
ఒక్కడు... ఒకే రోజు 393 పరుగులు
హెచ్‌సీఏ లీగ్స్‌లో రేవంత్ సాయి సంచలన బ్యాటింగ్
హైదరాబాద్: సెంచరీ కాదు, డబుల్ సెంచరీ కాదు... ఒక్క రోజులో ఒక బ్యాట్స్‌మన్ దాదాపు 400 పరుగులు చేయడం అసాధారణ విషయం. పిచ్ ఎలాంటిదైనా, ఎంత బలహీన బౌలింగ్ అయినా ఇది అద్భుతం కిందే లెక్క. దానిని సుసాధ్యం చేసి చూపించాడు హైదరాబాద్ క్రికెటర్ రేవంత్ సాయి. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) 2 రోజుల లీగ్ పోటీల్లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో భారీ ట్రిపుల్ సెంచరీ చేసిన అతను త్రుటిలో ‘క్వాడ్రాపుల్ సెంచరీ’ కోల్పోయాడు.
పీ అండ్ టీ కాలనీ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో విశాక జట్టు తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన 25 ఏళ్ల రేవంత్ సాయి రెచ్చిపోయాడు. 336 బంతుల్లో ఏకంగా 393 పరుగులు సాధిం చాడు. ఇందులో 44 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. హెచ్‌సీఏ లీగ్స్ లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కాగా, దానిని ఒకే రోజు చేసిన రికార్డును సాయి సొంతం చేసుకున్నాడు. దాదాపు ఐదున్నర గంటల పాటు క్రీజ్‌లో గడిపిన అతను 236 పరుగులు బౌండరీల ద్వారానే రాబట్టడం విశేషం. చివరకు మరో భారీ షాట్‌కు ప్రయత్నించి డీప్ కవర్స్‌లో క్యాచ్ ఇవ్వడంతో నాలుగొందలు పరుగుల మైలురాయి చేజారింది. రేవంత్ అద్భుత ప్రదర్శనతో విశాక జట్టు తొలి రోజు 88.4 ఓవర్లలో 5 వికెట్లకు 664 పరుగులు చేసి డిక్లేర్ చేసింది.