
సవాల్‌కు సై!
సాయంత్రం గం. 5.00 నుంచి
టెన్ క్రికెట్‌లో ప్రత్యక్ష ప్రసారం
దాదాపు మూడేళ్ల క్రితం భారత జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించినప్పుడు... జట్టు వెళ్లిన ప్రతి చోటా ‘మీ కోసం ఎదురు చూస్తున్నాం’ అంటూ హోర్డింగ్‌లు, బిల్‌బోర్డులు కనిపించాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. బోర్డుల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో అక్కడి అభిమానులు కూడా ఇరు జట్ల మధ్య ‘స్నేహం’ గురించి ఆలోచించకుండా తమ జట్టు నుంచి దూకుడును ఆశిస్తున్నారు.
ఒక్క మాటలో చెప్పాలంటే మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులను కూడా టీమిండియా ఎదుర్కోవాల్సిన స్థితిలో... ఉద్రేకాల మధ్య సిరీస్‌కు తెర లేవనుంది. ఈసారి చిన్న సిరీస్ కావడంతో కోలుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉండదు.
జొహన్నెస్‌బర్గ్: వన్డేల్లో అద్భుతమైన ప్రదర్శనతో ఈ ఏడాది తిరుగులేని ఆటతీరు కనబర్చిన భారత జట్టు ఇప్పుడు విదేశీ గడ్డపై కీలక పోరుకు సిద్ధమైంది. వివాదాలు ముగిసి ఎట్టకేలకు ఖరారైన దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా వన్డే సిరీస్ రూపంలో తొలి పరీక్షను ఎదుర్కోబోతోంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం ఇక్కడి వాండరర్స్ మైదానంలో తొలి మ్యాచ్ జరగనుంది.
సొంతగడ్డపై ఇటీవల పాక్ చేతిలో సిరీస్ ఓడిన దక్షిణాఫ్రికా మళ్లీ సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. ఇటీవలి ప్రదర్శన ప్రకారం చూస్తే భారత్ అభేద్యంగా కనిపిస్తున్నా... ఉప ఖండానికి భిన్నమైన పరిస్థితులు ఉండే సఫారీ గడ్డపై ఏ స్థాయి ఆటతీరు కనబరుస్తుందనేది ఆసక్తికరం. దక్షిణాఫ్రికాలో భారత జట్టు గత రికార్డు పేలవంగా ఉండటం ప్రతికూలాంశం. ఆ జట్టుతో ఇక్కడ జరిగిన 25 వన్డేల్లో టీమిండియా 5 మాత్రమే నెగ్గి 19 ఓడింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఇక్కడ మన జట్టు ఒక్క ద్వైపాక్షిక సిరీస్ కూడా గెలవలేకపోయింది.
కుర్రాళ్లు మళ్లీ చెలరేగుతారా...
ఈ ఏడాది భారత్ ఆరు వన్డేలు సిరీస్/ట్రోఫీలు గెలిచింది. ఇందులో కీలక పాత్ర పోషించిన కుర్రాళ్ల బృందమే ఇప్పుడు దక్షిణాఫ్రికాలోనూ పర్యటిస్తోంది. ముఖ్యంగా విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ తమ కెరీర్‌లో అత్యుత్తమ దశలో ఉన్నారు. ఈ ఏడాది వీరంతా వెయ్యికి పైగా పరుగులు సాధించారు. వీరికి తోడు కెప్టెన్ ధోని కూడా తన జోరును కొనసాగిస్తున్నాడు. 2013లో ధోని 23 మ్యాచుల్లో 66.90 సగటుతో పరుగులు చేయడం విశేషం. ఇందులో ఒక సెంచరీ, నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి.
