
తిరునల్వేలి: కెప్టెన్ అక్షత్ రెడ్డి అజేయ సెంచరీ సాధించడంతో... తమిళనాడు జట్టుతో సోమవారం మొదలైన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో హైదరాబాద్ భారీ స్కోరుపై కన్నేసింది. అక్షత్ (243 బంతుల్లో 114 బ్యాటింగ్; 14 ఫోర్లు, సిక్స్)తో జతగా బావనాక సందీప్ (133 బంతుల్లో 74 బ్యాటింగ్; 10 ఫోర్లు, సిక్స్) కూడా రాణించడంతో... తొలి రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. అక్షత్, సందీప్ నాలుగో వికెట్‌కు అభేద్యమైన 136 పరుగులు జోడించారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్‌కు శుభారంభం లభించలేదు.
అక్షత్‌తో కలిసి తొలి వికెట్‌కు 13 పరుగులు జతచేశాక ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (10) ఔటయ్యాడు. అనంతరం రోహిత్ రాయుడు (54 బంతుల్లో 13; ఫోర్)తో కలిసి అక్షత్ రెండో వికెట్‌కు 41 పరుగులు... హిమాలయ్ అగర్వాల్ (93 బంతుల్లో 29; 2 ఫోర్లు)తో మూడో వికెట్‌కు 59 పరుగులు జోడించాడు. రోహిత్, హిమాలయ్ ఔటయ్యాక సందీప్ పట్టుదలగా ఆడటంతో తమిళనాడు బౌలర్లకు మరో వికెట్ లభించలేదు. రాహిల్ షా వేసిన ఇన్నింగ్స్ 83వ ఓవర్లో స్వీప్ షాట్‌తో అక్షత్ తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. తమిళనాడు బౌలర్లలో విఘ్నేశ్, మొహమ్మద్, రాహిల్ షాలకు ఒక్కో వికెట్ లభించింది.
Comments
Please login to add a commentAdd a comment