Pro Kabaddi League tournament
-
ఉత్కంఠ పోరులో తెలుగు టైటాన్స్ ఓటమి..
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ తొలి ఓటమి చవిచూసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 33–34తో పుణేరి పల్టన్ చేతిలో ఓడింది. స్టార్ రెయిడర్ సిద్ధార్థ్ దేశాయ్ 15 పాయింట్లతో మెరిసినా ఫలితం లేకపోయింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి టైటాన్స్ 20–14తో ఆధిక్యంలో నిలిచింది. అయితే పుణేరి పల్టన్ వరుస రెయిడ్ పాయింట్లతో పాటు టైటాన్స్ ప్లేయర్లను పట్టేయడంతో మ్యాచ్‌లోకి దూసుకొచ్చింది. స్కోరు 33–33తో సమంగా ఉన్న సమయంలో కూతకు వెళ్లిన మోహిత్ పుణేరి పల్టన్‌కు పాయింట్ తీసుకొచ్చాడు. ఆ తర్వాత మ్యాచ్ చివరి రెయిడ్‌కు వెళ్లిన అంకిత్ (టైటాన్స్) ఒట్టి చేతులతో రావడంతో పాయింట్ తేడాతో పుణేరి పల్టన్ విజయం సాధించింది. ఇతర మ్యాచ్‌ల్లో యూపీ యోధ 36–35తో పట్నా పైరేట్స్‌పై, జైపూర్ పింక్ పాంథర్స్ 40–38తో హరియాణా స్టీలర్స్‌పై నెగ్గాయి. చదవండి: India vs South africa: దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ సాధించిన రికార్డులు ఇవే.. -
Pro Kabaddi League 2021: కబడ్డీ కూతకు వేళాయె...
Pro Kabaddi 2021 Schedule And Venue: కూత పెట్టేందుకు ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ముస్తాబైంది. నేటి నుంచి ఎనిమిదో సీజన్ జరగనుంది. ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్ మ్యాచ్‌లన్నీ బెంగళూరు వేదికపైనే జరుగనున్నాయి. కోవిడ్ మహమ్మారి వల్ల గతేడాది టోర్నీ రద్దు కావడంతో ఈ సీజన్‌ను పకడ్బందీగా బయో బబుల్‌లో నిర్వహిస్తున్నారు. మొత్తం 12 జట్లు ఇది వరకే బయో బబుల్‌లో ఉన్నాయి. మాజీ చాంపియన్లు యు ముంబా, బెంగళూరు బుల్స్ల మధ్య బుధవారం జరిగే తొలి మ్యాచ్‌తో పీకేఎల్–8 మొదలవుతుంది. ఈ మ్యాచ్ ముగియగానే తెలుగు టైటాన్స్, తమిళ్ తలైవాస్ మధ్య రెండో మ్యాచ్ జరుగుతుంది. అనంతరం మూడో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్ వారియర్స్‌తో యూపీ యోధ తలపడుతుంది. ఈ సీజన్లో తొలి నాలుగు రోజులు మూడు మ్యాచ్‌ల చొప్పున నిర్వహిస్తున్నారు. ప్రతి శనివారం కూడా మూడేసి మ్యాచ్‌లుంటాయి. లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాక టాప్–6లో ఉన్న జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత పొందుతాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న ఫైనల్‌తో ఎనిమిదో సీజన్ ముగుస్తుంది. తొలి రెండు మ్యాచ్‌లు వరుసగా రాత్రి గం. 7:30 నుంచి... గం. 8:30 నుంచి మొదలవుతాయి. మూడో మ్యాచ్‌లను రాత్రి గం. 9:30 నుంచి నిర్వహిస్తారు. మ్యాచ్‌లన్నీ స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో ప్రసారమవుతాయి. పీకేఎల్‌లో మ్యాచ్ గెలిచిన జట్టుకు ఐదు పాయింట్లు లభిస్తాయి. ‘టై’ అయితే రెండు జట్ల ఖాతాలో మూడు పాయింట్లు చొప్పున చేరుతాయి. ఏడు లేదా అంతకంటే తక్కువ పాయింట్ల తేడాతో ఓడిన జట్టుకు ఒక పాయింట్ ఇస్తారు. ఏడు పాయింట్ల కంటే ఎక్కువ తేడాతో ఓడిన జట్టుకు పాయింట్లేమీ రావు. పీకేఎల్ బరిలో ఉన్న జట్లు బెంగళూరు బుల్స్, జైపూర్ పింక్ పాంథర్స్, పుణేరి పల్టన్, పట్నా పైరేట్స్, యు ముంబా, తెలుగు టైటాన్స్, బెంగాల్ వారియర్స్, దబంగ్ ఢిల్లీ, గుజరాత్ జెయింట్స్, హరియాణా స్టీలర్స్, తమిళ్ తలైవాస్, యూపీ యోధ. -
