారుపడ్డాను. నాకు తెలిసి వేరే ఎవరైనా అయితే ఇంత త్వరగా కోలుకుని ఉండేవారు కాదు. నాన్నగారిలో ఉన్న సంకల్పసిద్ధిని ఇంతవరకు ఎవ్వరిలోనూ చూడలేదు. ఆ విల్ పవరే ఆయన్ను త్వరగా కోలుకునేలా చేసింది. నేను, నాన్న తండ్రీ కూతుళ్లుగా నటిస్తోన్న ‘శభాష్ నాయుడు’ షూటింగ్‌కి బ్రేక్ పడిన విషయం తెలిసిందే. త్వరలో మళ్లీ చిత్రీకరణ మొదలుపెడతాం’’ అన్నారు.