Athletics Championships
-
Vitya And Nitya: ఆగొద్దు, పరుగు తీయండి
‘ముగ్గురు ఆడపిల్లల్ని కన్నావ్. ఎలా పెంచుతావో’ అని ఆ తల్లికి దారిన పోయేవారంతా సానుభూతి తెలిపేవారు. పేదరికంతో అలమటిస్తున్న కుటుంబం అది. ఆ తల్లి తన కూతుళ్లను ఆపదలచలేదు, ఆగిపోనివ్వలేదు. ‘ఫ్రీగా తిండి పెడతారు. తిని పరిగెత్తండి’ అని ఇద్దర్ని తీసుకెళ్లి స్పోర్ట్స్ హాస్టల్లో పడేసింది. కవలలైన ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్లు ఇవాళ భారతదేశంలో మేలైన అథ్లెట్లుగా మారారు. ఆసియన్ గేమ్స్‌కు క్వాలిఫై అయ్యారు. కోయంబత్తూరుకు చెందిన విత్య, నిత్యల పరుగు కథ ఇది. అబ్బాయిలు పుడితేనేనా సంతోషం? అమ్మాయిలు పుడితే బాధ పడాలా? ‘నాకు లేని బాధ మీకెందుకు?’ అని ఇరుగు పొరుగువారితో అనేది మీనా. కోయంబత్తూరులో నిరుపేదల కాలనీలో నివాసం ఉన్న మీనాకు మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టింది. ‘సత్య’ అనే పేరు పెట్టింది. రెండో కాన్పులో ఏకంగా కవల ఆడపిల్లలు పుట్టారు. వారికి ‘విత్య’, ‘నిత్య’ అనే పేర్లు పెట్టింది. భర్త రామరాజ్ లారీ డ్రైవరు. డ్యూటీ ఎక్కితేనే సంపాదన. ఇంట్లో ఎప్పుడూ పేదరికమే. దానికి తోడు ‘ముగ్గురు ఆడపిల్లలు’! ‘ఎలా పెంచుతావో ఏమో’ అని ఇంటికొచ్చిన అందరూ అనేవారు. కాని మీనా అస్సలు బాధ పడలేదు. భయపడలేదు. ఆడపిల్లలే కదా అని ఇంట్లో మగ్గేలా చేయలేదు. ‘నా పిల్లలు చదువుకోవాలి. ఆడపిల్లలు పైకి రావాలంటే చదువే దారి’ అని స్కూల్లో చేర్చింది. పెద్దమ్మాయి సత్య చక్కగా చదువుకుంటే కవలలు విత్య, నిత్యలు స్కూల్లో హాకీ బాగా ఆడటం మొదలుపెట్టారు. కాని ఇంట్లో ప్రతి పూటా ఐదుగురికి ముద్ద నోట్లోకి వెళ్లాలంటే కష్టమైన సంగతి. స్కూల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ద్వారా స్పోర్ట్స్ స్కూల్ గురించి తెలిసింది. ఆ స్కూల్లో చేర్చితే చదువుతోపాటు ఆటలు నేర్పిస్తారు అని తెలుసుకుంది మీనా. ఇద్దరు కూతుళ్లు చిన్న పిల్లలు. ఏడవ తరగతి లో ఉన్నారు. కళ్లముందు పెరగాల్సిన బిడ్డలు. ‘ఏం పర్వాలేదు. మీ భవిష్యత్తే ముఖ్యం. స్పోర్ట్స్ స్కూల్లో కడుపు నిండా తిని బాగా పరిగెత్తండి’ అని చెప్పి కవల సోదరీమణులైన విత్య, నిత్యలను కోయంబత్తూరులోని స్పోర్ట్స్ స్కూల్లో చేర్చింది. ఆ తల్లి తపనను కూతుళ్లు అర్థం చేసుకున్నారు. బాగా ఆడారు. ఇవాళ విజేతలుగా నిలిచారు. ఆసియా గేమ్స్ ఆశాకిరణాలు మన దేశం నుంచి ఆసియా గేమ్స్‌లో పాల్గొన్న కవల క్రీడాకారులు తక్కువ. వారిలో మహిళా అథ్లెట్లు ఇంకా తక్కువ. మరో తొమ్మిది రోజుల్లో హాంగ్జవ్ (చైనా)లో మొదలుకానున్న ఆసియన్ గేమ్స్‌లో విత్య రామరాజ్, నిత్య రామరాజ్ పేర్లతో ఈ కవలలు పాల్గొనబోతున్నారు. విత్య 400 మీటర్ల హర్డిల్స్, ఫ్లాట్ రన్లో పాల్గొంటుంటే నిత్య 100 మీటర్ల పరుగులో పాల్గొననుంది. మన దేశం నుంచి మొత్తం 65 మంది ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు ఆసియా గేమ్స్ కోసం ఎంపికైతే వారిలో విత్య, నిత్య ఉన్నారు. ‘ఇద్దరం ఎంపిక కావడంతో అమ్మ ఆనందానికి అవధులు లేవు. ఎవరో ఒకరు మాత్రమే అయితే ఆమె తప్పక బాధపడేది. ఆమె కోసం, దేశం కోసం ఎలాగైనా పతకాలు సాధించాలనే పట్టుదలతో ఉన్నాం’ అన్నారు విత్య, నిత్య. పి.టి. ఉషతో సమానంగా విత్య రామరాజ్ చెన్నైలో శిక్షణ పొంది గత కొన్ని సంవత్సరాలుగా జాతీయ స్థాయి బంగారు పతకాలు గెలుస్తూ వచ్చింది. రెండ్రోజుల క్రితం చండీగఢ్‌లో జరిగిన గ్రాండ్‌ప్రిలో 400 మీటర్ల హర్డిల్స్‌ను 55.4 సెకెండ్లలో పూర్తి చేసింది. ఇది 1984 ఒలింపిక్స్‌లో పి.టి. ఉష రికార్డుకు కేవలం 0.01 సెకండ్ల కంటే తక్కువ. అంటే 39 సంవత్సరాల తర్వాత ఆ స్థాయి ప్రతిభను చూపే అథ్లెట్‌గా విత్య అవతరించింది. ఆనాడు ఆమె తల్లి ఆమెను ప్రోత్సహించకపోతే, ఆడపిల్లే అనుకుని ఖర్మకు వదిలిపెడితే ఈ రోజున ఇంత ప్రతిభతో నిలిచేదా? అలాగే నిత్య కూడా 100 మీటర్ల హర్డిల్స్‌లో మంచి ప్రతిభ చూపుతోంది. ‘మేమిద్దరం ఆసియా గేమ్స్‌లో మెడల్స్ సాధించి ఒలింపిక్స్‌కు వెళ్లాలని అనుకుంటున్నాం. ఆశీర్వదించండి’ అంటున్నారు విత్య, నిత్య. ఇలాంటి క్రీడాకారిణులకు అందరి ఆశీస్సులూ ఉంటాయి. -