అబొజర్‌కు తెలుగు టైటాన్స్ పగ్గాలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు టైటాన్స్ కబడ్డీ జట్టు కెప్టెన్‌గా ఇరాన్ డిఫెండర్ అబొజర్ మిఘానిని ఫ్రాంచైజీ యాజమాన్యం నియమించింది. ఈ నెల 20 నుంచి ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఏడో సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో జట్లన్నీ సన్నాహాల్లో నిమగ్నమయ్యాయి. తొలి అంచె పోటీలు ముందుగా హైదరాబాద్‌లోనే జరుగనున్నాయి. ఈ సందర్భంగా గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో తెలుగు టైటాన్స్ యాజమాన్యం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొత్త సారథిని అధికారికంగా ప్రకటించారు. స్టార్ ఆటగాడు రాహుల్ చౌదరి లేకపోయినా జట్టుకు ఢోకా లేదని జట్టు యజమాని శ్రీనివాస్ శ్రీరామనేని తెలిపారు. గతేడాది నిరాశపరిచిన తమ జట్టు ఈ సారి టైటిల్‌పై గురిపెట్టిందని ఆయన చెప్పారు. ఆరంభం నుంచే ఫలితాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తామన్నారు. హైదరాబాద్‌లో మొదలయ్యే ఈ పోటీలు వివిధ నగరాల్లో సుమారు మూడు నెలల పాటు జరుగుతాయి. అక్టోబర్ 19న గ్రేటర్ నోయిడాలో జరిగే ఫైనల్‌తో ఏడో సీజన్ ముగుస్తుంది. ఆన్లైన్లో టికెట్లు.... హైదరాబాద్ అంచె ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచ్‌ల టికెట్లు https://www. eventsnow.com వెబ్సైట్లో లభిస్తాయి. టికెట్ల ధరలను రూ. 500; రూ.800; రూ. 3000గా నిర్ణయించారు. మరో రెండు ఫ్రాంచైజీలు కూడా కొత్త కెప్టెన్లను ప్రకటించాయి. యు ముంబా కూడా ఇరానీ ప్లేయర్ ఫజల్‌ని సారథిగా నియమించగా, పుణేరి పల్టన్ జట్టు సుర్జీత్ సింగ్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. -
సిద్ధార్థ్ దేశాయ్‌కు రూ.1.45 కోట్లు
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ –7 కోసం జరిగిన వేలంలో 27 ఏళ్ల సిద్ధార్థ్ శిరీష్ దేశాయ్ పంట పండింది. సోమవారం ఇక్కడ జరిగిన వేలంలో తెలుగు టైటాన్స్ జట్టు సిద్ధార్థ్‌ను రూ. 1 కోటి 45 లక్షలకు సొంతం చేసుకుంది. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన సిద్ధార్థ్ గత సీజన్లో యు ముంబాకు ప్రాతినిధ్యం వహించాడు. ఆరో సీజన్లో అతను అత్యధిక పాయింట్ల జాబితాలో మూడో స్థానంలో (221 పాయింట్లు) నిలిచాడు. వేలంలో కోటి రూపాయలు దాటిన జాబితాలో రెండో ఆటగాడిగా నితిన్ తోమర్ నిలిచాడు. పుణేరీ పల్టన్ రూ. 1.20 కోట్లు చెల్లించి ‘ఫైనల్ బిడ్ మ్యాచ్’ ద్వారా తోమర్‌ను రిటైన్ చేసుకుంది. వేలంలో జరిగిన ప్రధాన మార్పులలో హర్యానా స్టీలర్స్ టాప్ రైడర్ మోను గోయత్... యూపీ యోధ (రూ. 93 లక్షలు)కు తరలి వెళ్లగా... ప్రొ కబడ్డీ లీగ్ ప్రారంభమమైన నాటినుంచి తెలుగు టైటాన్స్‌తోనే ఉన్న స్టార్ ఆటగాడు రాహుల్ చౌదరి ఈ సారి తమిళ్ తలైవాస్ (రూ. 