
ఈ ఏడాది ధోని దుమ్ము దులిపేశాడు..
మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి 2017 అచ్చొచ్చిన ఏడాదిగా నిలిచింది.
సాక్షి, హైదరాబాద్: టీమిండియా సీనియర్ ప్లేయర్, మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి 2017 అచ్చొచ్చిన ఏడాదిగా నిలిచింది. వన్డే కెరీర్‌లో ధోని ఈ ఏడాది అత్యున్నత రికార్డులు నమోదు చేశాడు. బ్యాటింగ్ లో 79 సగటుతో చెలరేగిన ధోని, అరుదైన ప్రపంచ రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో 300వ అంతర్జాతీయ మ్యాచ్, అత్యధిక నాటౌట్‌లు, అత్యధిక స్టంప్ అవుట్‌లు చేసిన వికెట్ కీపర్‌గా రికార్డులను నమోదు చేశాడు. ఇక ఈ ఏడాది 20 మ్యాచ్‌లు ఆడిన మిస్టర్ కూల్ ఐదు అర్ధ సెంచరీలు, ఒక సెంచరీతో 632 పరుగులు చేశాడు. 2019 ప్రపంచకప్ వరకు ధోని కొనసాగడం కష్టమన్న విమర్శకుల వ్యాఖ్యలను తన ఆటతోనే తిప్పికొట్టాడు.
అద్భుత ప్రదర్శనతో టీమిండియా డ్రెస్సింగ్ రూం ఆభరణంలా నిలిచాడు. ఇక కొల్‌కతా వేదికగా జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ మాక్స్‌వెల్‌ను రెప్పపాటులో స్టంప్‌అవుట్ చేసి కీపింగ్‌లో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించాడు. ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో టాప్ ఆర్డర్ విఫలమవ్వగా బ్యాటింగ్ బాధ్యతను తనపై వేసుకొని యువ ఆటగాళ్లతో ఇన్నింగ్స్ నిర్మించిన గెలిపించిన విషయం తెలిసిందే. ఇక శ్రీలంక పర్యటనలో రెండో వన్డేలో టేలెండర్ భువనేశ్వర్‌తో మ్యాచ్ ను గట్టెక్కించి ప్రశంసలు అందుకున్నాడు. 2019 ప్రపంచకప్ ముందు ఎంఎస్ సరిగ్గా 39 వన్డే మ్యాచ్‌లాడనున్నాడు. ప్రతీ మ్యాచ్‌లో రాణిస్తూ మరో ప్రపంచకప్ అందించాలని ధోని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.