మన బంగారు కొండ
భారత క్రీడాభిమానులకు ఇది హృదయం ఉప్పొంగే క్షణం. అథ్లెటిక్స్‌లోనూ మన ఆటగాళ్ళు విశ్వ విజేతలుగా నిలుస్తున్న అపురూప సందర్భం. నిన్నటి దాకా ఒలింపిక్ ఛాంపియన్ మాత్రమే అయిన ఓ క్రీడా దిగ్గజం ఇవాళ ప్రపంచ ఛాంపియన్ కూడా అయిన అపూర్వ ఘట్టం. బుడాపెస్ట్‌లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో పురుషుల జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణం సాధించడం ద్వారా భారత అథ్లెట్ నీరజ్ చోప్రా ఆదివారం నాడు అక్షరాలా చరిత్ర సృష్టించారు. ప్రపంచ అథ్లెటిక్స్‌లో స్వర్ణపతకం సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించారు. దేశం గర్వపడేలా చేశారు. ఆదివారం నాడు రెండో ప్రయత్నంలో గరిష్ఠంగా 88.17 మీటర్ల దూరం ఈటెను విసిరి, నీరజ్ సాధించిన ఈ స్వర్ణపతకం ఇక భారత క్రీడాచరిత్రలో సువర్ణాక్షర లిఖితం. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ఊరిలోని నీరజ్ ఇంట్లో ఆయన తండ్రి, బంధుమిత్రులు ఒక్కచోట కూడిన ఉత్కంఠగా చూసిన ఈ విజయఘట్టం వారికే కాదు... యావద్భారతావనికి కూడా ఉద్విగ్నభరితమైనది. ఆర్మీలో సుబేదార్ అయిన పాతికేళ్ళ నీరజ్ చోప్రా మాటల్లోనే చెప్పాలంటే, ఒలింపిక్స్ కన్నా వరల్డ్ ఛాంపియన్షిప్స్ కఠినమైనది. ఒలింపిక్స్ ప్రత్యేక మైనది అయితే, వరల్డ్ ఛాంపియన్ అనేది అతి పెద్ద కిరీటం. పోటీ పరంగా చూసినా, అథ్లెట్లు అవిశ్రాంత సాధన చేసి వచ్చే వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఎప్పుడూ కాస్తంత ఎక్కువ కఠినమే. అలాంటి వేదికపై స్వర్ణసాధనతో నీరజ్ ‘భారతదేశంలో ఆల్‌టైమ్ అతి గొప్ప అథ్లెట్’గా అవతరించారు. మొహమాటంగా ఆ పిలుపును పక్కనపెడుతూ, ఆయన వినయంగా వ్యవహరిస్తున్నప్పటికీ అది వాస్తవమే. అటు ఒలింపిక్స్ స్వర్ణం, ఇటు తాజా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ స్వర్ణం – రెండూ సాధించిన ఏకైక భారత అథ్లెట్ ఈ సైనికుడే. మధ్యతరగతి నుంచి వచ్చిన నీరజ్ ఈ స్థాయికి చేరడానికి ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నారు. మోచేతికి గాయం కావడంతో 2019లో శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. అలా అప్పట్లో దోహాలో ప్రపంచ ఛాంపియన్షిప్స్కు హాజరు కాలేకపోయారు. తర్వాత రెట్టించిన ఉత్సాహంతో వచ్చి, 2020 జనవరిలో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. ఆలస్యంగా ఆ మరుసటేడు జరిగిన ఆ ఒలింపిక్స్‌లో ఏకంగా స్వర్ణం సాధించారు. మన దిగ్గజ అథ్లెట్లైన మిల్ఖాసింగ్, పీటీ ఉషకు సైతం అందని ఆ స్వర్ణకీర్తిని అందుకున్నారు. అలా రెండేళ్ళ క్రితం 2021 ఆగస్ట్‌లో జరిగిన టోక్యో ఒలింపిక్స్– 2020లో స్వర్ణసాధన నాటి నుంచి అందరి దృష్టీ నీరజ్‌పై ఉంది. ఇప్పుడీ ప్రపంచ ఛాంపియన్ షిప్స్‌లోనూ బంగారు పతకం తెచ్చి, అథ్లెటిక్స్‌లో మన దేశానికి పతకాలు పండించే బంగారు కొండ అయ్యారు. సౌత్ ఏషియన్ గేమ్స్ (2016), ఏషియన్ ఛాంపియన్షిప్స్ (2017), కామన్వెల్త్ గేమ్స్ (2018), ఏషియన్ గేమ్స్ (2018), ఒలింపిక్స్ (2020), డైమండ్ లీగ్ (2022), ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్షిప్స్... ఇలా నీరజ్ సాధించిన స్వర్ణాలే అందుకు సాక్ష్యం. మొత్తం ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ చరిత్రలో భారత్‌కు ఇది మూడో పతకం. ఇంతకు మునుపు జరిగిన 18 ఛాంపియన్‌షిప్‌లలో మన దేశానికి వచ్చినవి రెండు పతకాలే. ఆ రెండింటిలో కూడా ఒకటి నిరుటి ఛాంపియన్‌షిప్స్‌లో నీరజ్ చోప్రా సాధించిన రజతమే. అంతకు ముందెప్పుడో 2003లో మహిళల లాంగ్‌జంప్‌లో అంజూ బాబీ జార్జ్ కాంస్యం గెలిచారు. అప్పుడలా విశ్వవేదికపై మొదలైన మన పతకాల లెక్క ఇప్పుడు మూడుకు చేరడం ఒక రకంగా ఆనందమే అయినా, మరోరకంగా ఇన్నేళ్ళకు గానీ ఆ స్థాయికి చేరకపోవడం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అంశం. ప్రపంచ స్థాయికి చేరేలా మన ఆటగాళ్ళను ప్రోత్సహించేందుకు మనం చేయవలసినంత చేస్తున్నామా అన్నది ఆలోచించాల్సిన విషయం. అయితే, ఒకప్పుడు అంతర్జాతీయ యవనికపై భారతీయ క్రీడ అంటే హాకీ. తర్వాత క్రికెట్, ఆ పైన చెస్, బ్యాడ్మింటన్, టెన్నిస్, రెజ్లింగ్ వగైరాల్లోనూ మన ప్రతిభకు తక్కువ లేదని నిరూపిత మవుతూ వచ్చింది. నిజానికి, జావెలిన్ త్రోలో సైతం ఒకప్పుడు విశ్వవేదికపై మనం ఎక్కడ ఉన్నామో కూడా ఎవరికీ తెలీదు. కానీ, ఇప్పుడు ఏకంగా ముందు వరుసలో నిలిచాం. అందులోనూ తాజా పోటీలో కిశోర్ జెనా, డీపీ మను అనే మరో ఇద్దరు భారతీయ జావెలిన్ త్రో వీరులు కూడా ఉండడం, వారిద్దరు 5వ, 6వ స్థానాల్లో నిలవడం... ఇవన్నీ మారుతున్న పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. భవిష్యత్తు పట్ల ఆశలు రేపుతున్నాయి. ఆ ఆశలు నెరవేరడానికి నీరజ్ అన్నట్టు మన దగ్గర కూడా కీలకమైన మోండో ట్రాక్స్ వగైరాలను అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్ఐ) సిద్ధం చేయడం అవసరం. చెక్ రిపబ్లిక్కు చెందిన దిగ్గజ అథ్లెట్ జెలెజ్నీ 98.48 మీటర్ల దూరం ఈటె విసిరి, ప్రపంచ రికార్డ్ నెలకొల్పారు. మూడుసార్లు ఒలింపిక్స్‌లో, మరో 3 సార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో పసిడి పతకాలు గెలిచారు. అతనే తనకు స్ఫూర్తి అని చెప్పే నీరజ్ ఆ స్థాయికి చేరడానికి చేయాల్సిన శ్రమ, సాగించాల్సిన ప్రయాణం ఇంకా చాలానే ఉంది. ఆ ప్రయాణానికి మన ప్రభుత్వాలు, క్రీడా సంస్థలు అందించాల్సిన సహకారమూ అపారమే. నీరజ్ ఒలింపిక్స్ సాధన తర్వాత హరియాణాలోని పానిపట్ సహా అనేక గ్రామాల్లో పిల్లల్లో, ఇళ్ళల్లో క్రీడల పట్ల ఆసక్తి కొన్ని పదుల రెట్లు పెరిగింది. గుంపులుగా వచ్చి, ఆటలాడుతున్న ఆ భావి భారత ఆశాకిరణాలకు మైదానాలు, ఆస్పత్రుల లాంటి కనీస వసతులు కల్పించడం ప్రభుత్వ కర్తవ్యం. ఆ దిశగా కృషి చేస్తే, మరింత మంది నీరజ్‌లు ఈ గడ్డపై నుంచి వస్తారనడంలో సందేహం లేదు. -
World Athletics Championship: పసిడి... ప్రపంచ రికార్డు
యుజీన్ (అమెరికా): రేసు మొదలైన వెంటనే ట్రాక్‌పై వాయువేగంతో దూసుకెళ్తూ... ఒక్కో హర్డిల్‌ను అలవోకగా అధిగమిస్తూ... ఒక్కో ప్రత్యర్థిని వెనక్కి నెడుతూ... ఎవరూ ఊహించని సమయంలో లక్ష్యానికి చేరిన అమెరికా మహిళా అథ్లెట్ సిడ్నీ మెక్లాఫ్లిన్ తన పేరిట నాలుగోసారి ప్రపంచ రికార్డును లిఖించుకుంది. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా శనివారం జరిగిన మహిళల 400 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ ఈవెంట్లో 22 ఏళ్ల సిడ్నీ మెక్లాఫ్లిన్ 50.68 సెకన్లలో గమ్యానికి చేరి తొలిసారి స్వర్ణ పతకం సొంతం చేసుకోవడంతోపాటు ప్రపంచ రికార్డు సృష్టించింది. ప్రపంచ రికార్డు సాధించినందుకు సిడ్నీకి లక్ష డాలర్లు (రూ. 