అక్షత్ రెడ్డి సెంచరీ
►ఆంధ్రపై హెచ్‌సీఏ ఎలెవన్ విజయం
►రవితేజ శతకం వృథా
►మొయినుద్దౌలా గోల్డ్ కప్ టోర్నీ
హైదరాబాద్: ఆలిండియా మొయినుద్దౌలా గోల్డ్ కప్ క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ ఎలెవన్ జట్టు శుభారంభం చేసింది. మంగళవారం ఈసీఐఎల్ మైదానంలో జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో హెచ్‌సీఏ ఎలెవన్ 80 పరుగుల తేడాతో ఆంధ్ర కోల్ట్స్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హెచ్‌సీఏ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. అక్షత్ రెడ్డి (109 బంతుల్లో 113; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. తన్మయ్ అగర్వాల్ (115 బంతుల్లో 88; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా... అంబటి రాయుడు (37 బంతుల్లో 63; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చాడు. ఆంధ్ర బౌలర్లలో గిరినాథ్ రెడ్డి, వేణు చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఆంధ్ర 50 ఓవర్లలో 9 వికెట్లకు 225 పరుగులు మాత్రమే చేయగలిగింది. డీబీ రవితేజ (165 బంతుల్లో 113 నాటౌట్; 11 ఫోర్లు) శతకం సాధించినా తమ జట్టును గెలిపించడంలో విఫలమయ్యాడు. హైదరాబాద్ బౌలర్లలో మెహదీ హసన్, సీవీ మిలింద్, ఆకాశ్ భండారి, రవికిరణ్ తలా 2 వికెట్లు తీశారు.
ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
విదర్భ: 242/4 (కె. సచిన్ 75, అపూర్వ్ వాంఖెడే 63 నాటౌట్, జితేశ్ శర్మ 50); గోవా: 190/7 (స్వప్నిల్ అస్నోడ్కర్ 59, ఆదిత్య 3/42).
ఫలితం: వర్షం కారణంగా గోవా విజయ లక్ష్యాన్ని సవరించి 48 ఓవర్లలో 234 పరుగులుగా నిర్దేశించారు. 44 పరుగులతో విదర్భ విజయం
బరోడా: 289/9 (కార్తీక్ కాక్డే 51, ఖయ్యూమ్ 3/54, జి.మధు 3/59); కంబైన్డ్ డిస్ట్రిక్ట్స్ ఎలెవన్: 207/7 (సుకాంత్ 91, కరణ్ పవార్ 3/32).
ఫలితం: 82 పరుగులతో బరోడా విజయం
హెచ్‌సీఏ ప్రెసిడెంట్స్ ఎలెవన్: 231 (జావీద్ అలీ 53, రోహిత్ రెడ్డి 42, చందన్ సహాని 42, రాబిన్ కృష్ణ 3/34); కేరళ: 232/6 (ఫాబిద్ ఫరూఖ్ అహ్మద్ 89 నాటౌట్, రోహన్ కున్నుమ్మెల్ 74, ప్రణీత్ రెడ్డి 2/26, తనయ్ త్యాగరాజన్ 2/35).
ఫలితం: 4 వికెట్లతో కేరళ విజయం
రైనా బరిలోకి...
భారత ఆటగాడు సురేశ్ రైనా నేడు జరిగే మ్యాచ్‌లో ఎయిరిండియా తరఫున బరిలోకి దిగుతున్నాడు. ఈసీఐఎల్ మైదానంలో ఎయిరిండియా, కంబైన్డ్ డిస్ట్రిక్ట్స్ ఎలెవన్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతుంది.