ప్రధాని మోదీ సాయం కోరిన పాక్ మాజీ క్రికెటర్
కరాచీ: పాకిస్థాన్ మాజీ క్రికెటర్, ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది భారత ప్రధాని నరేంద్రమోదీని సాయం కోరారు. అసోంలో తన అభిమానిని పోలీసులు అకారణంగా నిర్బంధించారని, అతడిపై భారత శిక్షా స్మృతిప్రకారం పలు కేసులు పెట్టి జైలులో వేశారని, దయచేసి అతడిని విడిపించాలంటూ కోరారు. ఆయన విన్నపం ప్రకారం రిపాన్ చౌదరీ అనే వ్యక్తి అఫ్రిదిపై ఉన్న అభిమానంతో అతడి జెర్సీని వేసుకున్నాడు. అది చూసిన కొంతమంది బీజేపీ యువ విభాగానికి చెందిన వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్టు చేసి ఐపీసీ 120(బీ), 294 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఈ విషయం తెలుసుకున్న అఫ్రిది ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. భారత్ దేశంలో పాక్ క్రికెటర్లకు అభిమానులు ఉన్నారని, అలాగే, పాక్ లో భారత క్రికెటర్లకు అభిమానులు ఉన్నారని, అంతమాత్రాన వారిని అరెస్టులు చేయడం సరికాదని అన్నారు. రెండు దేశాల్లో వారిని కేవలం క్రికెట్ అభిమానులుగా మాత్రమే చూడాలని కోరారు. అసహనాన్ని పెంచే ఇలాంటి చర్యలను ఏమాత్రం అంగీకరించకూడదని, అది ఎవరైనా సరే ఖండించాల్సిందేనని చెప్పారు.
ఈ విషయంలో మోదీ కలగజేసుకొని న్యాయం చేస్తారని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. గతంలో పాక్‌లో కూడా భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ అభిమాని ఒకరు తన ఇంటిపై భారత జాతీయ పతాకం ఎగురవేసినందుకు అక్కడ పదేళ్ల శిక్షకు గురైన విషయం తెలిసిందే. అనంతరం అతడు బెయిల్‌పై విడుదలయ్యాడు.