
తమిళసినిమా: ఎలా ఉంది నా గెటప్? స్టైలిష్‌గా ఉందా? అదిరిందా? ఇళయదళపతి విజయ్ ఇలా అడుగుతున్నట్లుంది కదూ! ఇంతకీ ఈ గెటప్ ఏ చిత్రం కోసం? అనే ఆసక్తి కలిగే అవకాశం లేకపోలేదు. మెర్శల్ చిత్రంతో కలెక్షన్లను కుమ్మేసిన విజయ్ తదుపరి చిత్రానికి రెడీ అయిపోయారు. ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో తన 62వ చిత్రాన్ని చేయడానికి రంగం సిద్ధమైంది.ఈ చిత్రానికి సంబంధించిన పలు విశేషాలను చిత్ర వర్గాలు వెల్లడించారు. తుపాకీ, కత్తి చిత్రాల తరువాత విజయ్‌ఏఆర్.మురుగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్ సంస్థ నిర్మించనుంది. విశేషం ఏమిటంటే ఎందిరన్ వంటి బ్రహ్మాండ చిత్రం తరువాత ఈ సంస్థ చాలా గ్యాప్ తీసుకుని మళ్లీ విజయ్ చిత్రంతో రీఎంట్రీ అవుతోంది.ఈ చిత్రానికి సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. కాగా మెర్శల్ చిత్రం తరువాత సంగీత మాత్రికుడు ఏఆర్.రెహ్మాన్ విజయ్‌తో కలిసి ఈ చిత్రానికి పనిచేయనున్నారు. జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహించనున్నారు.
గిరీష్ గంగాధరన్ ఛాయాగ్రహణం అందించనున్నారు. ఇకపోతే ఈ చిత్రంలో నటి రకుల్ ప్రీత్‌సింగ్ నాయకిగా నటించనున్నట్లు ప్రచారంలో ఉంది. అయితే చిత్ర యూనిట్ ఆ అవకాశాన్ని కీర్తీసురేశ్‌కే అందించారు. అవును విజయ్ 62వ చిత్రంలో కీర్తీసురేశ్ కథానాయకిగా నటించనున్నారని నిర్మాతల వర్గం అధికారికంగా ప్రకటించారు. భైరవ చిత్రం తరువాత విజయ్‌తో కీర్తి రెండవ సారి రొమాన్స్ చేయనున్నారన్న మాట. ఈ చిత్రం ఫిబ్రవరిలో సెట్ పైకి వెళ్లనుందని సమాచారం. ఈ చిత్రంలో హీరో గెటప్ కోసం మంగళవారం స్థానిక సాలిగ్రామంలోని ఏవీఎం.స్టూడియోలో ఫొటో షూట్ నిర్వహించారు. అందులో షూటు బూటూ, చేతిలో షూట్‌కేస్ పక్కన ఖరీదైన కారుతో స్టైలిష్‌గా విజయ్‌ను వివిధ బంగిమల్లో షూట్ చేశారు. ఈ అదిరిపోయే విజయ్ గెటప్ స్టిల్స్ సోషల్ మీడియాల్లో వైరల్ అవుతున్నాయి.ఇవి చూసి విజయ్ అభిమానులు తెగ ఖుషీ అయిపోతున్నారు. ఇక విజయ్, ఏఆర్.మురుగదాస్, ఏఆర్.రెహ్మాన్, సన్ పిక్చర్స్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీ స్థాయికే చేరుకున్నాయి.