దక్షిణాఫ్రికా పేస్‌ను సమర్థంగా ఎదుర్కోగలిగితే ఈ యువ ఆటగాళ్లు మరో చిరస్మరణీయ విజయంలో భాగం కాగలరు. అయితే యువరాజ్, రైనాల ఫామ్ మాత్రం జట్టును ఆందోళన పరుస్తోంది. ఇటీవల ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌లతో జరిగిన సిరీస్‌లలో వీరిద్దరూ విఫలమయ్యారు. ఈ ఏడాది రైనా సగటు 36 కాగా... యువరాజ్‌ది 21.23 మాత్రమే. మరి టీమ్ మేనేజ్‌మెంట్ వీరిపైనే నమ్మకం ఉంచుతుందా లేక అంబటి రాయుడు, రహానేలకు అవకాశం ఇస్తుందా చూడాలి. భారత్ తమ ఇటీవలి విజయ యాత్రలో ఇంగ్లండ్, వెస్టిండీస్, జింబాబ్వే వంటి విభిన్న పరిస్థితుల్లో అద్భుతంగా రాణించింది.
వాటితో పోలిస్తే బౌన్స్ ఎక్కువగా ఉండే దక్షిణాఫ్రికా పిచ్‌లు భిన్నం. కొన్నాళ్ల క్రితం భారత్ ‘ఎ’ జట్టు ఇక్కడ పర్యటించి పరిస్థితులపై అవగాహన పెంచుకుంది. ధావన్ అనధికారిక వన్డేలో డబుల్ సెంచరీ కూడా చేశాడు. అయితే పూర్తిగా భారత పిచ్‌లను పోలి ఉండే ప్రిటోరియాలాంటి చోటనే ఆ మ్యాచ్‌లు జరిగాయనే విషయాన్ని విస్మరించరాదు. ఆరుగురు బ్యాట్స్‌మెన్‌తో భారత్ బరిలోకి దిగే అవకాశం ఉంది. భారత యువ బౌలర్లకు కూడా తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఇది సరైన వేదిక కానుంది.
సీనియర్లే బలం...
మరోవైపు దక్షిణాఫ్రికా పరిస్థితి అంత గొప్పగా ఏమీ లేదు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్న ఈ జట్టు ఇటీవల అనూహ్యంగా పాకిస్థాన్ చేతిలో ఓడిపోయింది. అంతకుముందు చాంపియన్స్ ట్రోఫీలో విఫలమైన ఆ జట్టు... న్యూజిలాండ్, శ్రీలంకల చేతిలో కూడా పరాజయం పాలైంది. నంబర్‌వన్ టీమ్‌ను నిలువరించడం వారికి అంత సులభం కాబోదు. సొంతగడ్డపై ప్రత్యర్థిపై ఆధిక్యం ప్రదర్శించేందుకు జట్టు తమ పేస్ బలగాన్నే నమ్ముకుంటోంది. స్టెయిన్, మోర్నీ మోర్కెల్, సోట్సోబ్, మెక్లారెన్, కలిస్‌లతో టీమ్ పేస్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. వీరు భారత బ్యాట్స్‌మెన్‌కు అడ్డుకట్ట వేయగలిగితేనే జట్టుకు విజయావకాశాలు ఉంటాయి. కోచ్‌గా గ్యారీ కిర్‌స్టెన్ తప్పుకున్నాక కెప్టెన్‌గా డివిలియర్స్ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు.
అయితే బ్యాటింగ్‌లో అతనితో పాటు హాషిమ్ ఆమ్లా ఫామ్‌లో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. స్మిత్ వన్డేల్లో చెప్పుకోదగ్గ బ్యాట్స్‌మన్ కాకపోయినా... డుమిని, మిల్లర్‌లు కీలకం కానున్నారు. ఆల్‌రౌండర్‌గా కలిస్‌పై ఆ జట్టు ఎంతో ఆధార పడుతోంది. భారత్‌లో తరహాలో కాకుండా బ్యాట్, బంతి మధ్య సమతూకం ఉండే పిచ్‌లు కావడంతో సిరీస్ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది.
జట్లు (అంచనా)
భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, కోహ్లి, యువరాజ్, రైనా, జడేజా, అశ్విన్, భువనేశ్వర్, షమీ, మోహిత్.
దక్షిణాఫ్రికా: డివిలియర్స్ (కెప్టెన్), ఆమ్లా, స్మిత్, డి కాక్, కలిస్, డుమిని, మెక్లారెన్, స్టెయిన్, మోర్నీ మోర్కెల్, సోట్సోబ్, తాహిర్.
వాతావరణం
తొలి వన్డే మ్యాచ్‌కు వాతావరణం అడ్డంకిగా మారవచ్చు. గత మూడు వారాలుగా ప్రతీ సాయంత్రం జొహన్నెస్‌బర్గ్‌లో వర్షం కురుస్తోంది. గురువారం కూడా కొద్ది సేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడవచ్చని స్థానిక వాతావరణ శాఖ చెబుతోంది. మ్యాచ్ పూర్తిగా ఆగకపోయినా... ఆలస్యం కావడం, మధ్యలో ఆగేందుకు కూడా అవకాశం ఉందని సమాచారం.
పిచ్
బౌన్సీ వికెట్‌ను సిద్ధం చేశారు. మ్యాచ్ రోజూ పచ్చికను తొలగించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. పేసర్లకు అనుకూలించే ఈ పిచ్‌పై భారీ స్కోర్లు రావడం కష్టమే.
22 ఈ ఏడాది భారత్ తాను ఆడిన 31 వన్డేల్లో 22 గెలవడం విశేషం
మాపై చాలా ఒత్తిడి ఉంది
‘సొంతగడ్డపై ఇంతటి ఒత్తిడిని ఎదుర్కోవడం మాకు కొత్తగా అనిపిస్తోంది. అయితే ఒక సిరీస్ ఓడినంత మాత్రాన మమ్మల్ని అండర్‌డాగ్స్ అనడాన్ని నేనొప్పుకోను. మా దేశంలో రికార్డు బాగా లేని ఒక ఉపఖండపు జట్టును మేం ఎదుర్కోబోతున్నాం కాబట్టి మా స్థాయికి తగినట్లు ఆడితే చాలు.
ఇక్కడి పిచ్‌లపై 300పైగా స్కోర్లు తరచుగా నమోదు కావు. ప్రత్యర్థి బలం బ్యాటింగ్‌లోనే ఉందని, వారి బౌలింగ్ బలహీనమని మాకు తెలుసు. అయితే నంబర్‌వన్ జట్టును మేం తేలిగ్గా తీసుకోం. తగిన వ్యూహాలతోనే బరిలోకి దిగుతున్నాం.’
- ఏబీ డివిలియర్స్, దక్షిణాఫ్రికా కెప్టెన్
పేస్, బౌన్స్‌కు అలవాటు పడాలి
‘వాతావరణాన్ని బట్టి వికెట్‌ను ఎలా సిద్ధం చేశారనేదే ఇక్కడ కీలకం. ఇండియాలో ఎక్కడా ఇలాంటి వికెట్ కనిపించదు కాబట్టి కొత్త కుర్రాళ్లు ఇక్కడి బౌన్స్, పేస్‌కు అలవాటు పడటం సవాల్‌లాంటిది. అయితే వేర్వేరు చోట్ల ఆడిన అనుభవం ఉన్న ఆటగాళ్లకు ఆ ఇబ్బంది లేదు. గత రికార్డులను పట్టించుకోను. రెండు బంతుల నిబంధనలు ఇక్కడ ఫాస్ట్ బౌలర్లకు బాగా అనుకూలిస్తాయి కాబట్టి తొలి పది ఓవర్ల ఆట కీలకమవుతుంది. ఎక్కడ ఆడినా, పిచ్ ఎలా ఉన్నా చేతిలో వికెట్లుంటే ఆఖరి 8-10 ఓవర్లలో ఎక్కువ పరుగులు చేయవచ్చు. మా దగ్గర అత్యుత్తమ బౌలర్లు లేకపోయినా పరిస్థితులను బట్టి వారు రాణిస్తూనే ఉన్నారు. సమయానికి తగిన విధంగా స్పందించడమే వ్యూహం తప్ప ప్రత్యేక ప్రణాళిక అవసరం లేదు’
- ఎం.ఎస్. ధోని, భారత కెప్టెన్