94 లక్షలు)కు మారాడు. మరో ఆటగాడు సందీప్ నర్వాల్‌ను యు ముంబా (రూ. 89 లక్షలు) దక్కించుకుంది. విదేశీ ఆటగాళ్లలో ఇరాన్‌కు చెందిన మొహమ్మద్ ఇస్మాయిల్ నబీ బ„Š కు అత్యధిక మొత్తం దక్కింది. బెంగాల్ వారియర్స్ రూ. 77.75 లక్షలకు ఇస్మాయిల్‌ను తీసుకుంది. ఇరాన్‌కే చెందిన అబోజర్ మొహజల్ మిగానికి రూ. 75 లక్షలు చెల్లించి తెలుగు టైటాన్స్ అట్టిపెట్టుకోవడం విశేషం. విదేశీ ఆటగాళ్లలో జంగ్ కున్ లి (పట్నా– రూ. 40 లక్షలు), మొహమ్మద్ ఇస్మాయిల్ మగ్సూదు (పట్నా – రూ. 35 లక్షలు), డాంగ్ గియోన్ లీ (యు ముంబా – రూ. 25 లక్షలు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. తెలుగు టైటాన్స్ అబోజర్‌తో పాటు విశాల్ భరద్వాజ్‌ను కొనసాగించింది. జూలై 19నుంచి టోర్నీ ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్ జూలై 19 నుంచి అక్టోబర్ 9 వరకు జరుగుతుంది. గత సీజన్లో ప్రేక్షకాదరణ తగ్గడంతో మళ్లీ పాత షెడ్యూలునే ఖారారు చేశారు. ఆరో సీజన్ చాలా ఆలస్యంగా అక్టోబర్‌లో ప్రారంభించారు. అయితే ఆ సమయంలో వరుసగా పెద్ద పండగలు ఉండటంతో వీక్షకుల శాతం తగ్గింది. దీంతో ఏడో సీజన్‌ను గతంలోలాగే జూలైలోనే మొదలుపెట్టి ఫెస్టివల్స్‌కు ముందే ముగిస్తామని లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి తెలిపారు. -
పట్నా పైరేట్స్ విజయం
పట్నా: ప్రొ కబడ్డీ లీగ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన పట్నా పైరేట్స్ మూడో విజయం సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో పట్నా 41–30తో జైపూర్ పింక్ పాంథర్స్‌పై గెలిచింది. కెప్టెన్ ప్రదీప్ నర్వాల్ 11, మన్జీత్ 10 రైడ్ పాయింట్లతో రాణించగా... ట్యాక్లింగ్‌లో వికాస్ కాలె (5 పాయింట్లు) సత్తా చాటడంతో పట్నా పైరేట్స్ సునాయాసంగా గెలుపొందింది. జైపూర్ పింక్ పాంథర్స్ తరఫున దీపక్ 7 రైడ్ పాయింట్లు సాధించగా... ట్యాక్లింగ్‌లో సునీల్ (3 పాయింట్లు) ఆకట్టుకున్నాడు. మరో మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 36–25తో తమిళ్ తలైవాస్‌పై గెలిచింది. నేటి మ్యాచ్‌ల్లో జైపూర్ పింక్ పాంథర్స్‌తో బెంగాల్ వారియర్స్, పట్నా పైరేట్స్‌తో యు ముంబా తలపడనున్నాయి. -
వచ్చే నెల 7 నుంచి ప్రొ కబడ్డీ లీగ్
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఆరో సీజన్ ముందనుకున్న షెడ్యూల్ కంటే రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుంది. వచ్చే నెల 5న ఆరంభం కావాల్సిన ఈ లీగ్ 7వ తేదీకి మారింది. మూడు నెలలపాటు సుదీర్ఘంగా జరిగే ఈ లీగ్ ఏర్పాట్లలో తలెత్తిన సమస్యల వల్ల రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభిస్తున్నట్లు టోర్నీ నిర్వాహక సంస్థ మషాల్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తెలిపింది. ఫైనల్ పోరు వచ్చే ఏడాది జనవరి 5న ముంబైలో జరుగుతుంది. మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. -
రిషాంక్ రికార్డు రైడింగ్
