డివిలియర్స్ ‘వంద’నం
సెంచరీ టెస్టు ఆడనున్న దక్షిణాఫ్రికా క్రికెటర్
బెంగళూరు: దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ అబ్రహాం డివిలియర్స్ కెరీర్‌లో అరుదైన మైలురాయిని చేరుకోనున్నాడు. శనివారంనుంచి భారత్‌తో జరిగే రెండో టెస్టు మ్యాచ్ అతనికి 100వది కానుంది. దక్షిణాఫ్రికా తరఫున ఈ ఘనత సాధించనున్న ఏడో ఆటగాడు అతను. ప్రధానంగా పరిమిత ఓవర్లలో విధ్వంసక ఆటగాడిగా గుర్తింపు ఉన్నా... టెస్టు క్రికెట్‌లోనూ డివిలియర్స్ ఖాతాలో అనేక గొప్ప ఇన్నింగ్స్‌లు ఉన్నాయి. కెరీర్ తొలి టెస్టునుంచి వరుసగా 98 మ్యాచ్‌లు ఆడిన ఏబీ, విరామం లేకుండా వంద మ్యాచ్‌లు ఆడిన రికార్డు సృష్టించేవాడు. అయితే ఇటీవల వ్యక్తిగత కారణాలతో బంగ్లాదేశ్ సిరీస్‌కు దూరం కావడంతో అతనికి ఈ ఘనత దక్కలేదు. టెస్టుల్లో నంబర్‌వన్ బ్యాట్స్‌మన్‌గా వందవ మ్యాచ్ ఆడుతున్న ఏడో ఆటగాడు డివిలియర్స్ కావడం విశేషం. డివిలియర్స్ 99 టెస్టుల్లో 51.92 సగటుతో 7685 పరుగులు చేశాడు. ఇందులో 21 సెంచరీలు, 37 అర్ధసెంచరీలు ఉన్నాయి. 278నాటౌట్ (పాకిస్తాన్) డివిలియర్స్ అత్యధిక స్కోరు.
ఏ పిచ్‌కైనా సిద్ధం: ఏబీ
సొంతగడ్డపై భారత్ ఎలాంటి పిచ్‌లు తయారు చేసుకున్నా అది తప్పు కాదని, తమ జట్టు అన్నింటికీ సిద్ధమై వచ్చిందని దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ డివిలియర్స్ వ్యాఖ్యానించాడు. ‘చిన్నస్వామి పిచ్ టర్న్ అవుతుందని మాకు బాగా తెలుసు. వాండరర్స్ వికెట్‌లా ఎలాగూ ఉండదు. సొంత జట్టు ఎలా తయారు చేసుకున్నా ఎదురుదాడి చేయగల బ్యాట్స్‌మెన్ మా వద్ద ఉన్నారు. తొలి టెస్టులో కూడా మేం బాగానే ఆడినా ఎక్కువ సేపు దానిని కొనసాగించలేకపోయాం. ఈ మ్యాచ్‌లో పరిస్థితి మారుతుందని నమ్ముతున్నా. జట్టు ప్రధాన బ్యాట్స్‌మెన్‌గా ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించాల్సిన బాధ్యత నాపై కూడా ఉంది’ అని డివిలియర్స్ అన్నాడు.
ఫిలాండర్ అవుట్
తొలి టెస్టుకు ముందే మోర్కెల్‌కు గాయం...టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో స్టెయిన్ బౌలింగ్‌కు దూరం...ఈ దెబ్బలతో ఇప్పటికే బలహీనపడిన దక్షిణాఫ్రికా పేస్ బలగానికి కొత్త సమస్య ఎదురైంది. మూడో ప్రధాన పేసర్ వెర్నాన్ ఫిలాండర్ సరదాగా ఆడిన ఫుట్‌బాల్ అతడిని టెస్టు సిరీస్‌కు దూరం చేసింది. ఎడమ కాలి మడమకు గాయమైన ఫిలాండర్ స్వదేశం తిరిగి పయనమవుతున్నాడు. గురువారం ప్రాక్టీస్ సందర్భంగా సఫారీ ఆటగాళ్లంతా ఫుట్‌బాల్ ఆడారు. సహచరుడు ఎల్గర్‌ను ఢీకొనడంతో ఫిలాండర్ పడిపోయాడు. అతడిని సహాయక సిబ్బంది మోసుకుపోవాల్సి వచ్చింది. ఎంఆర్‌ఐ స్కాన్‌లో గాయం నిర్ధారణ కావడంతో అతడికి కనీసం ఎనిమిది వారాల విశ్రాంతి అవసరమని డాక్టర్లు తేల్చారు. అతని స్థానంలో దక్షిణాఫ్రికా కైల్ అబాట్‌ను ఎంపిక చేసింది. అబాట్ చివరిసారిగా గత ఏడాది డిసెంబర్‌లో టెస్టు మ్యాచ్ ఆడాడు.
స్టెయిన్ కోలుకుంటాడా!
పిచ్ ఏదైనా తమ పేస్‌ను నమ్ముకొన్న దక్షిణాఫ్రికా జట్టులో ఇప్పుడు రబడ ఒక్కడే పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. తొలి మ్యాచ్ ఆడని మోర్కెల్ కోలుకుం టున్నాడు. అయితే మొహాలీ టెస్టులో గాయపడిన స్టెయిన్ ఫిట్‌నెస్‌పై ఇంకా సందేహాలు ఉన్నాయి. మ్యాచ్‌కు ముందు రోజు శుక్రవారం ఫిట్‌నెస్ టెస్ట్ తర్వాతే అతను బరిలోకి దిగుతాడా లేదా అనేది తెలుస్తుంది. ఇప్పటికే తొలి టెస్టు కోల్పోయిన దక్షిణాఫ్రికాకు మరో ప్రధాన ఆటగాడు డుమిని కోలుకోవడం ఊరటనిచ్చే అంశం.