79 లక్షల 84 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఫెమ్కే బోల్ (నెదర్లాండ్స్; 52.27 సెకన్లు) రజతం, దాలియా మొహమ్మద్ (అమెరికా; 53.13 సెకన్లు) కాంస్యం సాధించారు. బంగారు పతకం గెలిచే క్రమంలో సిడ్నీ గత నెల 25న 51.41 సెకన్లతో తానే నెలకొల్పిన ప్రపంచ రికార్డును సవరించింది. గత 13 నెలల కాలంలో సిడ్నీ ప్రపంచ రికార్డును తిరగరాయడం ఇది మూడోసారి కావడం విశేషం. మహిళల జావెలిన్ త్రో ఫైనల్లో భారత క్రీడాకారిణి అన్ను రాణి జావెలిన్‌ను 61.12 మీటర్ల దూరం విసిరి ఏడో స్థానంలో నిలువగా... డిఫెండింగ్ చాంపియన్ కెల్సీ బార్బర్ (ఆస్ట్రేలియా; 66.91 మీటర్లు) స్వర్ణం సాధించింది. -
నితిన్‌కు రెండు పతకాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అండర్– 20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇస్లావత్ నితిన్ నాయక్ రెండు పతకాలు సాధించాడు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి అథ్లెటిక్స్ స్టేడియంలో జరిగిన ఈ పోటీల్లో నితిన్ నాయక్ పురుషుల 100 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకం, 200 మీటర్ల విభాగంలో రజత పతకం గెల్చుకున్నాడు. కోచ్ నేనావత్ వినోద్ వద్ద శిక్షణ పొందుతున్న నితిన్ నాయక్ 100 మీటర్లను 10.9 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. 200 మీటర్ల రేసును నితిన్ 22.4 సెకన్లలో ముగించి రెండో స్థానంలో నిలిచాడు. ఈ ప్రదర్శనతో నితిన్ వచ్చే నెల 2 నుంచి 4 వరకు గుజరాత్లో జరగనున్న జాతీయ అండర్–20 ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ జట్టులోకి ఎంపికయ్యాడు. -
Under 23 Athletics Championships: సత్తా చాటుతున్న మన అమ్మాయిలు
న్యూఢిల్లీ: జాతీయ అండర్–23 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మహిళల 100 మీటర్ల విభాగంలో తెలంగాణకు చెందిన నిత్య గాంధె, నకిరేకంటి మాయావతి ఫైనల్లోకి దూసుకెళ్లారు. సోమవారం జరిగిన 100 మీటర్ల హీట్స్‌లో నిత్య 11.91 సెకన్లతో రెండో స్థానంలో, మాయావతి 12.40 సెకన్లతో ఎనిమిదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు. రెండు హీట్స్‌లో అత్యుత్తమ సమయం నమోదు చేసిన ఎనిమిది మందికి ఫైనల్ బెర్త్ లభించింది. మహిళల 1500 మీటర్ల ఫైనల్లో తెలంగాణకు చెందిన భాగ్యలక్ష్మి ఆరో స్థానంలో నిలిచింది. పురుషుల 400 మీటర్ల విభాగంలో నక్కా రాజేశ్ (ఆంధ్రప్రదేశ్), 110 మీటర్ల హర్డిల్స్‌లో యశ్వంత్ (ఆంధ్రప్రదేశ్) ఫైనల్ చేరారు. చదవండి: Vennam Jyothi Surekha: కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో జ్యోతి సురేఖ.. ఏకంగా -
ప్రణవ్, సత్యలకు స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: టాటా గ్లోబల్ బెవరేజెస్, భారత అథ్లెటిక్స్ సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ‘చాంపియన్‌షిప్ ఆఫ్ అథ్లెటిక్స్’ టోర్నమెంట్లో కె. ప్రణవ్, పి. సత్య సత్తా చాటారు. గచ్చిబౌలి అథ్లెటిక్స్ స్టేడియంలో బుధవారం జరిగిన ఈ టోర్నీ లాంగ్ జంప్ ఈవెంట్లో వీరిద్దరూ విజేతలుగా నిలిచి స్వర్ణాలను కైవసం చేసుకున్నారు. బాలుర విభాగంలో కె. ప్రణయ్ విజేతగా నిలవగా... జి. పరశురామ్, పి. వినోద్ వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. బాలికల కేటగిరీలో సత్య, సవిత, గాయత్రి వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. అండర్–16 కేటగిరీలో జరిగిన ఈ టోర్నీలో లాంగ్‌జంప్‌తో పాటు 100మీ. పరుగు, 400మీ. పరుగు, 800మీ. పరుగు, షాట్‌పుట్ ఈవెంట్లలో పోటీలను నిర్వహించారు. ప్రతీ పోటీలోనూ విజేతగా నిలిచిన వారు ఆలిండియా ఫైనల్స్ అథ్లెటిక్స్ టోర్నీలో పాల్గొనే అవకాశాన్ని అందుకున్నారు. ఆలిండియా ఫైనల్స్‌లోనూ సత్తా చాటిన వారు ప్రపంచ ఫైనల్స్‌కు అర్హత పొందుతారు. ఇతర ఈవెంట్ల విజేతల వివరాలు 100మీ.