అబొజర్‌కు తెలుగు టైటాన్స్‌ పగ్గాలు | Abozar Mighani to captain Telugu Titans | Sakshi
Sakshi News home page

అబొజర్‌కు తెలుగు టైటాన్స్‌ పగ్గాలు

Published Thu, Jul 18 2019 1:58 AM | Last Updated on Thu, Jul 18 2019 1:58 AM

Abozar Mighani to captain Telugu Titans - Sakshi

అబొజర్‌ మిఘాని

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు టైటాన్స్‌ కబడ్డీ జట్టు కెప్టెన్‌గా ఇరాన్‌ డిఫెండర్‌ అబొజర్‌ మిఘానిని ఫ్రాంచైజీ యాజమాన్యం నియమించింది. ఈ నెల 20 నుంచి ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) ఏడో సీజన్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో జట్లన్నీ సన్నాహాల్లో నిమగ్నమయ్యాయి. తొలి అంచె పోటీలు ముందుగా హైదరాబాద్‌లోనే జరుగనున్నాయి. ఈ సందర్భంగా గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో తెలుగు టైటాన్స్‌ యాజమాన్యం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొత్త సారథిని అధికారికంగా ప్రకటించారు.

స్టార్‌ ఆటగాడు రాహుల్‌ చౌదరి లేకపోయినా జట్టుకు ఢోకా లేదని జట్టు యజమాని శ్రీనివాస్‌ శ్రీరామనేని తెలిపారు. గతేడాది నిరాశపరిచిన తమ జట్టు ఈ సారి టైటిల్‌పై గురిపెట్టిందని ఆయన చెప్పారు. ఆరంభం నుంచే ఫలితాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తామన్నారు. హైదరాబాద్‌లో మొదలయ్యే ఈ పోటీలు వివిధ నగరాల్లో సుమారు మూడు నెలల పాటు జరుగుతాయి. అక్టోబర్‌ 19న గ్రేటర్‌ నోయిడాలో జరిగే ఫైనల్‌తో ఏడో సీజన్‌ ముగుస్తుంది.  

ఆన్‌లైన్‌లో టికెట్లు....
హైదరాబాద్‌ అంచె ప్రొ కబడ్డీ లీగ్‌ మ్యాచ్‌ల టికెట్లు https://www. eventsnow.com వెబ్‌సైట్‌లో లభిస్తాయి. టికెట్ల ధరలను రూ. 500; రూ.800; రూ. 3000గా నిర్ణయించారు. మరో రెండు ఫ్రాంచైజీలు కూడా కొత్త కెప్టెన్లను ప్రకటించాయి. యు ముంబా కూడా ఇరానీ ప్లేయర్‌ ఫజల్‌ని సారథిగా నియమించగా, పుణేరి పల్టన్‌ జట్టు సుర్జీత్‌ సింగ్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement