
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అండర్– 20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇస్లావత్ నితిన్ నాయక్ రెండు పతకాలు సాధించాడు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి అథ్లెటిక్స్ స్టేడియంలో జరిగిన ఈ పోటీల్లో నితిన్ నాయక్ పురుషుల 100 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకం, 200 మీటర్ల విభాగంలో రజత పతకం గెల్చుకున్నాడు. కోచ్ నేనావత్ వినోద్ వద్ద శిక్షణ పొందుతున్న నితిన్ నాయక్ 100 మీటర్లను 10.9 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. 200 మీటర్ల రేసును నితిన్ 22.4 సెకన్లలో ముగించి రెండో స్థానంలో నిలిచాడు. ఈ ప్రదర్శనతో నితిన్ వచ్చే నెల 2 నుంచి 4 వరకు గుజరాత్‌లో జరగనున్న జాతీయ అండర్–20 ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ జట్టులోకి ఎంపికయ్యాడు.