పరుగు బాలురు: 1. టి. అంజి కుమార్, 2. వి. దుర్గా సాయి గణేశ్, 3. డి. దీపక్; బాలికలు: 1. ఎం. శ్రుతి, 2. ఎం. మనీషా, 3. టి. శ్రీ తేజ. 400మీ. పరుగు బాలురు: 1. సీహెచ్ రాజు, 2. ఎస్. యుగేందర్, 3. లక్ష్మణ్ నాయక్; బాలికలు: 1. ఎల్. కీర్తన, 2. డి. సాయి సంగీత, 3. ఎల్. వాణి. 800మీ. పరుగు బాలురు: 1. బి. నరేశ్, 2. ఎం. గంగా వరప్రసాద్, 3. ఎం. ఈశ్వర్; బాలికలు: 1. ఎం. మల్లిక, 2. సీహెచ్. కీర్తన, 3. సీహెచ్ జ్యోతి. షాట్‌పుట్ బాలురు: 1. కె. అనిల్, 2. శ్రీధర్, 3. విష్ణు; బాలికలు: 1. కె. రాజేశ్వరి, 2. ఎం. రమ్యశ్రీ, 3. ఎన్. భువనేశ్వరి. -
తెలంగాణ నుంచి బరిలో 115 మంది
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా పోటీల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తెలంగాణ రాష్ట్ర జట్టు సిద్ధమైంది. గువాహటిలో నేటి నుంచి 22వ తేదీ వరకు జరిగే ఈ పోటీల్లో రాష్ట్రానికి చెందిన 115 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. మొత్తం 16 క్రీడాంశాల్లో తెలంగాణ క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించనున్నారు. అండర్–17, అండర్–21 బాలబాలికల విభాగాల్లో జరిగే ఈ మెగా టోర్నీలో 90 మంది వ్యక్తిగత ఈవెంట్లలో, 24 మంది టీమ్ విభాగాల్లో పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్ర జట్టుకు చెఫ్ డి మిషన్‌గా రవీందర్ వ్యవహరించనున్నారు. రాష్ట్ర జట్ల వివరాలు: ∙ ఆర్చరీ: శంకర్ పట్నాయక్, కె. సింధూజ. అథ్లెటిక్స్: మహేశ్, అనికేత్, రుచిత, పద్మశ్రీ, దీప్తి, అక్షయ్చౌదరీ, జి. మహేశ్వరి, నందిని, బ్యాడ్మింటన్: నవనీత్, పి. విష్ణు, సామియా ఇమాద్ ఫరూఖీ, శ్రీవిద్య, గంధం ప్రణవ్, పుల్లెల గాయత్రి, మొహమ్మద్ ఖదీర్, శ్రీయ సాయి, మేఘన రెడ్డి, తరుణ్, అచ్యుతాదిత్య రావు బాక్సింగ్: నిహారిక. సైక్లింగ్: చిరాయుశ్, తనిష్క్, ఆశీర్వాద్ సక్సేనా, సాయిరామ్, ఉదయ్ కుమార్, ప్రణయ్, రాకేశ్, అరుణ్, యశ్వంత్ కుమార్, రాజ్‌కుమార్, దామోదర్ ముదిరాజ్. జిమ్నాస్టిక్స్: అక్షితి మిశ్రా, సురభి ప్రసన్న, విశాల్, అనన్య, సౌమ్య, సూర్యదేవ్, కె. సాయి హరిణి. జూడో: సాయిరామ్ దేవేందర్. కబడ్డీ: అంజి, ప్రవీణ్ కుమార్, జి. రాజు, శివకుమార్, రాజు నాయక్, తేజావత్ శ్రీనాథ్, మనోజ్, శ్రీ ప్రకాశ్, మేఘావత్ లక్కీరామ్, సుశాంక్, సంతోష్, సాహిల్. ఖో–ఖో: శ్రీరామ్, అన్వేశ్, ప్రసాద్, మనోజ్, ఉదయ్ కుమార్, జీవిత్ రావు, టి. మహేశ్, గణేశ్, వెంకటేశ్, సోమరాజు, తరుణ్ కుమార్, సతీశ్, అశోక్, సాయికుమార్, మన్మథరావు, జగపతి, ప్రవీణ్ కుమార్, నరేశ్ నాయక్, ప్రశాంత్, మహేందర్, నరేశ్, శ్రీనాథ్, హేమంత్, వసంతరావు. షూటింగ్: రుద్రరాజు ఆయుశ్, హోమాన్షిక రెడ్డి, ధనుశ్ శ్రీకాంత్, జహ్రా ముఫద్దల్ దీసవాలా, మునేక్, కాత్యాయని, ధీరజ్. స్విమ్మింగ్: గోలి జాహ్నవి, వై. జశ్వంత్ రెడ్డి, సాయి నిహార్, తనుజ్. టేబుల్ టెన్నిస్: ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్, నైనా, మొహమ్మద్ అలీ, వరుణి. టెన్నిస్: శ్రీవల్లి రష్మిక భమిడిపాటి, సంస్కృతి దామెర, సంజన సిరిమల్ల, సాయికార్తీక్ రెడ్డి, శ్రావ్య శివాని, ఆయుశ్, సామ సాత్విక, వేదరాజు ప్రపూర్ణ, తీర్థశశాంక్. వెయిట్ లిఫ్టింగ్: ఎం. హనుమాన్ నిహాల్రాజ్, కార్తీక్, గణేశ్, సాహితి, గంగా భవాని, గురునాయుడు, సాగరిక, గంగోత్రి, స్వప్న, అనూష, సింధూజ, రాజేశ్వరి, శివాని, అఖిల్. -
