
రజనీకాంత్
తమిళసినిమా: చెన్నై హైకోర్టులో నటుడు రజనీకాంత్‌పై జరుగుతున్న కేసు విచారణను ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేశారు. వివరాలు.. చెన్నై షావుకార్ పేటకు చెందిన సినీ ఫైనాన్షియర్ బోద్రాకు నటుడు ధనుష్ తండ్రి, దర్శకుడు కస్తూరిరాజా ఇచ్చిన చెక్కు బౌన్స్ అయ్యింది. దీనిపై బోద్రా నటుడు రజనీకాంత్‌పై చెన్నై జార్జ్‌టౌన్ నేర విభాగ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను రజనీకాంత్ పూచీకత్తు మీదే కస్తూరిరాజాకు రుణం ఇచ్చానని, అయితే కస్తూరిరాజా తనకు ఇచ్చిన చెక్కు బౌన్స్ కావడంతో పూచికత్తుగా నిలిచిన రజనీకాంత్‌పై జార్జ్‌టౌన్ నేర విభాగం కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. దీంతో తన పేరుకు కళంకం ఆపాదించడానికే బోద్రా కోర్టుకు వెళ్లారని రజనీకాంత్ ఆరోపించారు.
జార్జ్‌టౌన్ కోర్టులో ఈ కేసు విచారణకు బోద్రా హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి కేసును కొట్టివేశారు. దీంతో బోద్రా చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారణకు స్వీకరించిన హైకోర్టు న్యాయమూర్తి ఎంవీ.మురళీధరన్ నటుడు రజనీకాంత్‌కు బదులు పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. ఈ కేసు సోమవారం విచారణకు వచ్చింది. రజనీ న్యాయవాది తన వాదనను వినిపిస్తూ పిటిషన్‌దారుడు కావాలనే రజనీకాంత్‌పై పిటిషన్ దాఖలు చేశారని, పత్రికలకెక్కి ఆయన పేరుకు కళంకం తీసుకొస్తున్నారన్నారు. బోద్రా తరఫు న్యాయవాది దీన్ని వ్యతిరేకిస్తూ తన వాదనలను వినిపించారు. ఇరు వాదనలు విన్న న్యాయమూర్తి ఈ కేసు విచారణను ఫిబ్రవరి ఐదవ తేదీకి వాయిదా వేస్తూ ఆ రోజున రజనీకాంత్ తరఫున బదులు పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించారు.