ప్రపంచ పారా అథ్లెటిక్స్‌లో అమిత్‌కు రజతం
లండన్: ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్ అమిత్ కుమార్ సరోహ రజత పతకం సాధించాడు. పురుషుల క్లబ్ త్రో ఎఫ్51 పోటీల్లో అతను 30.25 మీటర్లతో రెండో స్థానంలో నిలిచాడు. తన మూడో ప్రయత్నంలో ఈ ప్రదర్శన చేయడం ద్వారా అమిత్ కొత్త ఆసియా రికార్డును నమోదు చేశాడు. ఈ ఈవెంట్‌లో జెల్జ్‌కో (సెర్బియా; 31.99 మీ.) ప్రపంచ రికార్డు నెలకొల్పి బంగారు పతకం నెగ్గాడు. భారత్‌కే చెందిన ధరంబిర్ (22.34 మీ.) పదో స్థానంలో నిలిచాడు. అమిత్ కుమార్ నేడు (మంగళవారం) డిస్కస్ త్రో ఎఫ్52 ఈవెంట్‌లో కూడా పోటీపడనున్నాడు. ఈ టోర్నీలో భారత్‌కు చెందిన సుందర్ సింగ్ గుర్జర్ జావెలిన్ త్రో ఎఫ్46లో బంగారు పతకం గెలిచిన సంగతి తెలిసిందే.