‘ఆసియా మాస్టర్స్’లో దివ్యారెడ్డికి మరో స్వర్ణం
కుచింగ్: మలేసియాలో జరుగుతోన్న ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 40 ఏళ్ల మహిళల వయో విభాగం 1500మీ. పరుగులో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ అథ్లెట్ బొల్లారెడ్డి దివ్యారెడ్డి స్వర్ణ పతకం సాధించారు. అంతకుముందు మలేసియాలోని సారావక్‌లో జరుగుతున్న ఈ చాంపియన్‌షిప్‌లో దివ్యా రెడ్డి రెండు పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. 40 ఏళ్ల వయో విభాగంలో 800 మీటర్ల కేటగిరీలో విజేతగా నిలిచి స్వర్ణం సొంతం చేసుకోగా... 400 మీటర్ల విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. 800 మీటర్ల ఫైనల్లో దివ్యా రెడ్డి అందరికంటే ముందుగా 2 నిమిషాల 53.64 సెకన్లలో గమ్యానికి చేరి చాంపియన్‌గా అవతరించింది. గో తెంగ్ యిన్ (మలేసియా– 2ని:54.15 సెకన్లు) రజతం... అమితా కనెగాంకర్ (భారత్–2ని:54.73 సెకన్లు) కాంస్యం సాధించారు. -
‘టైమ్–100 నెక్ట్స్’ జాబితాలో ద్యుతీ
న్యూఢిల్లీ: భారత మహిళా స్టార్ అథ్లెట్, ఆసియా క్రీడల్లో 100, 200 మీటర్ల విభాగాల్లో రజత పతకాలు నెగ్గిన ద్యుతీచంద్‌కు ‘టైమ్–100 నెక్ట్స్’ జాబితాలో చోటు దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా రాబోయే రోజుల్లో ప్రభావం చూపగల వ్యక్తుల జాబితాలో ఆమెకు క్రీడల కేటగిరీలో చోటు లభించింది. వ్యాపారం, వినోదం, క్రీడలు, రాజకీయాలు, ఆరోగ్యం, సైన్స్ రంగాల్లో అత్యంత ప్రభావశీలురను గుర్తించి టైమ్ మేగజైన్ ప్రతీయేటా ఈ జాబితాను తయారు చేస్తుంది. ఈ జాబితాలో స్థానం దక్కడంపై ద్యుతీచంద్ సంతోషం వ్యక్తం చేసింది. -
జావెలిన్ త్రోలో సందీప్‌కు స్వర్ణం
దుబాయ్: ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్ పతకాల బోణీ చేసింది. దుబాయ్‌లో శుక్రవారం జరిగిన పురుషుల జావెలిన్ త్రో (ఎఫ్ 42–64 కేటగిరీ) అంశంలో భారత క్రీడాకారులు సందీప్ చౌదరీ, సుమీత్ అంటిల్ (62.88 మీటర్లు) వరుసగా స్వర్ణ, రజత పతకాలు సాధించి వచ్చే ఏడాది జరిగే టోక్యో పారాలింపిక్స్‌కు అర్హత పొందారు. సందీప్ జావెలిన్‌ను 66.18 మీటర్ల దూరం విసిరి ఈ విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. గత జూన్‌లో 65.80 మీటర్లతో తానే నెలకొల్పిన ప్రపంచ రికార్డును సందీప్ బద్దలు కొట్టాడు. పురుషుల డిస్కస్ త్రో (ఎఫ్ 52 విభాగం)లో వినోద్ కుమార్ ఇనుప గుండును 19.29 మీటర్ల దూరం విసిరి నాలుగో స్థానంలో నిలిచాడు. టాప్–4లో నిలువడం ద్వారా వినోద్ టోక్యో పారాలింపిక్స్‌కు అర్హత సాధించాడు. -
మెరిసిన పరశురామ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అంతర్ జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ తొలి రోజు పరశురామ్ (కామారెడ్డి), శివాని (ఖమ్మం), కావ్య (నల్లగొండ) స్వర్ణ పతకాలతో మెరిశారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి అథ్లెటిక్స్ స్టేడియంలో శనివారం జరిగిన బాలుర అండర్–14 లాంగ్ జంప్, ట్రయాథ్లాన్ విభాగాల్లో పరశురామ్ స్వర్ణాలు సాధించాడు. లాంగ్ జంప్‌లో పరశురామ్ 5.93 మీటర్ల దూరం దూకి మొదటి స్థానంలో నిలవగా... ఆర్.సెహ్వాగ్ (కామారెడ్డి) 5.89 మీటర్లు దూకి రెండో స్థానంలో... పి.లిఖిత్ అభినయ్ (భద్రాద్రి కొత్తగూడెం) 5.76 మీటర్లతో మూడో స్థానంలో నిలిచారు. బాలుర అండర్–14 ట్రయాథ్లాన్ విభాగంలో పరశురామ్ 1711 పాయింట్లతో పసిడి పతకాన్ని గెలవగా... వివేక్ చంద్ర (ఖమ్మం) 1659 పాయింట్లతో రజతాన్ని, నరేశ్ (టీఏఏ) కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. బాలికల అండర్–14 ట్రయాథ్లాన్ విభాగంలో శివాని (ఖమ్మం) 1609 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఝాన్సీ (హైదరాబాద్) 1523 పాయింట్లతో రజతాన్ని, ఎల్.