భాగ్యనగరం వాకిట్లో క్రికెట్ పండుగ వచ్చేసింది. అభిమానులందరికీ ప్రపంచ క్రికెట్‌లోని అగ్రశ్రేణి ఆటగాళ్లు తమ ఆటతీరుతో కనువిందు చేయడానికి ‘సై’ అంటున్నారు. గురువారం నుంచి ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్లు టెస్టు సమరానికి సిద్ధమయ్యాయి. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు ఈనెల 25 నుంచి 29 వరకు హైదరాబాద్‌లో జరగనుండగా..రెండో టెస్టుకు ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు విశాఖపట్నం ఆతిథ్యమివ్వనుంది.
ఉప్పల్ స్టేడియంలో భారత జట్టు ఇప్పటి వరకు ఆరు టెస్టులు ఆడింది. ఇందులో నాలుగు టెస్టుల్లో గెలుపొంది, ఒక టెస్టును ‘డ్రా’ చేసుకుంది. ఈ మైదానంలో భారత జట్టు తమ అజేయ రికార్డును కొనసాగించాలని మరో విజయాన్ని తమ ఖాతాలో జమ చేసుకోవాలని ఆశిద్దాం.
కోహ్లి లేడు..
వ్యక్తిగత కారణాలరీత్యా భారత స్టార్ విరాట్ కోహ్లి తొలి రెండు టెస్టులకు దూరం కావడం తెలుగు క్రికెట్ అభిమానులకు కాస్త నిరాశ కలిగించే అంశం. అయితే రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ బ్యాట్‌తో... జస్‌ప్రీత్ బుమ్రా, సిరాజ్ వాడివేడి పేస్‌తో..అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తమ స్పిన్ మాయాజాలంతో అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఇటీవల కాలంలో టెస్టుల్లోనూ టి20 తరహా దూకుడైన ఆటతో అదరగొడుతున్న ఇంగ్లండ్ జట్టు భారత గడ్డపై అదే జోరు కొనసాగిస్తుందో లేదో వేచి చూడాలి. ఇంగ్లండ్ బృందంలో బెన్ స్టోక్స్, జో రూట్, బెయిర్‌స్టో, ఒలీ పాప్, జేమ్స్ అండర్సన్, మార్క్ వుడ్ ప్రధాన ఆకర్షణగా నిలువనున్నారు.
లోకల్ స్టార్ సిరాజ్ రె‘ఢీ’..
ఇప్పటికే భారత్, ఇంగ్లండ్ జట్లు హైదరాబాద్‌కు చేరుకున్నాయి. మంగళవారం రెండు జట్లు ముమ్మరంగా సాధన చేశాయి. ‘లోకల్ స్టార్’ మొహమ్మద్ సిరాజ్ సొంత మైదానంలో తొలి టెస్టు ఆడటం ఖాయమైంది. ఇప్పటి వరకు సిరాజ్ 23 టెస్టులు ఆడాడు. ఇందులో 6 టెస్టులు (చెన్నై, అహ్మదాబాద్, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, ఇండోర్) భారత గడ్డపై, మిగతా 17 టెస్టులు విదేశాల్లో ఆడాడు.
వ్యూహ రచనలో జడేజా, అశ్విన్..
టీమిండియా స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ల భరతం పట్టేందుకు సిద్దంగా ఉన్నారు. ఉప్పల్ పిచ్ స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో వీరిద్దరు వ్యూహరచనల్లో నిమగ్నమై ఉన్నారు. ఇంగ్లండ్‌ను రెండు ఇన్నింగ్స్‌ల్లో మడతపట్టేందుకు వీరిద్దరూ కఠోరంగా సాధన చేస్తున్నారు.
ఇంగ్లండ్ ఆటగాళ్లు సైతం..
భారత్‌ను స్వదేశంలో ఓడించాలంటే ఎంత కష్టమో ఇంగ్లండ్ ఆటగాళ్లు బాగా తెలుసు. అందుకే వారు మూడు రోజుల ముందుగానే తొలి టెస్ట్ వేదిక అయిన హైదరాబాద్‌కు చేరుకుని కఠోరంగా సాధన చేస్తున్నారు.
అనుభవమే ఆయుధంగా..
భారత్‌పై ఆడిన అనుభవం ఎక్కువగా ఉన్న వెటరన్ పేసర్ ఆండర్సన్ అందరికంటే ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ చెమటోడుస్తున్నాడు. ఈ సిరీస్‌లో టీమిండియాను ఇబ్బంది పెట్టే బౌలర్ ఎవరైనా ఉన్నారా అంటే అది ఆండర్సనే అని చెప్పాలి. అతని అనుభవం ముందు టీమిండియా బ్యాటర్లు నిలబడతారో లేక ఆండర్సన్ కెరీర్‌కు చేదు అనుభవంతో ముగింపు పలుకుతారో వేచి చూడాలి.
నాడు ప్లేయర్‌గా... నేడు కోచ్‌గా..
2010లో ఉప్పల్ స్టేడియంలోనే భారత్‌తో జరిగిన టెస్టులో న్యూజిలాండ్ జట్టు తరఫున ‘డబుల్ సెంచరీ’ సాధించిన బ్రెండన్ మెకల్లమ్ ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టుకు హెడ్ కోచ్‌గా మళ్లీ హైదరాబాద్‌కు రావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment