ఫుట్‌బాల్‌కు ఆదరణ పెరుగుతోంది
అక్కినేని అఖిల్ వ్యాఖ్య
హైదరాబాద్ ఫుట్‌బాల్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్ యువ హీరో
సాక్షి, హైదరాబాద్: క్రికెట్‌కు ఉన్న అమితాదరణ కారణంగా మన వద్ద ఫుట్‌బాల్‌కు తగిన గుర్తింపు దక్కలేదని, అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితిలో మార్పు వస్తోందని టాలీవుడ్ హీరో అక్కినేని అఖిల్ అభిప్రాయపడ్డాడు. పెద్ద సంఖ్యలో టోర్నీలు రావడంతో పాటు కార్పొరేట్‌లు కూడా ముందుకు వస్తుండటంతో ఫుట్‌బాల్‌కు మంచి ప్రాచుర్యం లభిస్తోందని అతను అన్నాడు. నవంబర్ 25 నుంచి నిర్వహించనున్న హైదరాబాద్ ఫుట్‌బాల్ లీగ్‌కు అఖిల్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు.
ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ ‘నాకు వ్యక్తిగతంగా క్రికెట్ ఇష్టమే అయినా ఇతర క్రీడలకు కూడా అండగా నిలిచేందుకు నేను ఎప్పుడైనా సిద్ధం. అదే కారణంగా ఇప్పుడు ఫుట్‌బాల్‌తో జత కట్టాను. క్రికెట్‌తో పోలిస్తే తక్కువ సమయంలో పూర్తి కావడం, సిక్స్–ఎ–సైడ్‌లాంటి ఫార్మాట్ వల్ల తక్కువ మందితోనే ఆడే అవకాశం ఉండటం వల్ల ఇప్పుడు ఫుట్‌బాల్ వేగంగా జనాల్లోకి వెళుతోంది. ఇది మంచి పరిణామం. ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టేందుకు యూ త్‌కు ఫుట్‌బాల్ క్రీడ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది’ అని అఖిల్ అభిప్రాయపడ్డాడు. వరుసగా మూడో ఏడాది నిర్వహిస్తున్న హైదరాబాద్ ఫుట్‌బాల్ లీగ్ విజయవంతం కావాలని అతను ఆకాంక్షించాడు. నగరంలోని 14 మైదానాల్లో హైదరాబాద్ ఫుట్‌బాల్ లీగ్ నవంబర్ 25 నుంచి జనవరి 27 వరకు జరుగుతుంది. 12 జట్లు బరిలోకి దిగుతున్న ఈ సిక్స్–ఎ–సైడ్ టోర్నీలో మొత్తం 135 మ్యాచ్‌లు జరుగుతాయి. విజేతకు రూ.3 లక్షల ప్రైజ్‌మనీని అందజేస్తా రు. గత రెండు సీజన్లు తమ లీగ్‌కు మంచి ఆదరణ లభించిందని, అదే ఉత్సాహంతో ఈసారి మరింత బాగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని లీగ్ చైర్మన్ మురాద్ జసాని అన్నారు. మీడియా సమావేశంలో డైరెక్టర్లు ఆదిల్ మిస్త్రీ, నవీద్ కేశ్వాని తదితరులు పాల్గొన్నారు.