వాణి (మహబూబాబాద్) 1278 పాయింట్లతో కాంస్యాన్ని దక్కించుకున్నారు. ఇతర పతక విజేతలు అండర్–14 బాలుర విభాగం: 100మీ: 1. ఎస్ హర్షవర్ధన్ (హైదరాబాద్) 2. ఎ.గౌతమ్ (ఖమ్మం). 3. బి. భాను ప్రకాశ్ (భద్రాద్రి కొత్తగూడెం). హై జంప్: 1. కె.ప్రణయ్ (మంచిర్యాల) 2. బి.నరేశ్ (టీఏఏ) 3. బి.విష్ణువర్ధన్ (సిద్దిపేట). అండర్–16 బాలుర విభాగం: 500మీ రేస్ వాక్: 1.రాజ్ మిశ్రా (రంగారెడ్డి) 2.డి.జగదీశ్ (నల్లగొండ) 3. ఎడ్ల విష్ణువర్ధన్ (జగిత్యాల). డిస్కస్ త్రో: 1.ఇ. గణేశ్ (ఖమ్మం) 2. కె. ఆదినారాయణ (భద్రాద్రి కొత్తగూడెం) 3.ఎస్కె. అఫ్తాబ్ (ఖమ్మం) 100మీ: 1. కె.దిలీప్ (జగిత్యాల) 2. ఎ. తరుణ్ (కరీంనగర్) 3. రాహుల్ సాయి (సూర్యాపేట). 400మీ: 1.మహేశ్ (మంచిర్యాల) 2. కార్తీక్ (వరంగల్ అర్బన్) 3.వినీత్ కుమార్ (మహబూబ్‌నగర్) బాలుర అండర్–18: 1000మీ రేస్ వాక్: 1. దుర్గారావు (వరంగల్ అర్బన్) 2. ఎస్. అజయ్ (ఆదిలాబాద్) 3. ఎ. ప్రదీప్ (సూర్యాపేట) డిస్కస్ త్రో: 1. ప్రశాంత్ (వరంగల్ అర్బన్) 2. రాజు (వికారాబాద్) 3. శ్రీకాంత్ (నల్లగొండ). లాంగ్ జంప్: 1. శ్రీకాంత్ (జయశంకర్ భూపాలపల్లి) 2. నిశాంక్ (సిద్దిపేట) 3. మురళి (ఖమ్మం). 100మీ: 1. శ్రీకాంత్ నాయక్ (వరంగల్ అర్బన్) 2. జోగులు (రంగారెడ్డి) 3. శరత్ చంద్ర (రంగారెడ్డి). 400మీ: 1.అభిశేఖర్ (వరంగల్ అర్బన్) 2. వెంకట అఖిలేశ్ (రంగారెడ్డి) 3. హరీశ్ (వరంగల్ అర్బన్). బాలుర అండర్–20: డిస్కస్ త్రో: యశ్వంత్ (వరంగల్ అర్బన్) 2. రాఘవేంద్ర (కరీంనగర్) 3. ప్రదీప్ (యాదాద్రి భువనగిరి). షాట్‌పుట్: 1. సత్యవాన్ (హైదరాబాద్) 2. యశ్వంత్ (వరంగల్ అర్బన్) 3.తిరుమల్ (టీఏఏ) 100మీ: 1.రామ్ ప్రసాద్ (భద్రాద్రి కొత్తగూడెం) 2. నవీన్ కుమార్ (భద్రాద్రి కొత్తగూడెం) 3. ఎస్. సాయి (భద్రాద్రి కొత్తగూడెం). 400మీ: 1. శివతేజ వైభవ్ (నల్లగొండ) 2. వంశీ కృష్ణ (భద్రాద్రి కొత్తగూడెం) 3. పాండు నాయక్ (రంగారెడ్డి). బాలికల అండర్–14: షాట్‌పుట్: 1. పూజ (మెదక్) 2. మనవిని (హైదరాబాద్) 3. వందన (భద్రాద్రి కొత్తగూడెం). 100మీ: 1. సుష్మిత (మహబూబాబాద్) 2. సాయి సంగీత (మహబూబ్‌నగర్) 3. కృతి (హైదరాబాద్). బాలికల అండర్–16: 3000మీ రేస్ వాక్: 1. ఝాన్సీ (కరీంనగర్) 2. మౌనిక (మంచిర్యాల) 3. అక్షిత (జగిత్యాల). షాట్‌పుట్: 1. వైష్ణవి (రంగారెడ్డి) 2.అదితి సింగ్ (హైదరాబాద్) 3. నవ్య పండిత్ (హైదరాబాద్). 100మీ: 1.మాయావతి (నల్లగొండ) 2. రాగవర్షిణి (హైదరాబాద్) 3. వమిక అనిల్ (మేడ్చల్). బాలికల అండర్–18: 5000మీ రేస్ వాక్: 1. ధనూష (కరీంనగర్) 2. నవ్య (జగిత్యాల) 3. శ్రావణి (భద్రాద్రి కొత్తగూడెం). 100మీ: 1. దీప్తి (వరంగల్ అర్బన్) 2. కీష మోది (రంగారెడ్డి) 3. శ్లోక (రంగారెడ్డి). బాలికల అండర్–20: 400మీ: 1. కావ్య (నల్లగొండ) 2.కీర్తి (హైదరాబాద్) 3. మౌనిక (నల్లగొండ). బాలికల అండర్– 20 100మీ.: 1. కవిత (కరీంనగర్), 2. సుష్మా బాయి (భద్రాద్రి కొత్తగూడెం), 3. దివ్యా పావని (భద్రాద్రి కొత్తగూడెం). -
భారత్‌కు ఆరు స్వర్ణ పతకాలు
