IND VS ENG 1st Test: చరిత్రలో తొలిసారి..! | IND Vs ENG 1st Test: England Landed Team With Only One Specialist Pacer For The First Time, See Details Inside - Sakshi
Sakshi News home page

IND VS ENG 1st Test: చరిత్రలో తొలిసారి..!

Published Fri, Jan 26 2024 7:41 AM | Last Updated on Fri, Jan 26 2024 12:45 PM

IND VS ENG 1st Test: England Landed Team With Only One Specialist Pacer For The First Time - Sakshi

ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్‌ జట్టు ఓ వినూత్న ప్రయోగం చేసింది. ఆ జట్టు తొలిసారి ఓ టెస్ట్‌ మ్యాచ్‌లో ఏకైక స్పెషలిస్ట్‌ పేసర్‌తో బరిలోకి దిగింది. హైదరాబాద్‌ టెస్ట్‌లో ఇంగ్లండ్‌.. రైట్‌ ఆర్మ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ మార్క్‌ వుడ్‌ ఒక్కడినే బరిలోకి దించి సరికొత్త ప్రయోగానికి తెరలేపింది.

ఈ మ్యాచ్‌లో వుడ్‌ను బరిలోకి దించినా, తొలి రోజు ఆటలో అతనిచే కేవలం రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్‌ చేయించింది. తొలి రోజు ఇంగ్లండ్‌ మొత్తంగా 23 ఓవర్లు వేయగా.. అందులో 21 ఓవర్లు స్పిన్నర్లు టామ్‌ హార్ట్లీ (9), జాక్‌ లీచ్‌ (9), రెహాన్‌ అహ్మద్‌లే (3) షేర్‌ చేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ముగ్గురు స్పిన్నర్లతో బరిలో​కి దిగిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌ ఇలా ముగ్గురు స్పిన్నర్లతో టెస్ట్‌ మ్యాచ్‌ బరిలోకి దిగడం కూడా చాలా అరుదు.

హైదరాబాద్‌ పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉందని భావించి ఇంగ్లండ్‌ మేనేజ్‌మెంట్‌ ఈ నిర్ణయం తీసుకుంది. తొలి రోజు ఆటను బట్టి చూస్తే ఇంగ్లండ్‌ అంచనా కరెక్టే అయినప్పటికీ.. భారత్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా అత్యంత పొదుపుగా బౌలింగ్‌ చేసి కీలకమైన స్టోక్స్‌ వికెట్‌ సహా రెండు వికెట్లు తీయడం విశేషం. 

కాగా, భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య తొలి టెస్ట్‌ మ్యాచ్‌ నిన్న (జనవరి 25) ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసింది. అయితే భారత స్పిన్నర్లు ధాటికి ఇంగ్లండ్‌ జట్టు 246 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ స్టోక్స్‌ (70) ఒక్కడే హాఫ్‌ సెంచరీతో రాణించాడు.

జాక్‌ క్రాలే 20, బెన్‌ డకెట్‌ 35, ఓలీ పోప్‌ 1, జో రూట్‌ 29, బెయిర్‌స్టో 37, ఫోక్స్‌ 4, రెహాన్‌ అహ్మద్‌ 13, టామ్‌ హార్ట్లీ 23, మార్క్‌ వుడ్‌ 11 పరుగులు చేసి ఔటయ్యారు. జడేజా, అశ్విన్‌ తలో మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ పతనాన్ని శాశించగా.. అక్షర్‌ పటేల్‌, బుమ్రా తలో రెండు వికెట్లు పడగొట్టారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టానికి 119 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ 24 పరుగులు చేసి జాక్‌ లీచ్‌ బౌలింగ్‌లో ఔట్‌ కాగా.. యశస్వి జైస్వాల్‌ (76), శుభ్‌మన్‌ గిల్‌ (14) క్రీజ్‌లో ఉన్నారు. భారత్‌.. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఇంకా 127 పరుగులు వెనుకపడి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement