
బౌలర్ అశ్విన్ ఒక్కడే బాధ్యుడా..?
రాజ్కోట్: తొలిటెస్టులో ఆతిథ్య టీమిండియాపై ఇంగ్లండ్ పరుగుల దాహాన్ని తీర్చుకుంది. ఇంగ్లండ్ ఆటగాళ్లు జో రూట్(124), మొయిన్ అలీ(117), బెన్ స్టోక్స్(128) శతకాలతో చెలరేగడంతో 537 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో రోజు ఆట నిలిపివేసిన అనంతరం భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా మీడియాతో మాట్లాడాడు. రవిచంద్రన్ అశ్విన్కు తన పూర్తి సహకారం ఉంటుందన్నాడు. వికెట్లు తీయడం అనేది బౌలర్లు అందరి బాధ్యత అని, అంతేకానీ అశ్విన్ రాణించకపోవడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించిందన్న వ్యాఖ్యలను జడేజా ఖండించాడు.
జట్టులో ఐదుగురు బౌలర్లం ఉన్నామని, అందరం వికెట్లు తీయడంపైనే దృష్టిపెట్టినా సఫలం కాలేదన్నాడు. కొన్నిసార్లు ఏ జట్టుకైనా ఇలాంటి పరిస్థితి వస్తుందని.. ప్రస్తుతం పిచ్ నెమ్మదించిందని చెప్పాడు. 'తొలుత టాస్ ఓడిపోవడం కూడా మిశ్రమ ఫలితాలకు దారితీసింది. గేమ్ లో భాగంగా కొన్నిసార్లు కొందరిపై తీవ్ర విమర్శలు రావడం సాధారణమేనని, అయితే జట్టులోని ప్రతి ఒక్కరూ సమిష్టిగా రాణిస్తేనే విజయాలు సాధ్యమవుతాయని అభిప్రాయపడ్డాడు.