న్యూఢిల్లీ: యూరేసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్లు మెరుగైన ప్రదర్శన కనబరిచారు. కజకిస్తాన్‌లోని అల్మటీలో రెండు రోజుల పాటు జరిగిన ఈ అండర్–20 చాంపియన్‌షిప్‌లో 6 స్వర్ణాలు, 3 రజత పతకాలను సాధించారు. గురువారం జరిగిన బాలుర 800 మీటర్ల పరుగులో శ్రీకిరణ్ లక్ష్యాన్ని 1 నిమిషం 54.62 సెకన్లలో పూర్తి చేసి పసిడి పతకాన్ని గెలుచుకున్నాడు. జావెలిన్ త్రో ఈవెంట్లో రోహిత్ యాదవ్ ఈటెను 74.55 మీటర్ల దూరం విసిరి స్వర్ణాన్ని అందుకున్నాడు. 4/400 మీటర్ల మిక్స్డ్ రిలేలో అబ్దుల్ రజాక్, ప్రిసిల్లా డేనియల్, ఫ్లోరెన్స్ బర్లా, విక్రాంత్ పాంచల్‌లతో కూడిన భారత బృందం 3 నిమిషాల 30.58 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానంలో నిలిచింది. బాలుర 400 మీటర్లలో అబ్దుల్ రజాక్, బాలికల 800 మీటర్ల పరుగులో ప్రిసిల్లా డేనియల్, బాలుర జావెలిన్ త్రోలో సాహిల్ సిల్వాల్ రజత పతకాలను సాధించారు. పోటీల తొలిరోజు బుధవారం గుర్వీందర్ సింగ్ (100 మీటర్లు), విక్రాంత్ పాంచల్ (400 మీటర్లు), ఫ్లోరెన్స్ బర్లా (400 మీటర్లు) స్వర్ణాలను అందించారు. -
స్వప్నకు రజతం
దోహా: ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మూడో రోజు భారత్‌కు మూడు పతకాలు లభించాయి. ఏడు అంశాల సమాహారమైన హెప్టాథ్లాన్‌లో భారత అ మ్మాయి స్వప్నా బర్మన్ రెండో స్థానంలో నిలిచి రజత పతకం గెలిచింది. లాంగ్‌జంప్, 800 మీటర్లు, 200 మీటర్లు, షాట్‌పుట్, 100 మీటర్ల హర్డిల్స్, హైజంప్, జావెలిన్ త్రో అంశాల్లో పోటీపడిన స్వప్నా బర్మన్ మొత్తం 5993 పాయింట్లు స్కోరు చేసింది. ఉజ్బెకిస్తాన్ అమ్మాయి ఎకతెరీనా వొర్నినా (6198 పాయి ంట్లు) స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. భారత్‌కే చెందిన పూర్ణిమ హెంబ్రామ్ (5528 పాయింట్లు) ఐదో స్థానంలో నిలిచింది. 4గీ400 మీటర్ల మిక్స్డ్ రిలేలో మొహమ్మద్ అనస్, పూవమ్మ, విస్మయ, అరోకియా రాజీవ్‌లతో కూడిన భారత బృందం 3 నిమిషాల 16.71 సెకన్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని దక్కించుకుంది. మహిళల 10000 మీటర్ల రేసులో సంజీవని 32ని:44.96 సెకన్లలో గమ్యానికి చేరి కాంస్య పతకాన్ని గెలిచింది. మహిళల 200 మీటర్ల విభాగంలో ద్యుతీ చంద్ సెమీఫైనల్‌కు... పురుషుల 1500 మీటర్ల విభాగంలో అజయ్ కుమార్ సరోజ్ ఫైనల్‌కు అర్హత సాధించారు. -
20 బంగారు పతకాలతో అగ్రస్థానం
కొలంబో: మొదటి రోజు 11 స్వర్ణాలతో మెరిసిన అథ్లెట్లు రెండో రోజు 9 బంగారు పతకాలతో సత్తా చాటడంతో దక్షిణాసియా జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్ అగ్రస్థానాన నిలిచింది. ఏడు దేశాలు తలపడిన ఈ మీట్ ఆదివారంతో ముగిసింది. మొత్తం 20 స్వర్ణాలు, 22 రజతాలు, 8 కాంస్యాలతో భారత్ పతకాల పట్టికలో మొదటి స్థానం దక్కించుకుంది. 12 స్వర్ణాలు, 10 రజతాలు, 19 కాంస్యాలతో ఆతిథ్య శ్రీలంక ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన భారత క్రీడాకారులు జపాన్‌లోని జిఫులో వచ్చే నెల 7 నుంచి 10 వరకు నిర్వహించే ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు. -
ప్రపంచ పారా అథ్లెటిక్స్‌లో అమిత్‌కు రజతం
లండన్: ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్ అమిత్ కుమార్ సరోహ రజత పతకం సాధించాడు. పురుషుల క్లబ్ త్రో ఎఫ్51 పోటీల్లో అతను 30.25 మీటర్లతో రెండో స్థానంలో నిలిచాడు. తన మూడో ప్రయత్నంలో ఈ ప్రదర్శన చేయడం ద్వారా అమిత్ కొత్త ఆసియా రికార్డును నమోదు చేశాడు. ఈ ఈవెంట్లో జెల్జ్కో (సెర్బియా; 31.99 మీ.) ప్రపంచ రికార్డు నెలకొల్పి బంగారు పతకం నెగ్గాడు. భారత్‌కే చెందిన ధరంబిర్ (22.34 మీ.) పదో స్థానంలో నిలిచాడు. అమిత్ కుమార్ నేడు (మంగళవారం) డిస్కస్ త్రో ఎఫ్52 ఈవెంట్లో కూడా పోటీపడనున్నాడు. ఈ టోర్నీలో భారత్‌కు చెందిన సుందర్ సింగ్ గుర్జర్ జావెలిన్ త్రో ఎఫ్46లో బంగారు పతకం గెలిచిన సంగతి తెలిసిందే.