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్‌లో యూపీ యోధా జట్టు ప్లే ఆఫ్ అవకాశాలు మరింత మెరుగయ్యాయి. గురువారం జరిగిన మ్యాచ్‌లో రిషాంక్ దేవడిగ (28 పాయింట్లు) అద్భుత ప్రదర్శనతో యూపీ యోధా జట్టు 53–32తో జైపూర్ పింక్ పాంథర్స్‌పై ఘనవిజయాన్ని సాధించింది. రిషాంక్ ఒక్కడే 28 పాయింట్లు సాధించి ప్రొ కబడ్డీ లీగ్ చరిత్రలోనే ఒకే మ్యాచ్‌లో అత్యధిక పాయింట్లు సాధించిన క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. 27 సార్లు రైడ్‌కు వెళ్లిన రిషాంక్ 28 పాయింట్లు సాధించి జట్టును గెలిపించాడు. ట్యాకిల్‌లో గుర్విందర్ సింగ్ 3 పాయింట్లు స్కోర్ చేశాడు. ఇప్పటి వరకు టోర్నీలో మొత్తం 20 మ్యాచ్‌లాడిన యూపీ జట్టు 8 విజయాలు సాధించి జోన్ ‘బి’లో 59 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. పింక్ పాంథర్స్ 21 మ్యాచ్‌లాడి 8 విజ యాలతో 51 పాయింట్లతో జోన్ ‘ఎ’లో ఐదో స్థానంలోఉంది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో పుణేరి పల్టన్‌తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్, బెంగాల్ వారియర్స్‌తో తమిళ్ తలైవాస్ జట్లు తలపడతాయి. -
ఢిల్లీపై బెంగళూరు బుల్స్ పైచేయి
జైపూర్: రైడింగ్‌లో ఆకట్టుకున్న బెంగళూరు బుల్స్ జట్టు ప్రొ కబడ్డీ లీగ్‌లో ఆరో విజయాన్ని సాధిం చింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో 35–32తో దబాంగ్ ఢిల్లీ జట్టుపై నెగ్గి ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా నిలబెట్టుకుంది. మ్యాచ్ ఆరంభం నుంచే ఆధిక్యాన్ని ప్రదర్శించిన బుల్స్ చివరివరకు దాన్ని కొనసాగించింది. బెంగళూరు జట్టు 23 రైడ్, 7 ట్యాకిల్ పాయింట్లతో అదరగొట్టింది. ఇరుజట్లు చెరో రెండు సార్లు ఆలౌటయ్యాయి. బుల్స్ జట్టులో రోహిత్ కుమార్ 12 పాయింట్లు, అజయ్ 10 పాయింట్లతో ఆకట్టుకున్నారు. ఢిల్లీ తరఫున రోహిత్ 17 సార్లు రైడింగ్‌కు వెళ్లి 11 పాయింట్లు సాధించాడు. ట్యాకిల్‌లో స్వప్ని ల్ 3 పాయింట్లతో రాణించాడు. మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 37–27తో జైపూర్ పింక్ పాంథర్స్‌పై గెలుపొందింది. నేడు జరిగే మ్యాచ్‌లో జైపూర్‌తో యూపీ యోధ ఆడుతుంది. -
బెంగాల్ వారియర్స్ హ్యాట్రిక్
కోల్‌కతా: ప్రొ కబడ్డీ లీగ్ టోర్నీమెంట్లో బెంగాల్ వారియర్స్ దూసుకెళుతోంది. సొంత వేదికపై ఆదివారం పుణేరి పల్టన్‌తో జరిగిన మ్యాచ్‌లో 33-28 తేడాతో నెగ్గి వరుసగా మూడు విజయాలను ఖాతాలో వేసుకుంది. నితిన్ తోమర్ దుమ్ము రేపే ఆటతీరుతో 11 పాయింట్లు సాధించి విజయంలో కీలక పాత్ర పోషించాడు. మహేశ్ గౌడ్ నాలుగు పాయింట్లు సాధించాడు. పుణేరి పల్టన్‌లో కెప్టెన్ మంజీత్ చిల్లార్ తన ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆరు రైడ్ పాయింట్లు.. ఏడు టాకిల్ పాయింట్లు సాధించినా ఫలితం లేకపోయింది. తొలి అర్ధభాగంలో 10-11తో కాస్త వెనుకబడినా అనంతరం బెంగాల్ పైచేయి సాధించింది. మరో మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీ గట్టి పోటీనిచ్చినప్పటికీ చివరికి జైపూర్ పింక్‌పాంథర్స్ 39-34 తేడాతో గట్టెక్కింది. సోమవారం జరిగే మ్యాచ్‌ల్లో పట్నా పైరేట్స్‌తో తెలుగు టైటాన్స్; బెంగాల్ వారియర్స్‌తో ఢిల్లీ దబంగ్ జట్టు తలపడతాయి.